Image result for - దేశమంతా భగ్గుమన్న పౌరసత్వ జ్వాలలు"– దేశమంతా భగ్గుమన్న పౌరసత్వ జ్వాలలు
– ఖాకీ కాల్పుల్లో ముగ్గురు మృతి..
– తుపాకులు గురి
– ఎక్కడికక్కడ అడ్డగింపులు…లాఠీలతో వీరంగం
– ఇంటర్‌నెట్‌, మొబైల్‌ సేవలు నిలిపివేత
– స్తంభించిన జనజీవనం
– ఢిల్లీలో ఎమర్జెన్సీని తలపించిన ఆంక్షలు
– ఏచూరి, రాజా, ప్రకాశ్‌ కరత్‌, బృందా, రాఘవులు అరెస్టు
– కదం తొక్కిన విద్యార్థి, యువత, మేధావి, కార్మికవర్గాలు

పౌరసత్వ చట్టం, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు ఇచ్చిన ధర్నా పిలుపుతో విద్యార్థి, యువత, మేధావి, సామాన్య ప్రజానీకం, కార్మిక వర్గాలు పెద్ద ఎత్తున కదం తొక్కాయి. ఈ క్రమంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎటు చూసినా నిర్బంధకాండ కొనసాగింది. బీజేపీ సర్కార్‌ జారీ చేసిన ఆదేశాలతో పోలీసులు వీరంగం సృష్టించారు. ఇంటర్‌నెట్‌,మొబైల్‌ సేవలను నిలిపివేసినా జనం భారీగా తరలివచ్చారు. నిరసనకారుల ఆగ్రహ జ్వాలలను అడ్డుకోవటానికి లాఠీలతో బాదారు. భాష్పవాయువుగోళాలు ప్రయోగించారు. అయినా జనం రోడ్లపైకి వచ్చి మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. పౌరాగ్రహం దెబ్బకు ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. ఢిల్లీలో పోలీసుల తీరుపై వామపక్షనేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళూరు, లక్నోలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు.

న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), 2019పై దేశవ్యాప్త నిరసనలతో మోడీ సర్కారుపై ఒత్తిడి తీవ్రమవుతున్నది. సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ప్రజలు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, పౌరసంఘాల నాయకులు, మేధావులు చేస్తున్న నిరసనలు, ఆందోళనలు, ర్యాలీలు, దీక్షలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. సీఏఏ కు వ్యతిరేకంగా గురువారం దేశవ్యాప్తంగా నిరసనలు హౌరెత్తాయి. దేశరాజధాని వామపక్ష పార్టీల నిరసనలతో దద్దరిల్లింది. పలు రాష్ట్రాలు, ప్రధాన నగరాల్లో పోలీసులు విధించిన నిషేధాజ్ఞలు ఆందోళనాకారులపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు. వీధుల్లోకి వచ్చి మరీ, సీఏఏకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. నినాదాలతో హౌరెత్తించారు. బీజేపీ పాలిత రాష్ట్రం యూపీలోని లక్నోలో సీఏఏ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. కర్నాటకలోని బెంగళూరు, మంగళూరు నగరాల్లో నిరసనలు ఉధృతంగా జరిగాయి. కర్నాటకలో ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ, ఢిల్లీలో ఎర్ర కోట వద్ద సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్‌లను పోలీసులు అదుపులో తీసుకున్నారు. పలు నగరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఇంటర్నెట్‌ సర్వీసులను నిలిపివేశారు. ముంబయి, భోపాల్‌, ఛత్తీస్‌గఢ్‌, చెన్నై, చండీగఢ్‌, తిరువనంతపురంతో పాటు పలు ప్రాంతాల్లో నిరసనకారులు.. సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు.

పోలీసుల అదుపులో రామచంద్ర గుహ, యోగేంద్రయాదవ్‌
Image result for - దేశమంతా భగ్గుమన్న పౌరసత్వ జ్వాలలు"కర్నాటకలో పౌర నిరసనలు రాజుకున్నాయి. చట్టానికి వ్యతిరేకంగా ప్రధాన నగరాలైన బెంగళూరు, మంగళూరులలో ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఈ ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. బెంగళూరులోని టౌన్‌ హాల్‌ వద్ద సీఏఏకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనతో పాటు ఇతర నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ‘కచ్చితంగా రాజ్యాంగవిరుద్ధం’ అని రామచంద్ర గుహ అన్నారు. రామచంద్ర గుహను అదుపులోకి తీసుకోవడంపై ప్రతిపక్షాలు బీజేపీని తప్పుబట్టాయి. కేరళ సీఎం పినరయి విజయన్‌, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ సహా పలువురు ప్రముఖులు పోలీసుల తీరును ఖండించారు. కలబురగి, హుబ్బల్లి, బళ్లారి, హస్సన్‌, మైసూర్‌ వంటి ప్రాంతాల్లోనూ పౌరసత్వ నిరసనలు జరిగాయి.

పోలీసుల కాల్పులు.. మంగళూరులో ఇద్దరు మృతి
మంగళూరులో సీఏఏ నిరసనలు హింసాత్మకంగా మారాయి. శాంతియుతంగా నిరసన చేస్తున్న ఆందోళనాకారులపై పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. మృతులను జలీల్‌(49), నసీన్‌(23) లుగా గుర్తించారు. ఈ విషయాన్ని మంగళూరు పోలీసు అధికారి డాక్టర్‌ హర్ష ధ్రువీకరించారు. అంతకముందు లాఠీచార్జి చేసి, భాష్పవాయు గోళాలను ప్రయోగించిన పోలీసులు పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. కర్నాటకలోని పలు ప్రాంతాల్లో ఈనెల 21 వరకు నిషేధాజ్ఞలు విధిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నిరసనల నేపథ్యంలో విద్యాసంస్థలు మూతపడ్డాయి.
ఎర్రకోట వద్ద సీఏఏ నిరసన ర్యాలీలో పాల్గొన్న స్వరాజ్‌ అభియాన్‌ చీఫ్‌ యోగేంద్ర యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోడీ పాలనలో దేశంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు లేకుండా పోయిందని ఆయన అన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా, జేఎంఐ విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ పూణేలో కాంగ్రెస్‌ నాయకులు నిరాహార దీక్షను చేపట్టారు.

