సత్యం వైపు నిలబడితే తప్పకుండా న్యాయం జరుగుతుందని ఢిల్లీ హైకోర్టు జడ్జి ఎస్‌.మురళీధర్‌ పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: రాజ్యాంగ విలువలకు లోబడి నిర్భయంగా పనిచేయాలని చేయాలని న్యాయవాదులకు సూచించారు. రాజ్యంగ నైతికతను కాపాడేందుకు బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సిద్ధాంతాలు పాటిస్తానని చెప్పారు. కోర్టు ప్రాంగణం ప్రజాస్వామికంగా ఉండి, పీడితుల పక్షాన నిలిచేట్టు ఉండాలని అభిప్రాయపడ్డారు.

బదిలీపై తనకు ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు. పంజాబ్,హరియణా హైకోర్టుకు బదిలీ అయిన నేపథ్యంలో ఢిల్లీలో గురువారం ఢిల్లీ హైకోర్టు జడ్జీలు,లాయర్లు ఆయనకు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో జడ్జి మురళీధర్‌ మాట్లాడుతూ.. తన ఆకస్మిక బదిలీపై స్పందించారు. బదిలీ విషయం ముందే తెలుసని ఆయన చెప్పారు. తన బదిలీపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే ముందస్తుగానే సమాచారం అందించారని, ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పడంతోనే పంజాబ్‌–హరియాణా కోర్టుకు తనను బదిలీ చేశారని వెల్లడించారు. ఫిబ్రవరి 26న తన బదిలీ ఉత్తర్వులు అందాయని పేర్కొన్నారు. వీడ్కోలు కార్యక్రమం సందర్భంగా నల్లకోటులతో అట్టహాసంగా కోర్టు ప్రాంగణం నలుపు రంగు పులుముకున్నట్లుగా మారిపోయింది. కోహినూరు వజ్రం లాంటి అరుదైన వ్యక్తి ఢిల్లీ హైకోర్టు విడిచి వెళ్లిపోతున్నారంటూ ఆ కోర్టు లాయర్లు పేర్కన్నారు.

కాగా,ఢిల్లీలో విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన బీజేపీ నాయకులు అనురాగ్‌ ఠాకూర్, పర్వీష్‌ వర్మ, కపిల్‌ మిశ్రాలపై ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించిన మురళీధర్‌ను కేంద్రం అకస్మాత్తుగా బదిలీ చేయడంపై పలు విమర్శలు వెల్లువెత్తిన విషయం విదితమే. జస్టిస్ మురళీధర్ 1984 సెప్టెంబరులో చెన్నైలో తన న్యాయ ప్రాక్టీసును ప్రారంభించారు. 1987లో సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీస్ చేయడానికి ఢిల్లీకి మారారు. 2006 లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.