• నెల రోజులు ఇస్తానని అమితాబ్‌ బచ్చన్‌ ప్రకటన
  • పీఎం కేర్స్‌ ఫండ్‌కు మానవ వనరుల శాఖ 38 కోట్లు
  • నెల వేతనాన్ని ఇచ్చిన పర్యావరణ శాఖ ఉద్యోగులు
  • రూ. 8 కోట్లు ఇచ్చిన ఇండియన్‌ బ్యాంక్‌ ఉద్యోగులు

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ముందుకొచ్చారు. ఆల్‌ ఇండియా ఫిల్మ్‌ ఎంప్లాయీస్‌ కాన్ఫెడరేషన్‌కు చెందిన లక్ష మంది కార్మికులకు నెల రోజుల పాటు నిత్యావసరాలను అందజేస్తానని ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని సోనీ పిక్చర్స్‌, కల్యాణ్‌ జువెల్లర్స్‌ స్వాగతించాయి. కరోనా నియంత్రణకు కేంద్ర మానవ వనరుల శాఖ కింద ఉన్న 28 విభాగాలు పీఎం కేర్స్‌ ఫండ్‌కు రూ. 38 కోట్ల విరాళం ప్రకటించాయి. అంతకుముందు కేంద్ర మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ తన నెల వేతనం, ఎంపీల్యాడ్‌ నిధుల నుంచి రూ. కోటి విరాళం ప్రకటించారు. కేంద్రీయ విద్యాలయాల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది రూ. 10 కోట్లు, నవోదయ పాఠశాలలు రూ. 7.5 కోట్లు విరాళం ఇచ్చాయి. ఇండియన్‌ బ్యాంకు ఉద్యోగులు 43 వేల మంది రూ. 8.10 కోట్లను పీఎం కేర్స్‌ ఫండ్‌కు విరాళం అందజేశారు. పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు కూడా ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. లాక్‌డౌన్‌లో ప్రతీరోజు లక్ష మందికి ఆహారం అందజేస్తున్నామని జార్ఖండ్‌ సీఎం సోరెన్‌ తెలిపారు.

పేదలకు ఆహారం కోసం 10 మహీంద్రా కిచెన్లు
లాక్‌డౌన్‌ సమయంలో పేదలకు ఆహారం కోసం   మహీంద్రా సంస్థ దేశవ్యాప్తంగా 10 ప్రాంతాల్లో భారీ వంటశాలలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా వారం రోజుల్లో 50 వేల మందికి ఆహారం అందజేసినట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా సీయీవో పవన్‌ గోయెంకా తెలిపారు. 10 వేల మందికి రేషన్‌ ప్యాకెట్లు అందజేశామన్నారు. అంతే కాకుండా పేద ప్రజలకు ఆహారాన్ని అందించేందుకు ఇతరులు కూడా తమ కిచెన్లను వాడుకోవచ్చని సూచించారు.

Courtesy Andhrajyothi