సీఏఏ నిరసనలు యూపీలోనూ కొనసాగాయి. లక్నోలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. లాఠీచార్జ్‌ చేశారు. భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఆందోళనాకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో మహ్మద్‌ వకిల్‌ అనే వ్యక్తి మరణించారు. నిరసనలను కవర్‌ చేస్తున్న జర్నలిస్టుల పైనా పోలీసులు విరుచుకుపడ్డారు. పోలీసుల చర్యతో పలువురు గాయపడ్డారు. సంభాల్‌ జిల్లాలోనూ హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఈ సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. లక్నోలోని ఓల్డ్‌ సిటీ, ఘజియాబాద్‌, మీరట్‌, అలీగఢ్‌, సంభాల్‌, మౌ, ఆజాంగఢ్‌లలో ఇంటర్నెట్‌ సర్వీసులను నిలిపివేశారు.

బీహార్‌ బంద్‌
వామపక్ష విద్యార్థి సంఘాలు బీహార్‌ బంద్‌కు పిలుపునివ్వడంతో ఆందోళనాకారులు రోడ్డు, రైలు మార్గాలను దిగ్బంధించారు. ట్రాపిక్‌కు అంతరాయం ఏర్పడింది. దర్భాంగా జిల్లాలోని లహరియా సరారు స్టేషన్‌ దగ్గర ట్రాక్‌లపై సీపీఐ(ఎం) కార్యకర్తలు కూర్చొని నిరసన తెలిపారు. ఆందోళనాకారులు రోడ్లను దిగ్బంధించడంతో ఎన్‌హెచ్‌ 10, ఎన్‌హెచ్‌ 83 లపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

మేఘాలయలోని షిల్లాంగ్‌లో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా 144 సెక్షన్‌ను విధించారు. ప్రస్తుతం అక్కడ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇన్నర్‌ లైన్‌ పర్మిట్‌(ఐఎల్‌పీ)ను కేంద్రం అమలు చేయాలంటూ ఆ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. చండీగఢ్‌లో వందలాది మంది విద్యార్థులు, ప్రజలు సీఏఏకు వ్యతిరేకంగా మార్చ్‌ నిర్వహించారు. సెక్షన్‌ 144 అమలులో ఉన్నప్పటికీ.. నిబంధనలకు లోబడి ఐఐఎం బెంగళూరు విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు.. నిరసన వ్యక్తం చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో విద్యార్థులు వీధుల్లోకి వచ్చి పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.
తమిళనాడులోని థేనీలో.. నిరసనలు చేపట్టిన డీవైఎఫ్‌ఐ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వామపక్షాల పిలుపుమేరకు సేలంలో ఆందోళనాకారులు రాస్తారోకో నిర్వహించారు. వందలాది మందిని పోలీసులు అరెస్టు చేశారు.
పౌరసత్వ నిరసనల ఎఫెక్ట్‌ విమానాశ్రయాల పైనా పడింది. ఎన్‌హెచ్‌-8పై వాహనాలు అధిక సంఖ్యలో నిలిచిపోవడంతో విమానయాన సిబ్బంది ట్రాఫిక్‌లో చిక్కుకున్నారనీ, దీంతో 19 ఇండిగో ఫ్లైట్‌లు రద్దు కాగా, 16 ఇతర ఫ్లైట్‌లు ఆలస్యమయ్యాయని ఢిల్లీ ఏయిర్‌పోర్ట్‌ అధికారి ఒకరు తెలిపారు. సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా కోల్‌కతాలోనూ నిరసన ర్యాలీలో జరిగాయి..

ముంబయిలోనూ ఆందోళనాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా నిరసనలతో హౌరెత్తించారు. అగస్ట్‌ క్రాంతి మైదాన్‌లో ఏర్పాటు చేసిన ఆందోళనకు దాదాపు లక్ష మందికి పైగా హాజరయ్యారు. బాలీవుడ్‌ ప్రముఖులు ఫరా అక్తర్‌, హ్యూమా ఖురేషీ, జిం సర్భ్‌ లు, రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. దీంతో పోలీసులు అక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోనూ పౌరసత్వ నిరసనలు ఎగిశాయి. అహ్మదాబాద్‌లోని లాల్‌దర్బాజ ప్రాంతంలో నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో అది కాస్తా ఉద్రిక్తంగా మారింది. వడోదరతో పాటు పలు వర్సిటీల్లో విద్యార్థులు నిరసనలు తెలిపారు.

ఢిల్లీలోని కేరళ విద్యార్థులకు భద్రత కల్పించాల్సిందిగా కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్‌షాకు రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌ లేఖరాశారు. దేశవ్యాప్తంగా పౌరసత్వ నిరసనల నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించడానికి కేంద్రహౌం శాఖ మంత్రి అమిత్‌ షా సమావేశానికి పిలుపునిచ్చారు.

పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ.. కోల్‌కతాలో మరోర్యాలీని నిర్వహించారు. సీఏఏపై యూఎన్‌ పర్యవేక్షణలో రెఫరెండానికి సిద్ధమా? అంటూ మోడీ సర్కారుకు ఆమె సవాలు విసిరారు. అసోంలో పలు ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.

(Courtesy Nava Telangana)