ఎస్‌. వెంకట్రావు

అసోంలో అమలు చేసిన ‘జాతీయ పౌరసత్వ జాబితా’ను దేశవ్యాపితంగా విస్తరింపజేస్తామని కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌ షా చెప్పడంతో దేశం నలుమూలలా భయాందోళనలు బయలుదేరాయి. ఈ ‘జాతీయ పౌరసత్వ జాబితా’ వల్ల అసోంలో అక్రమ వలసదారులుగా గుర్తింపు పొందిన సుమారు 20 లక్షల మంది ప్రజలను ప్రభుత్వం వివిధ శిబిరాల్లో చేర్చింది. వారికి ఎటువంటి భారత పౌర హక్కులు ఉండవు. వారి భవితవ్యం ఏంటో తెలియని పరస్థితి ఎదురౌతుంది. అయితే తాజాగా పార్లమెంటు ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) వల్ల ఇటువంటి ప్రజల్లో ముస్లిమేతరులు భారత పౌరసత్వం పొందడానికి అర్హత సాధిస్తారు. ముస్లింలు మాత్రం అక్రమ వలసదారులుగా మిగిలిపోతారు. రేపు ఎన్‌ఆర్‌సిని దేశమంతటా అమలు జరిపినప్పుడు కూడా సిఎఎ వల్ల ముస్లిమేతరులకు భయం ఉండదనీ, కేవలం ముస్లింలు మాత్రమే అక్రమ వలసదారులుగా మిగిలిపోతారని అమిత్‌ షా బృందం చెబుతోంది. బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ హిందూత్వ ఎజెండాలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చిందన్నది నిస్సందేహం. అయితే సిఎఎ తమకు అడ్డు చక్రం వేసి కాపాడుతుందని అసోంలోని బెంగాలీ హిందువులు కూడా నమ్మడం లేదు. ఎన్‌ఆర్‌సిని దేశవ్యాపితంగా విస్తరిస్తే ముస్లింలతోపాటు అన్ని మతాల ప్రజలు నష్టపోతారు. ఎలాగంటే…

అసోంలో ఎన్‌ఆర్‌సి వల్ల దాదాపు 20 లక్షల మంది ప్రజలు అక్రమ వలసదారులుగా మారారు. వారిలో సుమారు 12 లక్షల మంది హిందువులే. 1971కి ముందు తమ పూర్వీకులు బంగ్లాదేశ్‌లో నివసించినట్లు నిరూపించుకోలేని వారందరినీ అక్రమ వలసదారులుగా ఎన్‌ఆర్‌సి ప్రకటించింది. చాలా మంది గ్రామీణ పేద ప్రజల వద్ద 48 ఏళ్ల క్రితం తాము, లేక తమ పూర్వీకులు అసోంలో నివసించినట్లు చూపే ఆధరాలు లేవు. అక్కడ నివసిస్తున్న గిరిజన ఆదివాసీలూ, మూలవాసుల వద్ద కూడా ఇటువంటి ఆధారాలు లేవు. అందువల్ల ముస్లిం ప్రజలే కాకుండా పేద హిందువులు, ఆదివాసీలు కూడా దీని వల్ల నష్టపోయారు. ఇప్పుడు వీరందరికీ పౌరసత్వ సవరణ చట్టం కింద భారతీయ పౌరసత్వం ఇవ్వాలంటే ముందుగా వారు తాము బంగ్లాదేశ్‌ నుండి అక్రమంగా వలస వచ్చినట్లు అంగీకరించాలి. అసోం ఎన్‌ఆర్‌సి వల్ల అక్రమ వలసదారులుగా తేలిన 12 మంది హిందువుల్లో బంగ్లాదేశ్‌ నుండి వచ్చిన వారే కాదు ఉత్తర భారత దేశం నుండి వచ్చిన హిందువులు కూడా ఉన్నారు.

