అమానుష అసమానతల సమాజాన్ని నాలుగు దెబ్బలు కొట్టగల శక్తిని తెచ్చుకోవడానికి, నిర్మాణాత్మకంగా మార్చివేయడానికి దళిత భారతీయులకు ఒక మహాస్ఫూర్తి అంబేడ్కర్. బాబాసాహెబ్ ఆదర్శ బాటలో ముందుకు సాగిన సమున్నత క్రియాశీలుడు ఏక్‌నాథ్ అవాడ్ (1956–-2015). ఆయన ఆత్మకథ ‘ స్ట్రైక్ ఏ బ్లో టు చేంజ్ ది వరల్డ్ ’ సాహిత్యార్హత, సామాజిక అంతర్దృష్టి నిండుగా ఉన్న ఒక ఉద్గ్రంథం.
 అడుగడుగునా అననుకూలతలను ఎదుర్కొంటున్న రెండు సామాజిక సమూహాలను భారత రాజ్యాంగం గుర్తించింది. అవి: షెడ్యూల్డు కులాలు (నిత్యవ్యవహారంలో దళితులుగా సుపరిచితులు); షెడ్యూల్డు తెగలు (ఆదివాసీలుగా పరిగణన పొందుతున్నవారు). భాష, కులం, మతం, జీవనాధారాల పరంగా ఈ రెండు సామాజిక వర్గాలలోనూ అపార వైవిధ్యమున్నది ఆంధ్రప్రదేశ్ లోని ఒక మాదిగ సామాజికుడికి, ఉత్తరప్రదేశ్ లోని ఒక జాతవ్ కులస్థుడికి మధ్య ఉమ్మడి అంశం ఏమీలేదు- ప్రభుత్వోద్యోగానికి ‘ఎస్‌సి’ కోటా కింద దరఖాస్తు చేసుకోవడం మినహా. అలాగే, నీలగిరి కొండ ప్రాంతాల(తమిళనాడు)లోని ఒక ఇరులా కు, మహదేవ్ పర్వత ప్రాంతాల(మధ్యప్రదేశ్)లోని ఒక గోండ్ కు మధ్య, సర్కార్ కొలువుకు ‘ఎస్‌టి’ కోటా కింద దరఖాస్తు చేసుకోవడం మినహా, మరెలాంటి సంబంధం లేదు.

అయితే, కేరళ లేదా కర్ణాటక కానివ్వండి, పంజాబ్ లేదా బెంగాల్ కాన్వివండి దేశ వ్యాప్తంగా సమస్త దళితులూ ఒక అద్భుత బంధంతో సమైక్యమైఉన్నారు. అదే, వారి జీవితాలకు వెలుగు బాటలు పరిచిన డాక్టర్ అంబేడ్కర్ మహోన్నత మార్గదర్శకత్వం. అద్వితీయ మేధోసంపత్తికి పేరు పొంది, అత్యున్నత పదవులను నిర్వహించిన ఆయన తన జీవితకాలంలో తన సొంత ఉపకులం అయిన మహర్లలో మాత్రమే పేరు పొందారు. మరణానంతరమే భారతీయ దళిత శ్రేణులకు ఆయన ఆదర్శ పురుషుడు, ఆరాధనీయుడు అయ్యారు. ఆదివాసీలకు అంబేడ్కర్‌తో పోల్చదగ్గ నాయకుడు ఒక్కరు కూడా లేరని చెప్పక తప్పదు, ప్రాంతీయ, భాషా పరమైన అంతరాలు, వ్యత్యాసాలకు అతీతుడై, సకల ఆదివాసీలకు మార్గదర్శకుడయిన నాయకుడు ఒక్కరూ లేరు!

