జీవిత లోతుల్లోకి వెళ్ళి సహజసిద్ధమైన రీతిలో సృజనాత్మకంగా రాయబడ్డ నవల అంపశయ్య! అంతేకాదు, చాలా ధైర్యంగా ప్రయోగానికి పెద్దపీట వేయడంతో కూడా ఈ నవల చాలా ప్రఖ్యాతి గాంచింది. వీటన్నింటికి తోడుగా ప్రతిభ, చిత్తశుద్ధి కూడా తోడవడంతో తెలుగు సాహిత్యంలో అంపశయ్య ఒక క్లాసికల్‌గా నిలిచిపోయింది.

యూలిసెస్‌, జేమ్స్‌ జాయిస్‌ (1922);అంపశయ్య, నవీన్‌ (1968)- ఈ రెండు నవలలు వ్యక్తి ప్రధాన పాత్రగా నడిచేవే! అలాగే చైతన్య స్రవంతి కలవే. ప్రేమదాహం (కామ ప్రకోపంతోసహా) వస్తువులో ప్రము ఖంగా ఉండడం రెండింటిలో సరి సమానమే! ఈ చైతన్య స్రవంతి శైలిని తెలుగులో మనో వైజ్ఞానిక రచన లేదా నవల అని కూడా అంటారు. ఈ శైలిని మొట్టమొదట తెలుగులో ప్రయోగించింది (జేమ్స్‌ జాయిస్‌ ప్రభావంతో) బుచ్చిబాబు. చైతన్య స్రవంతి కథ, విడిచేసిన అసలు విషయంకథ, తదితరమైనవి ఆయన ఈ ధోరణిలోనే రాసాడు. ఈ శైలిలోనే రావిశాస్త్రి అల్పజీవి; వడ్డెర చండీదాస్‌ అనుక్షణికం, హిమజ్వాల తదితర రచనలు తెలుగు సాహిత్యంలో వెలువడ్డాయి.

ఇంకా ఎంతోమంది (ఈ వ్యాస రచయితతో సహా) తెలుగు రచయితలు ఈ శైలిని అడాప్ట్‌చేసుకున్నారు. ప్రముఖంగా ఈ చైతన్య స్రవంతి శైలి ప్రయోగాత్మకమైనది. జేమ్స్‌ జాయిస్‌ ఈ రచనా శైలి ప్రయోగించి దాదాపు ఒక దశాబ్దం కావస్తున్నది. ఐనప్పటికీ ఈ శైలిని ఎవరైనా అనుకరిస్తే అది నూతనంగానే తోస్తుంది. అంటే ఒక శతాబ్దం కిందటే చేసిన జేమ్స్‌ జాయిస్‌ ప్రయోగం ఎంత నిత్యనూతనమైనదో మనకు అవగతమవుతుంది.

ఇజ్రా పౌండ్‌ అనే మరో సృజనశీలి జేమ్స్‌ జాయిస్‌ సాహిత్యంతోనే కాకుండా టి.ఎస్‌.ఇలియట్‌ (పొయట్‌ ఆఫ్‌ ది సెంచరీ) సాహిత్యంతో అను బంధం కలవాడు. పై రచయితలు ఇద్దరి సాహి త్యాన్ని సంస్కరించడంలో కాని లేక సహాయ సహకారాలు అందించడంలో కాని ఇజ్రా పౌండ్‌ ఎంతో పేరుగాంచాడు. ప్రేమ కవిత్వంతో జాయిస్‌ 1907లో రచించిన  ఛాంబర్‌ మ్యూజిక్‌అనే పుస్తకానికి మించిన పుస్తకం మరొకటి లేదనిపిస్తుంది నాకు.

