వారం వ్యవధిలో సహారాన్‌పూర్‌లో రెండో ఘటన
– ‘భీమ్‌ ఆర్మీఆందోళనలు
లక్నో: ఉత్తర భారతంలో భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాలపై దాడులు జరుగుతున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని సహారాన్‌పూర్‌లో వారం వ్యవధిలోనే రెండు చోట్ల గుర్తుతెలియని దుండగులు అంబేద్కర్‌ విగ్రహాలను కూల్చివేశారు. ఈ ఘటనలతో ఆగ్రహించిన ఘున్నా గ్రామస్తులతోపాటు సహారన్‌పూర్‌కు చెందిన పలువురు ‘భీమ్‌ ఆర్మీ’ నేతృత్వంలో బెహత్‌-సహారాన్‌పూర్‌ రహదారిపై బైటాయించి ఆందోళన చేపట్టారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విగ్రహాలను తిరిగి ఏర్పాటుచేయాలని కోరారు. అలాగే ఈ చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఆధిపత్య వర్గాలకి చెందిన వారే విగ్రహాలను ధ్వంసంచేశారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఘున్నా గ్రామంలోని దళితులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. అనంతరం పోలీసులు వచ్చి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆందోళనను అదుపుచేశారు.
దీనిపై దళిత హక్కుల, సామాజిక కార్యకర్త సుశీల్‌ గౌతమ్‌ మాట్లాడుతూ.. కొత్త విగ్రహాలను ఏర్పాటు చేయాలని అన్నారు. విగ్రహాల ధ్వంసానికి పాల్పడిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ‘వారం రోజుల్లోనే ఈ ప్రాంతంలో రెండో ఘటన ఇది. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ఏదో ఒకచోట అంబేద్కర్‌ విగ్రహాలు రోజూ ధ్వంసమవుతున్నాయి. దళితులపై దాడులు చేసే ఉద్దేశంతోనే అల్లర్లు సృంష్టించడానికి బీజేపీ అండదండలతోనే దుండగులు దేశవ్యాప్తంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని’ ఆయన ఆరోపించారు.

Courtesy Nava telangana