అమిత్‌ షా పార్లమెంటులో ప్రకటించినట్లు రేపు ఎన్‌ఆర్‌సిని దేశమంతటా అమలు చేస్తే ముందుగా జరిగేదేంటి? ఒక్క కలం పోటుతో దేశం లోని 130 కోట్ల మంది ప్రజలు-హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు అందరూ భారత దేశ పౌరులు కాకుండా పోతారు. ఆపై దేశం లోని ప్రతి పౌరుడూ తాను భారతీయుణ్ణేనని నిరూపించుకోవాలి. అంటే ఇన్నేళ్లూ ఈ దేశ పౌరులు కాని వారెవరో గుర్తించే బాధ్యత ప్రభుత్వం మీద ఉండేది. ఇప్పటి నుంచీ మనం ఈ దేశ పౌరులమని రుజువు చేసుకోవాల్సిన అగత్యం కల్పించింది మోడీ ప్రభుత్వం.

1950 నుండి ఈ దేశంలో నీవు గానీ నీ పూర్వీకులు గానీ నివసించినట్లు రికార్డులు సమర్పిస్తేనే నీకు ఎన్‌ఆర్‌సి ప్రకారం భారత పౌరసత్వం లభిస్తుంది. 130 కోట్ల మందిలో ఎంత మంది ప్రజలు ఇటువంటి రికార్డులు సమర్పించగలరు? పుట్టిన స్థలానికి సంబంధించి ఎక్కువ మంది దగ్గర రుజువు ఉండదు. ఎందుకంటే దశాబ్దం క్రితం వరకు అత్యధిక శిశు జననాలు ఇళ్లలోనే జరిగాయి. అందువల్ల మునిసిపల్‌, పంచాయతీ రికార్డుల్లో జనన, మరణ రిజిస్టర్లలో వారి పేర్లు ఉండవు. అందునా గ్రామీణ ప్రాంతాల ప్రజల వద్ద రికార్డులు అసలు ఉండవు. పొట్ట చేతబట్టుకుని బతుకుతెరువు కోసం వలసలు పోయిన కార్మికుల వద్ద కూడా ఏ రికార్డులూ ఉండవు.

ఎన్‌ఆర్‌సి ప్రకటించిన వెంటనే దేశమంతటా (అసోం మినహా) 130 కోట్ల మంది భారతీయులు తాము భారతీయులమని నిరూపించుకోవాలి. అలా నిరూపించుకోకపోతే అక్రమ వలసదారులై పోతారు. ప్రజలు క్యూ లైన్లలో నిలుచోవలసి వస్తుంది. గతంలో మోడీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు వల్ల ఏర్పడిన భయం వల్ల ఎన్ని కోట్ల మంది ప్రజలు క్యూ లైన్లలో నిలబడిందీ, ఎంత మంది ప్రాణాలు పోగొట్టుకున్నదీ మనం చూశాం. అప్పుడు డబ్బు కోసం నిలబడితే ఇప్పుడు భారతీయులంతా తమ అస్తిత్వం (భారతీయులమేనని నిరూపించుకోవడం) కోసం నిలబడాలి. అలా నిరూపించుకోలేని వారంతా హిందూ, ముస్లిం, క్రైస్తవ భేదం లేకుండా పరాయి దేశస్తులూ, అక్రమ వలసదారులూ అయిపోతారు. మూడు కోట్ల మంది జనాభా ఉన్న అసోంలో 20 లక్షల మంది అక్రమ వలసదారులుగా మారిపోతే 130 కోట్ల జనాభాలో ఎంత మంది మారిపోతారో ఊహించుకోవచ్చు.

అక్రమ వలసదారులుగా మారిపోయిన వారిలో కేవలం ముస్లింలను మినహాయించి మిగిలిన వారందరూ సిఎఎ ప్రకారం భారతీయ పౌరసత్వం పొందడానికి అర్హులవుతారు. కానీ ఎప్పుడు? వారంతా ముందుగా తాము అక్రమ వలసదారులమని అంగీకరించాలి. నీవు ఆంధ్రుడివి అయినా, తమిళుడివి అయినా లేక ఉత్తరప్రదేశ్‌కు చెందిన వాడివి అయినా సరే బంగ్లాదేశ్‌ నుండో, పాకిస్తాన్‌ నుండో లేక ఆప్ఘనిస్తాన్‌ నుండో అక్రమంగా భారత దేశంలోకి వలస వచ్చానని అంగీకరించాలి. ఇతర దేశాల నుండి వచ్చానంటే నీకు ‘క్షమాభిక్ష’ లభించదు. ఎందుకంటే అమిత్‌ షా చట్టం ప్రకారం ఈ మూడు దేశాల నుండి వలస వచ్చిన ముస్లిమేతరులకు మాత్రమే ‘క్షమాభిక్ష’ లభిస్తుంది. ముస్లింలకు ఆ ‘క్షమాభిక్ష’ కూడా లభించదు. ఎంత అన్యాయం!!

