స్త్రీలకు అన్నింటా పురుషులతో సమానత్వం అవసరమని భావించాడు అంబేడ్కర్. వేలాది ఏళ్ళుగా స్థిరీకరించబడిన వివక్ష పునాదులు అంబేడ్కర్ ప్రవేశపెట్టిన విప్లవాత్మక హిందూ కోడ్ బిల్లుతో కదిలిపోయాయి.

మతాలకు సంబంధించిన చట్టాలో జోక్యం చేసుకునే హక్కు పార్లమెంట్‌కు లేదనే వాదన అసంబద్ధం. ఈ పార్లమెంట్‌ పూర్తిగా సర్వోన్నతమైనది. ఏ మత సముదాయానికి సంబంధించి అయినా, మతానికి సంబంధించే కాక ఆ మతం వారి వ్యక్తిగత చట్టాలకు సంబంధించిన ఏ విషయాల్లోనైనా, పార్లమెంటు జోక్యం చేసుకోగలదు. ఏ మత సముదాయమూ తాము ‘పార్లమెంట్‌కు అతీతం’ అనే మానసిక స్థితిలో ఉండ కూడదు’’ స్వాతంత్ర్యానంతరం ఏర్పడిన తాత్కాలిక జాతీయ ప్రభుత్వంలో న్యాయశాఖా మంత్రిగా అంబేడ్కర్‌ చేసిన వ్యాఖ్య ఇది. హైందవ సమాజంలో స్త్రీలపై వివక్ష, పీడనలను తొలగించడానికి సభలో ప్రవేశపెట్టిన హిందుకోడ్‌ ముసాయిదా బిల్లును జనసంఘ్‌, కాంగ్రెస్‌ మితవాదులు వ్యతిరేకించిన సందర్భంలో అంబేడ్కర్‌ ఈ మాటలన్నారు.

జీవిత పర్యంతం కఠోర శారీరక మేధోశ్రమతో, అందుకు దీటైన కార్యాచరణతో, స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వాల ప్రాతిపదికన, సామాజిక విప్లవాన్ని గొప్ప ముందడుగు వేయించారు అంబేడ్కర్. న్యాయశాస్త్ర కోవిదుడుగా, రాజనీతిజ్ఞుడుగా, ఆర్థికవేత్తగా, అణగారిన వర్గాల నాయకుడిగా, మహిళా హక్కుల కోసం, సాధికారత కోసం అసమాన పోరాటం చేసిన విమోచకుడిగా చరిత్రను నిర్మించాడు అంబేడ్కర్.

ప్రత్యేకించి, మహిళా సాధికారతతోనే సామాజిక విప్లవం వర్ధిల్లుతుంది అనే సార్వత్రిక సత్యం వెలుగులో, స్త్రీల హక్కుల సాధనలో అంబేద్కర్‌ సాటిలేని తోడ్పాటును అందించాడు. విద్య, ఉత్పాదక, రాజకీయ రంగాలలో స్త్రీలు సాధించిన అభివృద్ధే ఆయా దేశాల ప్రగతికి కొలమానం అని నమ్మిన అంబేడ్కర్‌ వారికి అనేకమైన రాజ్యాంగపరమైన, చట్టబద్ధమైన హక్కులను, రక్షణలను కల్పించాడు. దేశంలో అణగారిన వర్గాల పురుషులు మత, కుల, రాజకీయ పెత్తనానికి గురవుతున్నారు. స్త్రీలు ఈ మూడు ఆధిపత్యాలకు తోడు పురుషాధిపత్యానికి కూడా గురవుతున్నారు. ఈ స్థితిని గమనించి స్త్రీలకు వ్యక్తిత్వం ఉందని, ఆమెకు అన్నింటా పురుషులతో సమానత్వం అవసరమని భావించాడు అంబేడ్కర్.

