• లూయిస్‌ గ్లిక్‌ను వరించిన అత్యున్నత సాహితీ పురస్కారం
  • సాహిత్య నోబెల్‌ అందుకున్న 16వ మహిళ

స్టాక్‌హోమ్‌ : అమెరికన్‌ కవయిత్రి లూయీస్‌ ఎలిజబెత్‌ గ్లిక్‌(77) ఈ ఏటి ‘సాహిత్య నోబెల్‌’ పురస్కారానికి ఎంపికయ్యారు. 1943లో న్యూయార్క్‌లో జన్మించిన గ్లిక్‌ యేల్‌ యూనివర్సిటీలో ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. తన తల్లిదండ్రులు చెప్పిన గ్రీకు పురాణ కథలను, జోన్‌ ఆఫ్‌ ఆర్క్‌ లాంటి నిజ జీవిత సాహస గాథలను వింటూ పెరిగిన గ్లిక్‌ చిన్నవయసు నుంచే కవిత్వం రాసేవారు. అలా తాను రాసిన కవితలన్నింటినీ కలిపి 1968లో ‘ఫస్ట్‌బోర్న్‌’ పేరిట తొలి కవితా సంపుటి విడుదల చేసిన గ్లిక్‌ అమెరికా సమకాలీన సాహిత్య చరిత్రలో సుప్రసిద్ధురాలిగా పేరొందారు.

2003-2004 మధ్య ఆమె అమెరికా ఆస్థాన కవ యిత్రి! గ్లిక్‌ కవితల్లో భావోద్వేగాల సాంద్రత ఎక్కు వ. చరిత్ర, ప్రకృతి, వ్యక్తిగత అనుభూతులు, ఆధు నిక జీవితం వంటివి ఆమె కవితా వస్తువులు. 6 దశాబ్దాల్లో ఆమె విడుదల చేసిన కవితా సంపుటా లు 12 మాత్రమే. కవిత్వానికి సంబంధించి కొన్ని వ్యాసాలు కూడా రాశారామె. ఆమె కవితా సంపుటాల్లో కొన్నిటిని నోబెల్‌ కమిటీ ప్రత్యేకంగా ప్రస్తావించింది. నోబెల్‌ కన్నా ముందు గ్లిక్‌ కీర్తి కిరీటంలో నేషనల్‌ హ్యూమానిటీస్‌ మెడల్‌, పులిట్జర్‌ ప్రైజ్‌, నేషనల్‌ బుక్‌ అవార్డ్‌, నేషనల్‌ బుక్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌ అవార్డ్‌ వంటి మణులు, మాణిక్యాలు ఉన్నాయి. కలికితురాయి మాత్రం నోబెల్‌ పురస్కారమే. కాగా, సాహిత్య నోబెల్‌ పురస్కారం ఇప్పటిదాకా 15 మంది మహిళలకు ఇచ్చారు. ఆ ఘనత సాధించిన 16వ మహిళ లూయీస్‌ గ్లిక్‌.

Courtesy Andhrajyothi