ఢిల్లీ మారణకాండపై రెండు వారాల తరువాత ఎట్టకేలకు హౌంమంత్రి అమిత్‌షా నోరువిప్పారు. అయితే పార్లమెంటు సాక్షిగా పచ్చి అబద్దాలు పలికారు. ఢిల్లీ మారణహౌమం పాలకుల ప్రమేయంతో సాగిందన్నది సత్యం. ‘ఇది ప్రణాళికతో కూడిన కుట్ర’ అని హౌం మంత్రి అమిత్‌షా పార్లమెంటులో వాస్తవాన్నే చెప్పారు. అయితే ”దీని వెనుక ప్రతిపక్షం, సీఏఏ వ్యతిరేకులు ఉన్నారు” అని పచ్చి అబద్ధం పలికారు. దేశ రాజధానిలో ఇంతటి ఘోరకలి సాగుతుంటే దానిని ఆపేందుకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయని మంత్రి, మీరు ఎందుకు స్పందించలేదన్న ప్రశ్నకు ”అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అహ్మదాబాద్‌లో ఉన్నారు. అది నా పార్లమెంటు నియోజకవర్గం. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌కు బాధ్యతలు అప్పగించాను” అని సమాధానం ఇచ్చారు. ప్రజల ప్రాణాల కన్నా అమెరికా అధ్యక్షుని మెప్పుపొందడమే మిన్న అని షా నిస్సిగ్గుగా శెలవిచ్చారు.

ఈ మారణహౌమం పోలీసుల సహకారం లేకుండా సాగదన్నది సత్యం. పోలీసుల తీరుకు పాలకుల ఆదేశమే కారణమన్నదీ అంతే సత్యం. నిజానికి ఈ మారణ కాండను ఆపలేనంత శక్తి హీనులు కారు ఢిల్లీ పోలీసులు. వారు పాలకుల వత్తిడికి లొంగకుంటే కచ్ఛితంగా మారణకాండను మొదట్లోనే అడ్డుకోగలిగేవారు. కానీ పాలకుల ఆదేశాలు వారి చేతులు కట్టేశాయి. వృత్తి ధర్మాన్ని మరిచి నేరస్తులకు కొమ్ముకాచి తామూ నేరస్తులుగా మిగిలిపోయారు. పోలీసుల ప్రత్యక్ష, పరోక్ష సహాయ సహకారాలతో రెచ్చిపోయిన మతోన్మాద మూకలు సాక్షాత్తూ దేశ రాజధాని నడిబొడ్డుమీదనే ఆడిన నెత్తుటి జలకాలాటలో 53మంది అభాగ్యుల ప్రాణాలు అనంతవాయివుల్లో కలిసిపోయాయి. వందలాది గృహాలు, వ్యాపార కేంద్రాలు, బడులూ బుగ్గిపాలయ్యాయి. దాదాపు 500మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రులపాలయ్యారు. ఇంత జరుగుతున్నా కేంద్ర హౌంమంత్రి ఆ నరమేధాన్ని ఆపేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయకుండా, తన మౌనంతో నేరస్తులకు పరోక్ష మద్దతు పలికారు. మంత్రి మౌనంలోని అసలు అర్థాన్ని గ్రహించిన ఆయన ఆధీనంలోని ఢిల్లీ పోలీసులు నేరస్తులకు చేతనైన సాయమందించి తమ స్వామి భక్తిని చాటుకున్నారు.

