మార్చి నుంచి దాదాపు 4 కోట్ల నిరుద్యోగులు నమోదు

వాషింగ్టన్‌ : 1933, 2008 సంక్షోభాల కంటే తీవ్రమైన ఆర్థిక సంక్షోభం దిశగా అమెరికా సాగుతోంది. ఈ విషయాన్ని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అమెరికా కార్మిక శాఖ గురువారం నివేదిక ప్రకారం గతవారంలో నిరుద్యోగ బీమా కోసం 24 లక్షల మంది నమోదు చేసుకున్నారు. దీంతో మార్చి నెల మధ్య నుంచి ఇప్పటి వరకూ ఈ బీమాకు నమోదు చేసుకున్న వారి సంఖ్య 38.6 మిలియన్లకు చేరుకుంది.

ఒకవైపు కరోనా వైరస్‌ బాధితులు, మరణాలు పెరుగుతున్నా, ఆర్థిక వ్యవస్థను పునఃప్రారంభించేందుకు 50 రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తూ ట్రంప్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా వరసగా 9వ వారం కూడా 2 మిలియన్లకు పైగా కార్మికులు నిరుద్యోగ బీమా కోసం దరఖాస్తు చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. మార్చి చివరిలో గరిష్టంగా నమోదు చేసుకున్న 6.8 మిలియన్ల మంది సంఖ్యతో పోలిస్తే ప్రస్తుత సంఖ్య తక్కువగా కనిపిస్తున్నా, 2008 మహా మాంద్యం కంటే ఈ సంఖ్య చాలా ఎక్కువ. ఒక అంచనా ప్రకారం జూన్‌ మొదటివారంలో అధికారంగా విడుదల చేయనున్న మే నెలలోని నిరుద్యోగం 20 శాతంగా ఉండనుంది.గత నెలలో నిరుద్యోగం 14.7 శాతంగా ఉంది. అయితే అమెరికాలో నిరుద్యోగ శాతం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మిలియన్ల కొద్దీ ఉన్న నిరుద్యోగ వలసదారులు దరఖాస్తు చేయడానికి అనర్హులు. అలాగే మరికొంత మంది కార్మికులు ప్రస్తుతం పనికోసం ఎదురుచూడ్డం లేదు. దీంతో వీరిని నిరుద్యోగులుగా లెక్కించడం లేదు.

ఫార్చ్చూన్‌ పత్రిక అంచనా ప్రకారం అమెరికాలో ప్రస్తుతం నిరుద్యోగం 22.5 శాతానికి చేరుకుంది. ఇది 1933 మహామాంద్యంలో నిరుద్యోగ శాతం (25)కు దగ్గరగా ఉంది. రానున్న వారాల్లో మరికొన్ని మిలియన్ల మంది నిరుద్యోగ బీమాకు దరఖాస్తు చేసుకుంటారని, దేశం అత్యంత హీనమైన ఆర్థిక సంక్షోభాన్ని చూడనుందని అంచనా. పైన పేర్కొన్న గణాంకాలు దేశంలో నిరుద్యోగాన్ని సరిగ్గా వెల్లడించలేక పోతున్నాయి. ఎందుకంటే పురాతన కంప్యూటర్‌ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడంతో అనేక మిలియన్ల మంది కొన్ని వారాల పాటు నిరుద్యోగ బీమాకు దరఖాస్తు చేయలేకపోయారు. అలాగే ఇండియానా, మిస్సౌరి, హవాయి వంటి అనేక రాష్ట్రాల్లో దరఖాస్తులు ప్రక్రియలో తీవ్రమైన జాప్యం జరుగుతుంది. ఫ్లోరిడా రాష్ట్రంలో కఠినమైన నిబంధనలతో చెల్లింపులపై మూడు నెలల పరిమితి పొడిగించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో లాక్‌డౌన్‌ నిబంధనలు ఎత్తివేసినా ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటుందన్న ఆశావాదం కనిపించడం లేదు.

చికాగో యూనివర్సిటీ ఈ నెల ప్రారంభంలో వేసిన అంచనా ప్రకారం 42 శాతం ఉద్యోగాలు శాశ్వతంగా గల్లంతవుతాయి. అంటే 16.2 మిలియన్ల మంది ఉద్యోగాలను కోల్పోనున్నారు. 2008 ఆర్థిక సంక్షోభంలో సంఖ్యకు రెట్టింపు.

సెన్సెస్‌ బ్యూరో సర్వే ప్రకారం మార్చి 13 నుంచి పెద్దల్లో 47 శాతం మంది ఉద్యోగాల్ని కోల్పోయారు. అలాగే రానున్న నెలలో 39 శాతం మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు.

Courtesy Nava Telangana