యోగేంద్ర యాదవ్
(స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు)

అనేక ప్రజాస్వామ్య దేశాలలో అమెరికా ఒకటి మాత్రమే అని ప్రపంచం ఎట్టకేలకు తెలుసుకున్నది. ఆ దేశ ప్రజాస్వామ్యానికి దానిదైన శక్తిసామర్థ్యాలు ఉన్నాయి, అలాగే బలహీనతలూ ఉన్నాయి. మిగతా ప్రపంచానికి ప్రజాస్వామ్యం గొప్పదనం గురించి ఉపదేశించే ముందు ఇతర ప్రజాస్వామ్య సమాజాల నుంచి అది నేర్చుకోవల్సింది చాలా ఉంది. ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల్లో విజేత ఎవరైనప్పటికీ ఎన్నికల ప్రక్రియ తీరుతెన్నులూ, ఫలితమూ ఇదే పాఠాన్ని మరింతగా నొక్కిచెబుతాయి.

శ్వేతసౌధం నుంచి డోనాల్డ్ ట్రంప్ నిష్క్రమించాలని ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు కోరుకుంటున్నారు. ఆ శుభసమయం కోసం వారు ఆతురతతో ఎదురుచూస్తున్నారు. అయితే ప్రజాస్వామ్య జీవనసరళి, పాలనా పద్ధతులు మరింత మెరుగ్గా వర్ధిల్లాలని ఆశిస్తున్నవారు ఒకందుకు ట్రంప్‌కు కృతజ్ఞతాబద్ధులై ఉండాలి. అందరూ ఘనంగా చెప్పుకునే అమెరికా ప్రజాస్వామ్యం గొప్పదనం అనే దానిలో నిజం ఏమాత్రం లేదని నిరూపించిన ఏకైక ఘనుడు ఆయనే. ఉత్కృష్ట ప్రజాస్వామ్యానికి అమెరికా ఒక సమున్నత ఉదాహరణ అన్నది ఒక మిథ్యాభావనే అన్న అభిప్రాయానికి ఎందరో రావడానికి ట్రంప్ ప్రధాన కారకుడయ్యారు. ఇది చాలామందికి బాధాకరం కావచ్చు గానీ అంతిమంగా ప్రజాస్వామ్యవాదులకు అది ఒక శుభవార్తే.