వాస్తవానికి, ఢిల్లీలో మారణకాండ జరిగే అవకాశమున్నదని ఆరు ఇంటెలిజన్స్‌ బృందాలు ప్రభుత్వాలను హెచ్చరించాయి. అయినా, ఢిల్లీ పోలీసులను తమ ఆధీనంలో ఉంచుకొని ఉన్న కేంద్ర పాలకులు, ఢిల్లీ నరమేధ ముష్కరులలో ఎక్కువమంది సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ పాలకులు స్పందించలేదు. ఉత్తరప్రదేశ్‌ నుంచి వందలాదిగా ఢిల్లీలో చొరబడి విధ్వంసం సృష్టించారని చెబుతున్న హౌంమంత్రి వారిని అడ్డుకునేందుకు తామేమి చేశారో చెప్పకుండా దాటవేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఉన్నది తమ పార్టీ ప్రభుత్వమేనన్న వాస్తవాన్ని మరుగు పరుస్తున్నారు. ఈ మారణకాండలో తమ వైఫల్యంకానీ, ప్రమేయంకానీ లేదని చెప్పుకొనేందుకు పడరాని పాట్లు పడ్డారు. నిండు సభలో నోటి కొచ్చిన అబద్దమల్లా ఆడారు. మారణహౌమాన్ని 36గంటల్లో ఆపిన పోలీసులను అభినందించారు. పోలీసుల పాత్రను ప్రశ్నించిన విపక్షాలకు ”బలగాలను ప్రశ్నించడమంటే వారిని నిరాశపరచడమే” అని నిందించారు. నిజమే! బలగాలను ఎవ్వరూ ప్రశ్నించకూడదు. సామూహిక హింసాకాండకు సహకరిస్తున్నా పోలీసులను ప్రశ్నించకూడదు. ఇదీ ఖాకీలపై కమలం అధినేతలకు ఉన్న అపారమైన ప్రేమ. కమలనాథులకు ఖాకీల అండ. ఖాకీలకు కమలనాథుల అండదండ.

సీఏఏ లాంటి తమ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా షాహీన్‌బాగ్‌ లాంటి చోట్ల ప్రజలు ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున స్థిరంగా ఉద్యమించడాన్ని కమలనాథులు జీర్ణించుకోలేక పోయారు.వారికి ఒక గుణపాఠం నేర్పడం ద్వారా, ఈ ఉద్యమాన్ని దేశ వ్యాప్తం కాకుండా ఆపేందుకు సిద్ధమయ్యారు. మూకలకు కత్తులు, కర్రలు, రాళ్ళు, ఇటుకలు, తుపాకులు, పెట్రోల్‌ బాంబులూ అందించి ప్రజల మీదకు వదిలారు. వారికి అడ్డూ ఆపూ లేకుండా పోలీసులను కట్టడి చేశారు. కాబట్టే అంతటి విధ్వంసం సృష్టించడం అల్లరి మూకలకు సాధ్యమయ్యింది. ‘దేశ ద్రోహులను కాల్చి పారేయాలి’ అంటూ బీజేపీ నాయకుడు కపిల్‌ మిశ్రా పోలీసు ఉన్నతాధికారి ముందే ఇచ్చిన పిలుపే విధ్వంసకాండ ప్రారంభానికి నాంది పలికిందని బాధితులు గుండెలు బాదుకుంటుంటే, పోలీసులు కపిల్‌మిశ్రాకు క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. ‘దేశ ద్రోహులను కాల్చి పారేయాలి’ అని కపిల్‌ మిశ్రా ఇచ్చిన పిలుపు ఏ వర్గాన్నీ ఉద్దేశించినది కాదనీ, అందువల్ల దానిని విద్వేష ప్రసంగంగా పరిగణించలేమని” రాత పూర్వకంగా కోర్టుకు తెలిపి తమ ప్రభు భక్తిని ప్రపంచానికి చాటారు.
పోలీసు వ్యవస్థ పాలకుల ముందు ఎలా సాగిలపడుతుందో మరోసారి రుజువయ్యింది. అలాగే తాము ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ప్రశ్నిస్తే న్యాయవ్యవస్థను సైతం తాము విడచిపెట్టమని, బాధితులకు తక్షణ సాయం అందించాలని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి మురళీధర్‌ అర్థరాత్రి బదిలీ ద్వారా ఓ హెచ్ఛరికను ప్రజలకు వినిపించింది కమలం సర్కార్‌. పోలీసు, న్యాయవ్యవస్థ ప్రజలను రక్షించే శక్తిని కోల్పోయిన తరువాత ఇక ప్రజల సంఘటిత శక్తి మాత్రమే వారిని రక్షించగలదు. ఢిల్లీలో మరింత విధ్వంసం, ప్రాణనష్టం జరగకుండా ప్రజల సంఘటిత శక్తే వారిని కాపాడింది. ఈ సంఘటిత శక్తే దేశ వ్యాప్తంగా మరింత విస్తృతం కావాలి. రాజ్య ప్రాయోజిత మతోన్మాద శక్తుల విధ్వంసకాండకు అడ్డుకట్ట వేయాలి.

Courtesy Nava Telangana