మొదటి అన్యాయం, భారతీయుడినై ఉండి నేను భారతీయుడినే అని నిరూపించుకోవలసి రావడం.
రెండవ అన్యాయం, నిరూపించుకోలేకపోతే, నేను భారతీయుడినైనా అక్రమ వలసదారుడిని అని ఒప్పుకోవాల్సి రావడం.
మూడవ అన్యాయం, అక్రమ వలసదారునిగా ఒప్పుకున్న తరువాత నేను బంగ్లాదేశ్‌ నుండో, పాకిస్తాన్‌ నుండో, ఆప్ఘనిస్తాన్‌ నుండో వచ్చానని చెప్పాల్సి రావడం.
నాల్గవ అన్యాయం, భారతీయుడినే అయినా ముస్లింను అయినందుకు నేను భారతీయ పౌరసత్వానికి అనర్హుణ్ణి కావడం.

ఇప్పటికే మనం భారతీయులం అని నిరూపించేందుకు ఆధార్‌ కార్డులున్నాయి. ఇవి భారత ప్రభుత్వంచేత జారీ చేయబడుతున్న కార్డులు. ఇవి కాకుండా ప్రతి అయిదేళ్లకూ, ఇంకా చెప్పాలంటే స్థానిక ఎన్నికలతో కలిపి చూసుకుంటే ప్రతి ఏటా తాజా పరుస్తున్న ఓటరు గుర్తింపు కార్డులున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే రేషన్‌ కార్డులు ఇతరత్రా సవాలక్ష గుర్తింపు కార్డులున్నాయి. ఇన్ని గుర్తింపు కార్డులుండగా మరో సారి నేను భారతీయుణ్ణని గుర్తింపు పొందేందుకు ఎన్‌ఆర్‌సి పేరుతో మరో గుర్తింపు కార్డు అవసరం ఏమొచ్చింది?
అసోంలో ఎన్‌ఆర్‌సి అమలుకు రూ.1,220 కోట్లు ఖర్చయింది. దేశం మొత్తం మీద అమలు చేయాలంటే సుమారు రూ.50 వేల కోట్ల నుండి రూ.60 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో దేశ ప్రజలు దీన్ని భరించాలి. దీని కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అనేక చోట్ల గుర్తింపు కేంద్రాలు నెలకొల్పాలి. ఎన్‌ఆర్‌సిలో నమోదు కాకుండా ‘అక్రమ వలసదారులు’గా మిగిలిపోయిన కోట్లాది మందిని ఏం చేస్తారు? బంగ్లాదేశ్‌కో, పాకిస్తాన్‌కో బలవంతంగా పంపలేరు కదా! పంపినా అవతలి వాళ్లు స్వీకరించరు కదా! అప్పుడు వాళ్ల కోసం ప్రత్యేక శిబిరాలు నెలకొల్పాలి. ప్రస్తుతం అసోంలో ఇటువంటి శిబిరాలు ఏర్పాటు చేశారు. దీనికి ఖర్చు ఎంతవుతుంది?
అందువల్ల బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్‌ఆర్‌సి, సిఎఎ చట్టాల వల్ల ముస్లింలకే కాదు హిందువులకూ ఇతర భారతీయులకు కూడా తీవ్ర నష్టం జరుగుతుందన్నది స్పష్టం. కాబట్టి ఈ సమస్యను దేశం లోని ముస్లింల సమస్యగానే చూడకూడదు. దీన్ని దేశ రాజ్యాంగానికీ, లౌకిక, ప్రజాస్వామ్యానికీ ముంచుకొస్తున్న ప్రమాదానికి సంబంధించిన సమస్యగానే కాకుండా మతాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రజలందర్నీ తీవ్ర ఇక్కట్లకు గురిచేసే సమస్యగా చూడాలి.

Courtesy Prajashakti