దళితుల జీవితాలలో అంబేడ్కర్‌కు ఉన్న ప్రాధాన్యం, వారి ఆలోచనలకు అంబేడ్కర్ ఇస్తున్న మార్గదర్శకత్వం గురించి నాకు చాలా కాలంగా తెలుసు. ఇది నన్ను ఎంతో ప్రభావితం చేస్తున్న అంశం. ఏక్‌నాథ్ అవాడ్ (1956 – 2013) ఆత్మకథను చదువుతున్నప్పుడు ఆ ప్రాధాన్య, ప్రభావాలు సరికొత్తగా నా ఆలోచనలను ఆవహించాయి. ఏక్‌నాథ్ అవాడ్ తన మాతృభాష మరాఠీలో రాసిన ఆత్మకథను జెర్రీ పింట్ అద్భుతంగా ఆంగ్లంలోకి అనువదించారు. అవాడ్ ఒక మాంగ్ దళితుడు. మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతానికి చెందిన అవాడ్ తన బాల్యం నుంచీ అమిత విద్యాసక్తుడు. నవ యవ్వనంలోకి ప్రవేశించిన
నాటికే ఆయన తన విద్యావ్యాసంగాలకు పేరు పొందారు. కనుకనే బంధుమిత్రులు యువ అవాడ్‌ను ‘మహర్చా ఔలాద్’ (మహర్ కుమారుడు) అని ప్రస్తావించేవారు. మహర్ కులస్థుడుగా జన్మించిన అద్వితీయ ధీమంతుడు అంబేడ్కర్ మాటలను గుర్తు చేసుకుంటే ఆ ప్రస్తావనలోని ఔచిత్యం అర్థమవుతుంది. ‘పులి పాలు వంటిది విద్య. మీరు ఒక సారి ఆ పాలను తాగితే గర్జించకుండా ఉండలేరు’ అని అంబేడ్కర్ వచించారు. ఇవి నిజంగా మరవరాని మాటలు.
ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే అంబేడ్కర్ రచనలను అవాడ్ చాలా శ్రద్ధగా చదివారు. సోషలిస్ట్ ఎంపి నాథ్ పేయి (ఇప్పుడు విస్మృతుడైన ఒక స్ఫూర్తిదాయక నేత) ప్రసంగాలను ఆకళింపు చేసుకునే వారు. 1970వ దశకంలో ఇంకా యవ్వన దశలో ఉన్నప్పుడే దళిత్ పాంథర్స్‌తోను, మరఠ్వాడా విశ్వవిద్యాలయానికి అంబేడ్కర్ పేరిట పునఃనామకరణం చేయాలనే డిమాండ్‌తో ప్రజ్వరిల్లిన ఉద్యమంతోనూ యువ అవాడ్ ప్రభావితుడయ్యారు. ‘మరఠ్వాడా’ ఉద్యమం గురించి ఆయన ఇలా రాశారు: ‘మరఠ్వాడా విశ్వవిద్యాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టాలనే డిమాండ్‌ను సమర్థిస్తున్న వారు ఇవాళ ఒక మోర్చా నిర్వహిస్తే, మరుసటి రోజు ఆ డిమాండ్‌ను వ్యతిరేకించేవారు మరో మోర్చాను నిర్వహించేవారు. రోజుల తరబడి ఆ మోర్చాల పరంపర సాగిపోతుండేది. అంబేడ్కర్ పేరును మరఠ్వాడా వర్శిటీకి పెట్టాలన్న డిమాండ్ ను శివసేన తీవ్రంగా వ్యతిరేకించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, డాక్టర్లు, గ్రామీణ ప్రజలు ప్రతి ఒక్కరూ ఆ డిమాండ్‌కు సానుకూల లేదా వ్యతిరేక వైఖరి వహించారు’.