జాతీయోద్యమ ఆకాంక్షలను ప్రతిఫలింప చేస్తూ రాజ్యాంగ రచనా క్రమంలో స్త్రీల సాధికారత కోసం అనేక ప్రకరణలను పొందుపర్చాడు అంబేడ్కర్. వీటిలో, 15(3)– స్త్రీలు బిడ్డలను రక్షించడానికి, వివక్షతను రూపుమాపడానికి రాజ్యం ప్రత్యేక నిబంధనలు రూపొందించే అధికారం; 39(ఎ)– లింగవివక్ష లేకుండా జీవనోపాధి పద్ధతులను కల్గిఉండడం; 39(డి)– స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం; 42– గర్భిణి స్త్రీలకు ప్రసూతి సౌకర్యం; 51ఎ(ఈ)– స్త్రీల గౌరవం తగ్గించు ఆచారాలను విడనాడటం వంటి ప్రకరణలు ముఖ్యమైనవి. అయితే స్త్రీలకు ఏర్పరచిన రాజ్యాంగ రక్షణల స్ఫూర్తికీ, హిందూ వ్యక్తిగత చట్టాలకూ ఏకరూపత లేదని గ్రహించాడు. జాతీయ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా విస్తృత అధ్యయనంతో స్త్రీలకు సమర్థనగా ఉన్న కొన్ని స్మృతులను ఆధారంగా చేసుకొని 9 భాగాలు, 8 షెడ్యూళ్ళు, 139 ప్రకరణలతో కూడిన హిందూ కోడ్‌ ముసాయిదా బిల్లును రూపొందించి నవంబర్‌ 17, 1947లో సెలక్ట్‌ కమిటీకి నివేదించాడు.

దీనిపై చర్చ ఫిబ్రవరి 11, 1949 నుండి డిసెంబర్‌ 14, 1949 వరకు కొనసాగింది. ఈ బిల్లులో స్త్రీలకు ఆస్తిహక్కు, ఆస్తిని పొందడానికి అనుక్రమణిక, భరణం, స్త్రీ పురుషుల మధ్య వివాహ స్వేచ్ఛ, కుల మతాలకు అతీతంగా దత్తత, సంరక్షణ మొదలగు ఎన్నో అంశాలను పొందుపరిచాడు. దీనితో చరిత్రలో మొదటిసారిగా హిందూ స్త్రీ ఆస్తిని వారసత్వ హక్కుగా పొందటం, స్వతంత్రంగా అనుభవించడం, అమ్మడం, అలాగే ఒక కుమార్తెగా, ఒక భార్యగా, ఒక తల్లిగా పురుషునితో సమానంగా ఆస్తిని అనుభవించగలగటం వంటి హక్కులు లభించాయి. ఈ బిల్లు సహేతుక కారణం లేకుండా పురుషుడు రెండవ భార్యను కల్గి ఉండడంపై ఆంక్షలు విధించింది. వేలాది ఏళ్ళుగా స్థిరీకరించబడిన వివక్ష పునాదులు ఈ విప్లవాత్మక బిల్లుతో కదిలిపోయాయి.

