ఏడేళ్ల క్రితం నాటి సందర్భం.. ఒక కొత్త జీవితానికి మార్గం వేసింది. ‘మీకెందుకురా చదువు?’ అనిపించుకున్న జాతి నుంచి ఉద్భవించిన మహాజ్ఞానిని అపహాస్యమే చేసిందే ఆ సందర్భం. అప్పుడే ఈ మనిషి నిలువునా చలించిపోయాడు. తానేంటో తెలియనితనంలోంచి, ‘వ్యంగ్యం’గా మారిన జాతి ప్రతీకలో తన స్థానాన్ని వెతుకున్నాడు. మిడిమిడి జ్ఞానాన్ని దాటి చైతన్యాన్ని నింపుకున్నాడు. తన జీవితం అతి సామాన్యమైనదే కానీ తన ఆశయం మాత్రం జాగృతం చేసేది… ఉన్నమాటి శ్యామసుందర్‌ ప్రయాణమిది. దేశంలో ఉన్న ఎందరో యువకుల్లా ఇతడొకడు. వందల కోట్ల జనాభాలో పదుల సంఖ్యకు మాత్రమే తెలిసిన వ్యక్తి. కానీ శ్యామసుందర్‌ రూపొందించిన గ్రంథం మాత్రం ఎందరినో తట్టి లేపుతోంది. స్వీయ కృషితో నేర్చుకున్న ఆయన వ్యంగ్య చిత్రాలు అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశమయ్యాయి. అంతకుమించి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఎన్నో ప్రశంసలూ అందుకున్నాయి. ఈ సామాన్యుడి జీవితంలో దాగున్న ఆశయాలేంటో.. ఆయన ‘జీవన’ం ఏంటో తెలుసుకుందాం పదండి.

శ్యామసుందర్‌ చిన్ననాటి సంగతది… ఒక కుగ్రామంలో బాబా సాహేబ్‌ విగ్రహావిష్కరణకు తండ్రి వెంట వెళ్లాడు. ‘అబ్బా… ఎంత జనం..!’ అంతమంది ఒక్కచోటే కూడటం అంతకుముందెప్పుడూ చూడలేదతను. ఎవరో పెద్దమనిషి విగ్రహావిష్కరణ చేయాల్సి ఉంది. రాత్రవుతున్నా ఇంకా రాలేదు. అయినా జనాభా తగ్గలేదు. గంటల తరబడి నిరీక్షణలోనే ఉన్నారు. ఒకవైపు డప్పుల మోత.. మరోవైపు ఆనందాల హేళ… అప్పుడే అతనికి బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ పరిచయమయ్యాడు. అయితే ఆయన్ని తెలుసుకోలేకపోయాడు ఈ బాలుడు… చాలా కాలం అలాగే… అడపాదడపా వినడమే గానీ గుర్తించాల్సిన ఆలోచనా, ఆవేశం లేదతనికప్పుడు.

అతిసామాన్య నేపథ్యం
శ్యామసుందర్‌ పుట్టింది అత్యంత సాధారణ కుటుంబంలో. తండ్రి సుందర్రావు కమ్యూనిస్టు మాత్రమే కాదు.. అణగారిన కులానికి చెందిన వ్యక్తి. విజయవాడలోని ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సివిఆర్‌ కాలేజీలో అటెండర్‌గా రిటైరయ్యారు. తల్లి రాజేశ్వరికీ చదువంతగా లేదు. తెలుగు మీడియంలో ప్రభుత్వ పాఠశాల చదువులే శ్యామసుందర్‌ నేర్చుకుంది. అయితే ఎప్పుడూ మంచి మార్కులే తెచ్చుకున్నాడు. ‘పెద్దయ్యి నువ్వేమవుతావు?’ అని టీచర్‌ అడినప్పుడు.. డాక్టర్‌ కావాలనే ఆశను ఉత్సాహంగా చెప్పాడు. కానీ డాక్టర్‌ చదివించే స్థోమతలేని దళిత కమ్యూనిస్టు తన కొడుకుని ‘కలెక్టరు అవుదువుగానీ’ అని ప్రోత్సహించాడు. ఇలా ‘సరదా’గా గడిచిపోయిన బాల్యంలో గుర్తించలేని వివక్షలు అనేకం.. ఇప్పుడాలోచిస్తే అవన్నీ గుచ్చేస్తున్న జ్ఞాపకాలే. ఉన్నత చదువుల కోసం పాండిచ్ఛేరి విశ్వవిద్యాలయంలో చేరే ముందు అర్థమయ్యింది ‘ఎస్‌సి’ అభ్యర్థిగా బతకడమంటే ఎంతటి అగాథాన్ని దాటి అడుగెయ్యాలో… ఎన్ని అపహాస్యాలను ఎదుర్కోవాలో..!?