ప్రజాస్వామ్య జీవనరీతుల్లో అమెరికా నమూనాను ధ్వంసం చేసిన ఘనతను పూర్తిగా ట్రంప్ మాత్రమే పొందకూడదు. అమెరికా రాజకీయాలకు సంబంధించి దాచలేకపోయిన రహస్యాలలో కొన్ని యావత్ప్రంచానికీ తెలిసేలా చేసిన వ్యక్తి ఆయనే. అక్కడి అగ్రనాయకులు కొంతమంది, ఇతర ప్రజాస్వామ్య సమాజాలలో వలే మేధోపరంగా, నైతికంగా సమున్నతులు కారని ఆయన ప్రపంచానికి సందేహాతీతంగా నిరూపించారు. ట్రంప్‌ ఎలాగైతేనేమి శ్వేతసౌధం ఆసామీ కాగలిగారు. మరో నాలుగేళ్ళ పాటు బహుశా ఆయన అందులో కొనసాగవచ్చు. ఇది అమెరికా ప్రజలలో సంఖ్యానేకులను అమితంగా కలవరపరుస్తోంది. కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడంలో మహా అసమర్థంగా వ్యవహరించడం ద్వారా సంపన్న, వర్ధమాన దేశాల మధ్య వ్యత్యాసాలను ట్రంప్ చెరిపివేశారు. ఎన్నికల ముందు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరిని నియమించడంలో ఆయన అనుసరించిన తీరు అత్యున్నత న్యాయవ్యవస్థలో నియామకాలు అపవాదులకు అతీతమేమీ కావని స్పష్టం చేసింది. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమం అమెరికా సమాజంలోని కరడుగట్టిన జాత్యహంకార ధోరణులను బహిర్గతం చేసిన తరుణంలో శ్వేతజాతి దురహంకారులకు ఆయన ఎలాంటి దాపరికం లేకుండా మద్దతునివ్వడం ప్రపంచ ప్రజలను దిగ్భ్రాంతి పరిచింది. అమెరికా అధ్యక్ష పదవీ ఎన్నికలపై సకల దేశాల ప్రజలూ శ్రద్ధాసక్తులు చూపేలా చేయడం ద్వారా అమెరికా ఎన్నికల వ్యవస్థలోని నీచమైన లోపాలు, హీనమైన లొసుగులు ప్రపంచం దృష్టికి వచ్చేలా చేసిన ఘనత కూడా ట్రంప్‌దే. ఎన్నికలను ఎలా నిర్వహించాలి, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన సత్వరమే ఎలా చేయాలన్న విషయాలకు సంబంధించి భారత్ నుంచి అమెరికా నేర్చుకోవల్సింది ఎంతైనా ఉందని స్పష్టంగా చెప్పవచ్చు. ఇంతవరకు నేను ప్రస్తావించిన వివిధ అంశాల సారాంశాన్ని సంక్షేపిస్తాను. అనేక ప్రజాస్వామ్య దేశాలలో అమెరికా కూడా ఒకటి మాత్రమే అని ప్రపంచం ఎట్టకేలకు తెలుసుకున్నది. ఆ దేశ ప్రజాస్వామ్యానికి దానిదైన శక్తిసామర్థ్యాలు ఉన్నాయి, అలాగే బలహీనతలూ ఉన్నాయి. మిగతా ప్రపంచానికి ప్రజాస్వామ్య గొప్పదనం గురించి ఉపదేశించే ముందు ఇతర ప్రజాస్వామ్య సమాజాల నుంచి అది నేర్చుకోవల్సింది చాలా ఉంది. ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల్లో విజేత ఎవరైనప్పటికీ ఎన్నికల ప్రక్రియ జరిగిన తీరుతెన్నులూ, ఫలితమూ ఇదే పాఠాన్ని మరింతగా నొక్కిచెబుతాయి.

ఈ పాఠాన్ని నేను ఎప్పుడోనే నేర్చుకున్నాను. నా గురువు, స్నేహితుడు, సహ రచయిత ప్రొఫెసర్‌ ఆల్ఫ్రెడ్ స్టెపాన్‌కు ఈ విషయంలో నేను ఎంతో కృతజ్ఞతాబద్ధుణ్ణి. తులనాత్మక రాజనీతిశాస్త్రంలో ఆయన గొప్ప పండితుడు. తన జీవిత చరమాంకంలో స్వదేశం అమెరికాను ఒక తులనాత్మక దృక్పథంతో అధ్యయనం చేయడం ప్రారంభించారు. వామపక్షీయుడు కాకపోయినా వామపక్ష మేధావుల వలే అమెరికా పెట్టుబడిదారీ విధానాన్ని నిశితంగా విమర్శించారు. ప్రొఫెసర్ స్టెపాన్ నికార్సైన అమెరికన్. ఉదారవాద ప్రజాస్వామ్యవాది. ట్రంప్ రంగంలోకి రావడానికి చాలా కాలం ముందు నుంచే ఆదర్శ ప్రజాస్వామ్యానికి అమెరికాను ఒక సమున్నత నిదర్శనంగా చెప్పడానికి వీలులేదని ఆయన గట్టిగా అభిప్రాయపడ్డారు. ప్రపంచాన్ని మరింతగా ప్రజాస్వామ్యీకరించేందుకు అమెరికా నమూనా నిరుపయోగమని ఆయన తేల్చి చెప్పారు.

