తమిళనాడులో హిందూత్వ శక్తుల దుశ్చర్య 
రాష్ట్రవ్యాప్తంగా నిరసనల వెల్లువ 
రాత్రికి రాత్రే మరో విగ్రహం ఏర్పాటు

చెన్నై : బీజేపీ మిత్రపక్షం ఏఐఏడీఎంకే పాలిత తమిళనాడులో దళిత నాయకుడు, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు ఘోర అవమానం జరిగింది. హిందూత్వ అతివాద శక్తులు ఆయన విగ్రహాన్ని ధ్వసం చేశాయి కర్రలు, రాడ్లతో విగ్రహం నుంచి తలను వేరు చేసి.. కూలదోశాయి. నాగపట్టిణం జిల్లాలోని వేదారణ్యం పట్టణంలో చోటుచేసుకున్న ఈఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై తమిళనాడువ్యాప్తంగా దళిత సంఘాలు, రాజకీయపార్టీలు, విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనప్రదర్శనలను నిర్వహించారు. నేరస్థులను శిక్షించాలని పట్టుబట్టాయి. ఘటన జరిగిన ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ప్రాంతంలో శాంతిభద్రతల పరిస్థితుల దృష్ట్యా అక్కడ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ఘటనకు కారణమైన ‘ముక్కులతోర్‌ పులిగల్‌ కట్చి’ సంస్థకు చెందిన 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, కూల్చిన చోటే అంబేద్కర్‌ కాంస్య విగ్రహాన్ని రాత్రికి రాత్రే ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని జిల్లా పోలీసుల యంత్రాంగం వెల్లడించింది.

రెండు వర్గాల మధ్య ఘర్షణ 
గతంలో ముక్కులతోర్‌ వర్గానికి చెందిన వ్యక్తి కారు ఆప్రాంతంలో దళితుడిని ఢ కొట్టింది. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీనిపై ఆగ్రహం చెందిన దళితులు కొందరు నిందితుడి కారుకు నిప్పంటించారు. దీంతో కోపంతో రగిలిపోయిన ముక్కులతోర్‌ వర్గీయుల కన్ను పట్టణంలోని ట్రాఫిక్‌ సిగల్‌ వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహంపై పడింది. అప్పటినుంచి ఆ విగ్రహాన్ని తొలగించాలనే అనేక ప్రయత్నాలూ చేశారు. ఈ క్రమంలో ఆదివారం దళితులతో ఘర్షణకు దిగారు. తీవ్ర అల్లర్ల అనంతరం అంబేద్కర్‌ విగ్రహాన్ని వారు ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించిన పోలీసుల పైనా వాళ్లు రాళ్లు రువ్వారు. వాహనాలకు నిప్పంటించారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.

నేరస్థులను కఠినంగా శిక్షించాలి 
ఈ ఘటనపై తమిళనాడులోని రాజకీయ పక్షాలు స్పందించాయి. ఘటనకు కారణమైనవారిని తక్షణమే కఠినంగా శిక్షించాలని ప్రతిపక్ష డీఎంకేతో పాటు సీపీఐ(ఎం), విడుతలై చిరుతైగల్‌ కట్చి(వీసీకే) నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ ఘటనను వ్యతిరేకిస్తూ డీవైఎఫ్‌ఐ రాష్ట్రంలోని పలు జిల్లాకేంద్రాల్లో నిరసనప్రదర్శనలను నిర్వహించింది. నిందితుల అరెస్టుకు డిమాండ్‌ చేసింది. తమిళనాడులో అంబేద్కర్‌ విగ్రహాలను ధ్వంసం చేయడమో.. అవమానం కలిగేలా చేయడమో గతంలోనూ జరిగాయి. తమిళనాయకుడు పెరియార్‌ రామస్వామి విగ్రహాలను కూలదో యాలంటూ బీజేపీ నాయకులు హెచ్‌. రాజా గతంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

 

(Courtacy Nava Telangana)