పునఃనామకరణ ఉద్యమకారులపై అగ్రకులాల వారు పాశవిక దాడులకు పాల్పడ్డారు. అవాడ్ ఇలా రాశారు: ‘మహర్లు లక్ష్యంగా దాడులు, దౌర్జన్యాలు ఒక పథకం ప్రకారం జరిగాయి. మరఠ్వాడా ప్రాంతంలోని 180 గ్రామాలలో ఈ హింసాకాండ చోటుచేసుకున్నది. పది రోజుల పాటు ఈ హింసాగ్నులు చెలరేగాయి. పద్ధెనిమిది చోట్ల పోలీసు కాల్పులు జరిగాయి. వెయ్యికి పైగా దళిత గృహాలను దగ్ధం చేశారు’. కళాశాల విద్యార్థిగా ఉన్న అవాడ్‌పై ఈ ఘర్షణలు తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఆలోచనామగ్నుడిని చేశాయి. ఆయనిలా రాశారు: ‘దళితులపై హింసాకాండ ఉదంతాలు తెలుస్తున్న కొద్దీ నా మనస్సు అశాంతితో నిండిపోయింది. ఆగ్రహంతో రగిలిపోయింది. ఆ అమానుష ఘటనలకు వ్యతిరేకంగా ఉద్యమించాను. నా కార్యకలాపాలు గ్రామంలో పలువురికి కోప కారణమవడంతో మా అమ్మ చాలా కలవరపడింది’. పేదరికం, కుల వివక్షపై తన తొలి పోరాటాల గురించి అవాడ్ ఇలా మననం చేసుకున్నారు: అవమానాలు, అగౌరవాలను జీవిత పర్యంతం దిగమింగినా ఆనందప్రదమైన జీవితం లభించదు. జీవితపు దుస్తర పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడడానికి ఒక మనిషి పూనుకున్నప్పుడు, అన్యాయానికి వ్యతిరేకంగా ఆయుధాలను చేపట్టినప్పుడు జీవితం మరో విధమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది. పోరాటమే ఆగ్రహావేశాలను ఉపశమింపచేస్తుందనేది నా అనుభవం. కనుకనే పోరాడటమనేది నాకు ఒక విధమైన అలవాటుగా పరిణమించింది’.
సోషల్ వర్క్‌లో ఎమ్.ఏ. పూర్తిచేసిన తరువాత ఆదర్శవాదులు, సోషలిస్టు భావజాల ప్రేరితులైన ఒక అగ్రకుల దంపతులతో కలిసి ఆదివాసీల (అప్పటికీ ఇప్పటికీ మన సమాజంలో అమానుష అన్యాయాలకు గురవుతున్న సామాజిక సమూహాలు) సంక్షేమ కృషిలో అవాడ్ పాల్గొన్నారు. సొంత అనుభవాల ఆధారంగా ఆదివాసీలు, దళితుల మధ్య ఒక తారతమ్యాన్ని ఆయన గుర్తించారు. ఆ వ్యత్యాసం గురించి అవాడ్ ఇలా రాశారు: ‘ఏ సామాజిక ఉద్యమం లేదా విప్లవంలోనైనా ఆదివాసీలు మరొక సామాజిక సమూహానికి లేదా నాయకుడికి అనుయాయులుగా మాత్రమే చేరడం కద్దు. వారికి సొంత నాయకుడు అంటూ లేడు. ఇప్పటికీ ఆదివాసీలకు చాలా కొద్దిమంది నాయకులు మాత్రమే వున్నారు’. ఏక్‌నాథ్ అవాడ్ ఆత్మకథ ‘స్ట్రైక్ ఏ బ్లో టు చేంజ్ ది వరల్డ్’ శీర్షికతో ఆంగ్లంలోకి అనువాదమయింది. సాహిత్యార్హత, సామాజిక అంతర్‌దృష్టి నిండుగా ఉన్న ఉద్గ్రంథమది. వివిధ పోరాటాలలో సహచరులు, కుటుంబ సభ్యుల (ముఖ్యంగా సతీమణి) గురించి హృద్యమైన పద చిత్రణలే కాకుండా సామాజిక న్యాయ పురోగతిని అడ్డుకున్న లేదా ఆసరా ఇచ్చిన శక్తుల గురించి నిశిత విశ్లేషణలు కూడా అవాడ్ ఆత్మకథలో వున్నాయి. ఆయన ఇలా రాశారు: ‘దళితులకు ఆహారం, సిమెంట్‌తో నిర్మించిన గృహాలను సమకూర్చడం ద్వారా అంటరానితనం సమస్యను పరిష్కరించడం సాధ్యంకాదు. వారిలో ఆత్మగౌరవ భావాన్ని మేలుకొల్పడం చాలా ముఖ్యం’.