దానితో నేను సంపూర్ణంగా ఏకీభవించాను. సంపన్న పాశ్చాత్య దేశాల ప్రజాస్వామిక నైతిక నిష్ఠపై నాకు మొదటి నుంచీ అనేక సందేహాలు ఉండేవి. అయితే స్టెపాన్ తెలుసుకున్న సత్యాన్ని విశాల ప్రపంచానికి తెలియజేయడంలో నాకు ఎదురైన అవరోధాలు అన్నీ ఇన్నీ కావు. ఎందుకంటే ఈ ప్రపంచంలో అమెరికా పట్ల వ్యామోహం లేనివారు ఎవరున్నారు? ట్రంప్ రంగంలోకి వచ్చిన తరువాత నా కర్తవ్యపాలన సులభతరమయింది. ఇప్పుడు అమెరికా ఒక ఆదర్శ ప్రజాస్వామ్యం ఎందుకు కాదో నాలుగు కారణాలు చెప్పవచ్చు. వీటిలో మొదటి రెండు సంస్థాగత సంబంధమైనవి కాగా మిగతా రెండు రాజకీయాల స్వభావానికి సంబంధించినవి.

మొదటిది: సుప్రసిద్ధమైనదీ, అదే సమయంలో అనేక లొసుగులు కలిగినదీ అయినా ‘అధ్యక్ష పాలనా విధానం’. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య తరచు ఘర్షణలకు ఈ విధానం దారితీస్తోంది. పాలనలో పదే పదే ప్రతిష్టంభనలు తప్పడంలేదు. ప్రొఫెసర్ స్టెపాన్ ఈ పరిణామాన్ని మరో దృష్టికోణంతో చూశారు. అసలు సమస్య అంతా అధ్యక్ష పాలనా విధానంలోనే ఉందని ఆయన సిద్ధాంతీకరించారు. ఆ విధానం అధికారాన్ని అవిభాజ్యం చేస్తూ సంకీర్ణాలకు అవకాశమివ్వదు. తత్ఫలితంగా సమాజంలోని వైవిధ్యాలన్నీ పాలనావ్యవస్థలో ప్రతిబింబించేందుకు, అలాగే అధికారాన్ని పంచుకునే ప్రక్రియకు తీవ్ర అవరోధమవుతోంది. అమెరికా అధ్యక్ష పాలనా విధానం అనేక వీటోలకు దారితీస్తుంది. ఒక రాజకీయ వ్యవస్థలో వీటో అధికారాలు ఎంత ఎక్కువగా ఉంటే సమాజంలో అసమానతలు అంత హెచ్చుగా ఉంటాయని ప్రొఫెసర్ స్టెపాన్ ప్రతిభావంతంగా నిరూపించారు. ఈ కారణాల వల్లే అమెరికా అధ్యక్ష తరహా పాలనా విధానాన్ని అనుసరించడానికి దక్షిణ అమెరికా, పూర్వపు సోవియట్ యూనియన్ దేశాలలో జరిగిన ప్రయత్నాలన్నీ చాలవరకు విఫలమయ్యాయని ఆయన పేర్కొన్నారు.

అమెరికా ప్రజాస్వామ్య నమూనాలోని రెండో అంశం, విశిష్ట సమాఖ్య విధానం. అమెరికాలో ప్రతి అధికారమూ, కేంద్రానికి ప్రత్యేకంగా ఇవ్వని పక్షంలో, రాష్ట్రాలకే ఉంది. జాతీయ ఎన్నికల నిర్వహణలో కూడా ఈ అధికారాలను స్పష్టంగా చూడవచ్చు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఓటు వేయాలనే విషయమై ప్రతి రాష్ట్రానికీ సొంత నిబంధనలు ఉన్నాయి. అంతేకాదు, ఓట్లను ఎప్పుడు లెక్కించాలీ, ఫలితాలను ఎప్పుడు ప్రకటించాలి అనే విషయమై కూడా ప్రతి రాష్ట్రమూ సొంత నిర్ణయమే తీసుకుంటుంది. అమెరికా సమాజం ఎంత సజాతీయమైనప్పటికీ ప్రతి రాష్ట్రమూ తమ అధికారాలను అత్యంత జాగరూకతతో కాపాడుకుంటున్నాయి. తాము అనుసరించే పద్ధతులే ‘శుద్ధ’ సమాఖ్య విధానానికి నిదర్శనాలని అమెరికన్లు విశ్వసిస్తారు.