పరిశోధన దిశగా …
సివిల్స్‌ పరీక్షలు రాసే దిశగా శ్యామసుందర్‌ అభ్యాసం నడిచింది. తెలుగు మాధ్యమంలో నేర్చుకున్న జ్ఞానానికి అదనంగా ఇంగ్లీషు అవసరం తెలిసింది. ఎమ్‌ఏ ఇంగ్లీష్‌తో కలిసున్న తులనాత్మక సాహిత్యాన్ని అధ్యయనం చేశాడు. అయితే ‘సివిల్స్‌’ చేపట్టడానికి మరో ఆయుధం అవసరం. దానికోసం చరిత్రను చదవాలని నిర్ణయించుకున్నాడు. ప్రఖ్యాత జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో ఎమ్‌ఏ హిస్టరీలో చేరాడు. కోర్సులో భాగంగా ఎంచుకున్న ‘విజువల్‌ హిస్టరీ’తో అతని ఆలోచనలు ఒక పెద్ద మలుపు తిరిగాయి. ఒకప్పుడు క్యాంపస్‌ మ్యాగజైన్‌ కోసం నేర్చుకున్న కార్టూన్‌ ఆర్ట్‌ ఇప్పుడతనిలో విశ్వరూపం దాల్చింది. దృశ్య కళలపై ఆసక్తి మరింత పెరిగింది. పరిశోధన దిశగా సుందర్‌ని నడిపించింది. అలా ఎంఫిల్‌ కోసం ‘విదేశీ పాలనలో జాతీయతను ప్రతిబింబించే ఆంధ్రప్రదేశ్‌లో వచ్చిన కార్టూన్లు’ అనే అంశం తీసుకొని, పరిశోధన చేశాడు. ఇక పిహెచ్‌డి కోసం ‘చందమామ’ పత్రికలోని కథల్లో చిత్రాలను, వాటిలో కుల ప్రతీకలను విశ్లేషిస్తూ పరిశోధన చేయాలనుకున్నాడు. ఇలాంటి తరుణంలోనే ఎన్సీఆర్టీ పుస్తకంలో ‘రాజ్యాంగ రచన’కు చెందిన పాఠ్యాంశంలో భాగంగా అంబేద్కర్‌పై వ్యంగ్య చిత్రం ప్రచురించారు.

ఆయన పనికే అంకితం
తన పుస్తకంలో శ్యామసుందర్‌ చిత్రాలకు, అక్షరాలకు మధ్య ఉన్న సహకారాన్ని తెలియజేస్తాడు. అంతకుమించి ఒక అంశంపై, దాన్ని చూసేవారి అభిప్రాయలపై వాటి ప్రభావం ఎంతగా ఉంటుందో చెబుతాడు. అంబేద్కర్‌ సామాజిక ప్రయోజనం కోసం వేసిన ప్రతి అడుగునూ అపహాస్యం చేస్తూ ప్రధాన పత్రికలు ఎంతటి వివక్షను చూపించాయో తెలియజేస్తాడు. ఈ పరిశోధన అప్పటి ఇంగ్లీష్‌ పత్రికల్లో అంబేద్కర్‌పై వచ్చిన వ్యంగ్య చిత్రాలకు మాత్రమే పరిమితమయ్యింది. అయితే అంబేద్కర్‌ వ్యంగ్య చిత్రాలపై వచ్చిన మొదటి పుస్తకం ఇదేనని చెప్పాలి. ఈ పుస్తకం దేశవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలను అందుకుంది. ‘ఇదే పుస్తకాన్ని పి.హెచ్‌డి. పరిశోధనగా సమర్పించవచ్చుగా..?!’ అని కొందరు స్నేహితులు చెబితే… ‘నాకు డిగ్రీ రావడం కంటే ఈ పుస్తకం త్వరగా బయటకు రావడం ముఖ్యం’ అని చేసే పనిపైన నిబద్ధతను చాటుకున్నాడు. ఈ పుస్తకమే కాకుండా అంబేద్కర్‌ను నిజాయితీగా చూపించిన ‘బాంబే క్రానికల్‌/ ది బాంబే సెంట్రినల్‌’ పత్రికల్లో అంబేద్కర్‌పై వచ్చిన వ్యంగ్య చిత్రాలపై ఒక పుస్తకాన్ని తయారుచేస్తున్నాడు ఇప్పుడు. అలాగే అంబేద్కర్‌ దక్షిణ భారతదేశ యాత్రపై ఒక పుస్తకాన్ని రాయాలని అనుకుంటున్నాడు.