ఇంక మన ఇంటి వ్యవహా రానికొస్తే- తెలుగులో వచ్చిన మంచి నవలల్లో, లేక ఎంపిక చేసిన నవలల్లో నవీన్‌ అంప శయ్యఎప్పుడో స్థానం సంపాదిం చుకొంది. విచిత్రంగా- నవీన్‌ రాసిన మొదటి నవల అంపశయ్య. ఆ తరు వాత్తరువాత ఆయన ఎంతో సాహి త్యాన్ని సృష్టించాడు. అదంతా అంప శయ్యకి భిన్నంగా కనిపిస్తుంది. అలా చాలా పేరుతెచ్చే కళాఖండం (రచన) ఏ రచయితకైనా, కళాకారుడికైనా ఒక్క సారే సంభవిస్తుందేమో.

ఈ వ్యాసం ప్రారంభం నుండి ఇంతవరకు వివరిస్తూ వచ్చినట్లు, జేమ్స్‌ జాయిస్‌ జ్ఞాపకం రాకుండా అంపశయ్య రచయితైన నవీన్‌ జ్ఞాపకం రాడు. ఇంత ఐనప్పటికి- డబ్లిన్‌కి హైద రాబాద్‌కి మానసికమైన దూరం లేదు. ప్రభావం ఎంత గాఢమైనప్పటికీ నవీన్‌ మన ప్రాంతానికి సంబంధించిన కథని తీసుకొని నాయకుడు రవి పాత్రని తీర్చిదిద్దిన తీరు, అలాగే స్థానిక వాతా వరణాన్ని అత్యంత సహజంగా ప్రతిబింబిస్తూ రచన సాగించిన పద్ధతీ ఎంతో  ప్రశంసనీయంగా ఉంది. నవీన్‌ తన రచనలో అత్యంత ప్రతిభ కనపరిచాడు. బహుశ తన నిజ జీవితంలోని ఎన్నో అంశాలు ఈ నవలలో ఎంతో శక్తిమంతంగా రూపు దిద్దుకున్నాయి కాబోలు. ఆ రకంగా రచయిత అదృష్టవంతుడు. ఎందుకంటే తెలుగు భాషలో వేలకొద్దిగా వచ్చిన నవలల్లో అతికొద్ది మంచి నవలల్లోఅంపశయ్య ఒకటి అయ్యిందంటే రచయితను మనం ఎంతో అభినందించాలి. అంపశయ్య విజయాన్ని తెలుగు సాహిత్యలోకం మరోసారి తలచుకునే సందర్భాన్ని అతడు కళ్ళారా చూడడం చాలా అబ్బురమైన విషయం.

జీవిత లోతుల్లోకి వెళ్ళి సహజసిద్ధమైన రీతిలో సృజనాత్మకంగా రాయబడ్డ నవల అంపశయ్య! అంతేకాదు, చాలా ధైర్యంగా ప్రయోగానికి పెద్ద పీట వేయడంతో కూడా ఈ నవల చాలా ప్రఖ్యాతి గాంచింది. వీటన్నింటికి తోడుగా ప్రతిభ, చిత్తశుద్ధి కూడా తోడవడంతో తెలుగు సాహిత్యంలో అంపశయ్య ఒక క్లాసికల్‌గా నిలిచిపోయింది. ఈ వయసులో నవీన్‌, అంపశయ్య నవల కథా గురించి ఆలోచిస్తే, అతడిని ఎలాంటి అనుభూతి వెంటాడుతుందో అని ఆలోచిస్తూ ఆశ్చర్యానికి గురవుతూంటాను. అన్నింటికి మించి నవీన్‌ ఉత్తముడు, మంచి స్నేహితుడు. నెగెటివ్‌ థింకింగ్‌ దరి చేరనియ్యనివాడు. అలాగే జీవితాంతం ఆయన ఒక వృత్తి రచయితగా ప్రఖ్యాతి గాంచాడు. తెలుగు సాహితీలోకంలో అతడిని ఎరగనివారు ఎవరూ ఉండరు.

శేషజీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ తెలుగు పాఠకులకు మరిన్ని మంచి రచనలను అందించాలని కోరుతూ, ఈ సందర్భంగా నవీన్‌ని గుండెలకు హత్తుకుని అభినందిస్తున్నాను.

బి. నరసింగరావు 

(అంపశయ్యనవల ప్రచురితమై యాభై ఏళ్ళయిన సందర్భంగా)