ప్రజాస్వామ్య సమాజాలకు అమెరికా ఎందుకు ఆదర్శం కాదన్న కారణాల జాబితాలో మరో రెండు కారణాలను డోనాల్డ్ ట్రంప్ చేర్చారు. అక్కడి రెండు పార్టీల వ్యవస్థలోని డొల్ల తనాన్ని ఆయన పాలన బహిర్గతం చేసింది. ప్రధాన పార్టీలు రెండిటికీ భావజాల ప్రాతిపదికలు, సంస్థాగత గంభీరత కొరవడ్డాయి. ఏ అభ్యర్థికి ఓటు వేయాలనే విషయమై ఓటర్లకు ఈ రెండు పార్టీల వ్యవస్థ నిజమైన స్వేచ్ఛ నివ్వడం లేదు. ప్రస్తుత అధ్యక్ష ఎన్నికలలో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించినప్పటికీ ఆయన వాస్తవంగా ట్రంప్‌కు నకలు మాదిరిగానే వ్యవహరించడం ఖాయం. కాకపోతే ట్రంప్‌లా కటువుగా వ్యవహరించకపోవచ్చు. ఇక రెండో కారణం, అమెరికాలో ప్రజాభిప్రాయం ఎంత చపలచిత్తమైనదో, ఎంత తెలివితక్కువైనదో, ఎంత తేలిగ్గా అనుకూలంగా మలచుకోవచ్చో గత నాలుగేళ్ళ కాలంలో పలుమార్లు రుజువయింది. ప్రపంచపు అత్యంత శక్తిమంతమైన మీడియా తనను ఎన్నిసార్లు తప్పుపట్టినప్పటికీ ట్రంప్‌ తన ధోరణినే కొనసాగించి ప్రజల ఆమోదాన్ని పొందగలిగారు. సమాజ వ్యవహారాలలో సత్యం పరిఢవిల్లగలదనడానికి వాక్‌స్వాతంత్ర్యం అతి స్వల్ప భరోసాను మాత్రమే ఇవ్వగలుగుతుంది. అమెరికాతో పాటు ఈ పాఠాన్ని నేర్పుతున్న దేశాల జాబితా చాలా పెద్దది. ఆ జాబితాలో భారత్ కూడా ఉందని మరి చెప్పాలా?

ఒక కొత్త ప్రజాస్వామ్య సిద్ధాంతం కోసం ప్రపంచం నిరీక్షిస్తోంది. ఈ లోగా అమెరికా నేతృత్వంలోని ప్రజాస్వామ్య నమూనాను మనం ధ్వంసం చేయాలి. ఏ గుత్తాధిపత్యాన్ని కూల్చివేసినా సంతోషం సమకూరుతుంది. ఆ ఆనందం మనలను సరైన పథంలో ముందుకు నడిపిస్తుంది. ప్రజాస్వామ్య నమూనా అంటూ ప్రత్యేకమైనది లేదు. పరిపూర్ణ ప్రజాస్వామ్యానికి బంగారు బాట అనేది కూడ ఏదీ లేదు. ప్రజాస్వామ్యం ఒక ముళ్ళబాటలో యాత్ర. మీరు ముందుకు సాగుతూ మీ దారిని మీరే సుగమం చేసుకోవాలి. డోనాల్డ్ ట్రంప్ అమెరికా విషయంలో ఇది ఎంత నిజమో నరేంద్ర మోదీ భారత్ విషయంలోనూ అంతే నిజం.

Courtesy Andhrajyothi