1970 దశకంలో అవాడ్ యువకుడుగా ఉన్నప్పుడు మరఠ్వాడా విశ్వ విద్యాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని అగ్రకులాల వారు తీవ్రంగా వ్యతిరేకించారు. పాశవిక హింసాకాండకు పాల్పడ్డారు. చాలా సంవత్సరాల అనంతరం అంబేడ్కర్ సతీమణి రమాబాయి పేరిట అవాడ్ ఒక సహకార సంఘాన్ని నెలకొలిపి, విజయవంతంగా నిర్వహించారు. వివిధ కులాలకు చెందిన స్త్రీలు ఈ సహకార సంఘంలో భాగస్వాములుగా ఉండేవారు. మత్స్యకారులు, పశువుల కాపర్లు, గాజులు తయారు చేసేవారు మొదలైనవారు దోపీడీదారులైన దళారీల ప్రమేయం లేకుండా తమ ఉత్పత్తులను ఈ సహకార సంఘం ద్వారా విక్రయించుకునే వారు. 2010 సంవత్సరం నాటికి ఇరవై లక్షల కుటుంబాలు ఈ సహకార సంఘం ద్వారా లబ్ధి పొందాయి. ఈ సాఫల్యానికి అవాడ్ సహేతుకంగానే గర్వించారు. ఆయన ఇలా రాశారు: ‘మరాఠ్వాడా విశ్వ విద్యాలయానికి బాబాసాహెబ్ పేరిట పునః నామకరణం చేయాలని ఉద్యమించిన కారణంగా నన్ను తీవ్రంగా వ్యతిరేకించిన పలు గ్రామాలు ఇప్పుడు ఆ మహనీయుడి భార్య పేరిట ఏర్పాటు చేసిన ఒక సూక్ష్మ రుణాల సంఘంలో భాగస్వాములయ్యాయి. నేను ఇంతకంటే ఏమి కోరుకోగలను? సామాజికంగా చాలా వెనుకబడిన ఒక జిల్లాలో అగ్రకులాల వారు ఇప్పుడు ఏటా బాబాసాహెబ్ జయంత్యుత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇటువంటి శుభ కార్యాలు సాధ్యమవుతాయని అప్పట్లో ఎవరైనా కలలోనైనా ఊహించారా?’
డాక్టర్ బి.ఆర్ .అంబేడ్కర్ కీర్తికాయుడై ఆరు దశాబ్దాలకు పైగా గడచి పోయాయి. అయినా ఇప్పటికీ దేశ వ్యాప్తంగా దళితులకు ఆయన ఒక మహాస్ఫూర్తిగా వున్నారు. విద్యావంతులు కావడానికి, సంఘటితమవ్వడానికి, ఆందోళనలు నిర్వహించేందుకు వారికి ఆయన ఒక ప్రేరణగా ఉన్నారు. తాము ఎదుర్కొంటున్న వివక్షలను ఎదుర్కొని, అధిగమించేందుకు దళితులకు ఆయన స్మృతి మార్గదర్శకత్వం వహిస్తోంది. మరింత ముఖ్యమైన విషయమేమిటంటే అంబేడ్కర్ ఇప్పుడు అగ్రకులాల వారి నుంచి కూడా అమిత గౌరవాదరాలను పొందుతున్నారు. ఆదర్శ ప్రాయుడైన నేతగా ఆయన్ని అగ్రకులా లవారు గుర్తించి గౌరవిస్తున్నారు. ఎవరైనా ఎప్పుడైనా ఇందుకు వ్యతిరేకించినప్పటికీ అటువంటి గౌరవాదరాలను వారు ఆయనకు ఇవ్వకుండా ఉండడమనేది ఇంకెంత మాత్రం సాధ్యంకాదు. మరణించిన చాలా కాలం తరువాత కూడా అంబేడ్కర్ నుంచి దళితులు నైతిక, రాజకీయ, మేధో స్ఫూర్తి పొందుతున్నారు. వారి పోరాటాలకు ఆయనొక ప్రధాన ఆలంబనగా వున్నారు. జీవిత హుందా, ఆత్మ గౌరవం కోసం భారతీయ ఆదివాసీలు జరుపుతున్న పోరాటాలలో వారికి, దళితులకు అంబేడ్కర్ వలే, స్పూర్తి నిచ్చే నాయకుడు ఎవరూలేక పోవడం ఎంతైనా విషాదకరం.
రామచంద్ర గుహ