ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ కరోనా బారిన పడ్డారు. దీంతో.. ఆయన ముంబైలోని నానావతి ఆసుపత్రిలో శనివారం సాయంత్రం చికిత్స నిమిత్తం చేరారు. ఈ విషయాన్ని బిగ్‌బీనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, ఆసుపత్రికి వెళ్లామని.. కుటుంబ సభ్యులు, సిబ్బంది కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారని.. రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లు అమితాబ్ ట్వీట్ చేశారు. గత 10 రోజులుగా తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించారు. అమితాబ్ వయసు ప్రస్తుతం 77 సంవత్సరాలు. బాలీవుడ్‌లో సింగర్ కనికా కపూర్ తర్వాత మళ్లీ ప్రముఖులెవరూ కరోనా బారిన పడలేదు. అమితాబ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

నానావ‌తి హాస్పిట‌ల్ నుంచి అమితాబ్ వీడియో సందేశం
నానావ‌తి హాస్పిట‌ల్‌లో జాయిన్ అయిన అమితాబ్ అక్క‌డ ప‌నిచేస్తున్న డాక్టర్స్‌, ఇత‌ర వైద్య సిబ్బంది స‌హా దేశంలో ప్ర‌జ‌లకు వైద్యం అందిస్తోన్న ఇత‌ర డాక్ట‌ర్స్‌, ఇత‌ర సిబ్బందికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తూ వీడియో సందేశం విడుద‌ల చేశారు.

‘‘నానావ‌తి హాస్పిట‌ల్‌లోని డాక్ట‌ర్స్‌, న‌ర్సులు, ఇత‌ర హాస్పిట‌ల్ సిబ్బంది గురించి మాట్లాడాల‌ను కుంటున్నాను. చాలా ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో వీరు అద్భుత‌మైన సేవ‌ల‌ను అందిస్తున్నారు. నేను ఈ మ‌ధ్య సూర‌త్‌లోని ఓ బోర్డ్‌ను నా ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాను. అందులో ఇప్పుడు దేవుడి గుళ్లు ఎందుకు మూసివేశారో తెలుసా? దేవుడు తెల్ల‌కోటు వేసుకుని హాస్పిట‌ల్లో ప‌నిచేస్తున్నాడని ఉంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ప‌నిచేస్తున్న వైద్య సిబ్బంది, ఇత‌రులు దైవ స్వ‌రూపులు. మాన‌వత్వం కోసం ప‌నిచేస్తున్నారు. ప్రాణ‌దాత‌లుగా మారారు. నేను మీకు చేతులెత్తి మొక్కుతున్నాను. మీరు లేక‌పోతే మ‌నుషులంతా ఏమైపోయేవారో. ఇవి నిరాశ జ‌న‌కంగా ఉన్న రోజుల‌ని నాకు తెలుసు. అంద‌రూ వారి ప‌రిధులు దాటి ప‌నిచేస్తున్నారు. మాన‌సిక ఒత్తిడి, భ‌యం నెల‌కుంది. కానీ నేను చెప్పేదొక్క‌టే ఎవ‌రూ భ‌య‌ప‌డొద్దు, నిరాశప‌డొద్దు. మ‌నమందం క‌లిసి పోరాడాల్సిన త‌రుణ‌మిది. అలా చేస్తేనే మ‌నం ఈ ప‌రిస్థితి నుండి బ‌య‌ట‌ప‌డ‌గ‌లం. నానావ‌తి హాస్పిట‌ల్ సిబ్బందికి ధ‌న్య‌వాదాలు. ఇలానే సేవ‌లు అందిస్తే దేశ‌మంతా మిమ్మ‌ల్ని ప్రేమతో, గౌర‌వంతో చూస్తుంది. దేవ‌డు మిమ్మ‌ల్ని చ‌ల్ల‌గా చూస్తాడు’’ అని వీడియోలో తెలిపారు అమితాబ్ బ‌చ్చ‌న్‌.

బిగ్‌బీ కోలుకోవాల‌ని సినీ ప్ర‌ముఖుల ట్వీట్స్‌
బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌కు క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ఆయ‌న ముంబైలోని నానావ‌తి హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వయంగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు ట్వీట్స్ చేశారు. బాలీవుడ్ స‌హా టాలీవుడ్‌, కోలీవుడ్ ఇత‌ర సినీ ప‌రిశ్ర‌మ‌ల సినీ ప్ర‌ముఖులు బిగ్‌బీ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటూ ట్వీట్స్ వేశారు. మ‌న తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ విష‌యానికి వ‌స్తే చిరంజీవి, నాగార్జున‌, మ‌హేశ్‌, ర‌వితేజ‌, సందీప్ కిష‌న్‌, గుణ‌శేఖ‌ర్‌, రాశీఖ‌న్నా, తాప్సీ, ప్రియ‌మ‌ణి, శ‌ర‌త్ కుమార్‌, రాధిక‌, నిత్యామీన‌న్ త‌దిత‌రులు అమితాబ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నామ‌ని తెలిపారు. మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన అగ్ర క‌థానాయ‌కులు మోహ‌న్‌లాల్‌, మ‌మ్ముట్టి కూడా అమితాబ్ ఆరోగ్యం కుదుట‌ప‌డాలంటూ ట్వీట్స్ చేశారు.

అమితాబ్ బాగానే ఉన్నారు: మ‌ంత్రి రాజేష్ తోపె
‌బాలీవుడ్ దిగ్గ‌జం అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడి, ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరారు. బిగ్ బి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉందని, అవ‌స‌ర‌మైన‌ చికిత్స అందిస్తున్నామ‌ని వైద్యులు తెలిపారు. ఇదిలావుండ‌గా అమితాబ్ బచ్చన్ బాగున్నారని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే తెలిపారు. అమితాబ్ క‌రోనా సంబంధిత తేలికపాటి లక్షణాలతో బాధ‌ప‌డుతున్నార‌న్నారు. కాగా కరోనావైరస్‌కు అధికంగా ప్రభావితమైన నగరాల్లో ముంబై ఒక‌టి. ఈ మ‌హాన‌గ‌రంలో క‌రోనా కేసుల సంఖ్య 9,1745గా ఉంది. అమితాబ్ బచ్చన్ కరోనా బారిన ప‌డ్డార‌ని తెలియ‌గానే, బాలీవుడ్ ప్ర‌ముఖులు బిగ్ బీ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థ‌న‌లు చేస్తున్నారు.

Coutesy AndhraJyothy