హైందవ సమాజం దద్ధరిల్లిపొయింది. సనాతన వాదులు గగ్గోలు పెట్టారు. బిల్లును ప్రవేశపెడుతున్నప్పుడు ‘ది రైజ్‌ అండ్‌ ఫాల్‌ ఆఫ్‌ హిందు విమెన్‌’ అనే శీర్షికతో స్త్రీల దయనీయ స్థితిగతులపై ఆలోచనాత్మక ప్రసంగం చేసాడు అంబేడ్కర్‌. ప్రగతిశీల భావాలు కల్గిన కాంగ్రెస్‌లోని నెహ్రూ వర్గం హిందూ కోడ్ బిల్లును గట్టిగా సమర్థించింది. ప్రధాని నెహ్రూ మాట్లాడుతూ భారతీయ ఆత్మకు, హుందాతనానికి, వినయానికి, తెలివికి ప్రతీకలైన స్త్రీల పట్ల అమలవుతున్న వివక్షను, ఆంక్షలను సమూలంగా తొలగించే చారిత్రక సందర్భం ఆసన్నమైనది అన్నారు. కాంగ్రెస్‌లోని పటేల్‌, పఠాభి, ప్రసాద్‌ వర్గం అనేక సవరణలు కోరింది. ఆరెస్సెస్ ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకించింది. నిరసన కార్యక్రమాలు చేపట్టి అంబేడ్కర్‌, నెహ్రూ దిష్టిబొమ్మలను తగులబెట్టింది. రేణుక రే అనే కాంగ్రెస్‌ సభ్యురాలు మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర పోరాటానికి కనీస మద్ధతు తెలపకుండా వ్యతిరేకించిన ఆరెస్సెస్కు, జన సంఘీయులకు నిరసన తెలిపే అర్హత లేదని విమర్శించారు.

ఫిబ్రవరి 5, 1951లో అంబేడ్కర్‌ మరల హిందూ కోడ్‌ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టాడు. 1952లో జరిగే సార్వత్రిక ఎన్నికల తరువాత ఆమోదింపచేస్తానని నెహ్రూ హామీ ఇచ్చినా, మంత్రి మండలిలో అనేకమంది బిల్లును సమర్థించనందుకు అంబేడ్కర్‌ ఆశాభంగం చెంది మంత్రి వర్గం నుండి సెప్టెంబర్‌ 9, 1951న రాజీనామా చేశాడు. ఆధునిక ప్రపంచ చరిత్రలో మహిళా హక్కుల గురించి తన పదవికి రాజీనామా చేసిన మంత్రిగా నిలిచిపోయాడు. 1955–-56 కాలంలో నెహ్రూ ప్రభుత్వం హిందూ కోడ్‌ బిల్లును ఆమోదింపచేసి దాని వెలుగులో హిందూ వివాహ, వారసత్వ, దత్తత, భరణాలపై చట్టాలను, ఇంకా అనేక రక్షణలను రూపొందించింది. నేడు ఆధునిక భారత స్త్రీలు ఓ మేరకైనా అనుభవిస్తున్న సాధికారతలో అంబేడ్కర్‌ స్ఫూర్తి ఉంది.

సమకాలీన భారతీయ సమాజంలో అంబేద్కర్‌ స్ఫూర్తికి భిన్నంగా మనుధర్మ పునరుద్ధరణ శక్తులు రాజ్యమేలుతున్నాయి. పరువు హత్యలు, మోరల్‌ పోలిసింగ్‌, ఆదివాసీ దళిత స్త్రీలపై అకృత్యాలు నిత్యకృత్యమయ్యాయి. బిజెపి పాలిత రాష్ట్రాలలోని పాఠ్యాంశాలలో స్త్రీల పట్ల వివక్షను బోధించే పాఠాలు చేర్చారు. స్త్రీలు గృహాకార్యాలకు పరిమితమవ్వాలని ఆరెస్సెస్ సంఘచాలక్‌ చెపుతున్నాడు. నచ్చిన స్త్రీని ఆమె అనుమతి లేకుండా వివాహం చేసుకోవచ్చని, బాల్య వివాహాలకు అనుమతిస్తామని మోదీ అనుచర ప్రజాప్రతినిధులు బాహటంగానే ప్రకటిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆధునిక భారత పౌరులు, ముఖ్యంగా స్త్రీలు, తమ హక్కుల కోసం అంబేడ్కర్ బాటలో ఆయన ఆశయాల కొనసాగింపును ఉద్యమంలా చేపట్టాలి. సమగ్ర సామాజిక విప్లవాన్ని సాధించడమే మనం అంబేడ్కర్‌కు ఇచ్చే నిజమైన నివాళి.

అస్నాల శ్రీనివాస్‌