తెలుగులో అంబేద్కర్‌
ఇక శ్యామసుందర్‌ అనుకోకుండా నేర్చుకున్న కార్టూన్‌ కళ అతనికి సరికొత్త గుర్తింపు ఇచ్చింది. దళిత సామాజిక వర్గం, స్త్రీలు, అభ్యుదయ ఆలోచనలను ప్రతిఫలిస్తూ శ్యామసుందర్‌ గీసిన వ్యంగ్య చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో మంచి పాపులారిటీ పొందాయి. శ్యామసుందర్‌ పేరు ఎంత మందికి తెలుసోగానీ ఆయన కార్టూన్లు మాత్రం ఎంతోమంది షేర్‌ చేసుంటారు. అలా ‘అంటరాని ప్రేమ’పై శ్యామసుందర్‌ గీసిన వ్యంగ్య చిత్రాలన్నీ కలిపి స్విట్జర్లాండ్‌లో ‘కామిక్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌’లో ప్రదర్శన నిర్వహించారు. అక్కడ సదస్సులో భారతదేశంలో జరిగే కులదురహంకార హత్యలపై మాట్లాడాడు శ్యామసుందర్‌. ఈయన ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతాడు. ఒకప్పుడు సామాజిక అంశాలను గుర్తిస్తూ వ్యంగ్య చిత్రాలు ఎక్కువగా వస్తే, ప్రస్తుతం వ్యంగ్య చిత్రాలు రాజకీయాలకే పరిమితమయ్యాయని. వ్యంగ్య చిత్రాలంటే ఒక వ్యక్తిని దూషించడం, దేహాన్ని దూషించడం, స్త్రీలను, కుటుంబ వ్యవస్థను దూషించడంతోనే సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అందులో మార్పు రావాలని ఆశిస్తున్నాడు. అంబేద్కర్‌ గురించి తెలుగులో ఇప్పటివరకూ వచ్చిన అనువాద సాహిత్యం కాకుండా తెలుగులోనే ఒరిజినల్‌ సాహిత్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయడమే లక్ష్యంగా ప్రస్తుతం పనిచేస్తున్నాడు శ్యామసుందర్‌.

అంబేద్కర్‌కు అవమానం
మహోన్నత ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని తయారుచేసే దిక్సూచి కోసం మల్లగుల్లాలు పడుతున్న స్వతంత్ర భారతానికి చుక్కానిగా మారిన ఒకేఒక్క మహానేతను అపహసించింది ఈ విద్యావ్యవస్థ. రాజ్యాంగమనే నత్తను నడిపిస్తున్న డాక్టర్‌ అంబేద్కర్‌ వెనుక నిలబడి జవహర్‌లాల్‌ నెహ్రూ చెర్నాకోల ఝుళిపిస్తున్నట్లుగా వ్యంగ్య చిత్రాన్ని కె.శంకర్‌ పిళ్ళై గీస్తే, దాన్ని ఎన్సీఆర్టీ ఇంటర్మీడియట్‌ పాఠ్యపుస్తకంలో ప్రచురించింది. 2012లో జరిగిన ఈ సంఘటనపై ఎంతో వ్యతిరేకత వచ్చింది. దానితో సుఖ్‌దేవ్‌ థోరట్‌తో వేసిన కమిటీ దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటనకు పరిష్కార మార్గం వెతుకుతున్న తరుణంలో ఉన్నమాటి శ్యామసుందర్‌ పేరు బయటకొచ్చింది. అప్పటికే శ్యామసుందర్‌ వ్యంగ్య చిత్రాలపై పరిశోధన చేస్తుండటంతో ఆయన సహకారాన్ని కోరారు. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ నిబద్ధతను అవమానించే ఈ వ్యంగ్య చిత్రం శ్యామసుందర్‌ను ఎంతో కలవరానికి గురిచేసింది. అంబేద్కర్‌పై అప్పటివరకూ వచ్చిన కార్టూన్లను సేకరించే పనిలో నిమగమయ్యాడు. వ్యంగ్యచిత్రాల రూపంలో అంబేద్కర్‌ని అపహసించిన నిజాలు ఒకొక్కటీ కళ్లకు కనిపిస్తుంటే శ్యామసుందర్‌కు తన మార్గమేంటో తెలిసింది. తన కర్తవ్యం బోధపడింది. తన పిహెచ్‌డి పరిశోధనని పక్కన పెట్టి, రెండేళ్ల కృషితో వ్యంగ్య చిత్రాల్లో నవ్వకూడని అంశాలేంటో పుస్తకం రూపంలో బహిర్గతం చేశాడు. ‘నో లాఫింగ్‌ మేటర్‌ : ది అంబేద్కర్‌ కార్టూన్స్‌ 1932-1956’ అనే పుస్తకాన్ని వెలువరించాడు.
ప్రవీణ్‌ వెలువోలు

Courtesy Prajasakti…