ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా కార్మికుల నిరసన
దేశవ్యాప్తంగా సమ్మెతో నిలిచిన ఉత్పత్తి
విద్యుత్‌ సరఫరాకు అంతరాయం
రూ. 400 కోట్లకుపైగా నష్టం
సమ్మె సక్సెస్‌ : కార్మిక సంఘాలు
ప్రభుత్వరంగాన్ని నిర్వీర్యం చేసేలా మోడీ సర్కార్‌ నిర్ణయాలు తీసుకుంటున్నది. ప్రభుత్వ ఖజానాపై భారమంటూ ప్రయివేటుపరం చేయాలని బీజేపీ ప్రభుత్వం యోచిస్తున్నది. కోల్‌ మైనింగ్‌లో వందశాతం విదేశీ ప్రత్యక్షపెట్టుబడులకు(ఎఫ్‌డీఐ) అనుమతినివ్వాలని మోడీ క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికలోకం కన్నెర్ర చేసింది. ఒకరోజు సమ్మెకు పిలుపునివ్వగానే.. ఐదులక్షల మంది కార్మికులు రోడ్డుపైకి వచ్చారు. మోడీ విధానాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు, బ్యానర్లు చేతపట్టి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దీంతో బొగ్గు గనులన్నీ స్థంభించిపోయాయి. సమ్మె విజయవంతమైందని కార్మికసంఘాలు ప్రకటించాయి.

న్యూఢిల్లీ : కోల్‌ మైనింగ్‌లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ)ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా దాదాపు ఐదులక్షల మందికి పైగా బొగ్గు గని కార్మికులు ఒక్క రోజు సమ్మె చేపట్టారు. కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీస్తూ మోడీ సర్కారు ఎఫ్‌డీఐపై తీసుకొచ్చిన ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా మంగళవారం సమ్మెలో ఐదు కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. ఇందులో ఆలిండియా కోల్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌(సీఐటీయూ), ఇండియన్‌ మైన్‌వర్కర్స్‌ ఫెడరేషన్‌(ఏఐటీయూసీ)తో పాటు ఇండియన్‌ నేషనల్‌ మైన్‌వర్కర్స్‌ ఫెడరేషన్‌(ఐఎన్‌టీయూసీ), హింద్‌ ఖాదన్‌ మజ్దూర్‌ మోర్చా ఫెడరేషన్‌(హెచ్‌ఎంఎస్‌), ఆలిండియా సెంట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ (ఏఐసీసీటీయూ) లు ఉన్నాయి. కాగా, కేంద్రం తీరును నిరసిస్తూ తాము చేపట్టిన సమ్మె ‘100శాతం’ విజయవంతమైందని కార్మిక సంఘాలు తెలిపాయి. కార్మికుల సమ్మెతో కోల్‌ఇండియా లిమిటెడ్‌(సీఐఎల్‌)లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. దాదాపు 1.5 నుంచి 2.5 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని అంచనా. అలాగే రూ. 400 కోట్లకు పైగా నష్టం వాటిల్లిన ట్టుగా తెలుస్తున్నది. మరోపక్క, సరిపడా బొగ్గు ఉత్పత్తి లేక ప్లాంట్లలో విద్యుత్‌ సరఫరాపై ప్రభావం పడింది. ”సమ్మె పూర్తిగా విజయవంతమైంది. దాదాపు ఒకటి నుంచి రెండు శాతం సిబ్బంది హాజరు మాత్రమే నమోదైంది. రైలు, రోడ్డు రవాణా ద్వారా నడిచే బొగ్గు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఈ సమ్మెలో దాదాపు 2.7 లక్షల శాశ్వత కార్మికులు, దాదాపు మరో 2.25 లక్షల మంది కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు” అని ఆలిండియా కోల్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ నాయకుడు డి.డి రామానందన్‌ వెల్లడించారు.
బొగ్గుగని కార్మికుల సమ్మెకు సంఘీభావంగా ఆలిండి యా సెంట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ (ఏఐసీసీటీ యూ) దేశరాజధానిలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన ప్రదర్శనలను చేపట్టింది. ” వేల కోట్ల డివిడెండ్లను చెల్లిస్తూ.. ఆదాయ నిల్వలను కలిగి ఉన్నప్పటికీ, కోల్‌ సెక్టార్‌ను ప్రయి వేటు పరం చేసేందుకు కేంద్రం పూర్తిస్థాయిలో వ్యూహాత్మకం గా ప్రయత్నిస్తున్నది. ఇది ప్రభుత్వ ఆధీనంలోని బొగ్గు కంపెనీలు, అందులోని ఉద్యోగుల భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా ప్రజల వనరులను లూటీ చేసేందుకు ప్రయివేటు మైనర్లకు దోహదం చేస్తుంది” అని ఓ ప్రకటనలో ఏఐసీసీటీయూ పేర్కొన్నది.

‘100శాతం ఎఫ్‌డీఐను ఉపసంహరించాలి
ఆటోమెటిక్‌ రూట్‌ ద్వారా కోల్‌ సెక్టార్‌లో 100 శాతం ఎఫ్‌డీఐలను ఉపసంహరించాలని కేంద్రాన్ని బొగ్గు గని కార్మికులు ప్రాథమికంగా డిమాండ్‌ చేస్తున్నారు.
ఎఫ్‌డీఐ కారణంగా ప్రయివేటు కంపెనీల ఉత్పత్తి వ్యయం తగ్గింపులో భాగంగా తమ ఉద్యోగ భద్రత, ఇతర ప్రయోజనాలకు భంగం వాటిల్లే ప్రమాదమున్నదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే సీఐఎల్‌కు అనుబంధంగా ఉన్న ఈసీఎల్‌, బీసీసీఎల్‌, సీసీఎల్‌, సీఎంపీడీఐ, ఎస్‌ఈసీఎల్‌, ఎంసీఎల్‌ లను సీఐఎల్‌లోనే విలీనం చేయాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు.
కాంట్రాక్టర్లు, ఔట్‌సోర్సింగ్‌, మైనింగ్‌ డెవలపర్స్‌, ఆపరేటర్ల ద్వారా కోల్‌ మైనింగ్‌ను ఆపేసి మైనింగ్‌లో ఎంగేజ్‌ అయిన కార్మికులను రెగ్యులరైజ్‌ చేసి సీఐఎల్‌ కార్మికులుగా గుర్తించాలని డిమాండ్‌ చేస్తున్నారు.
కేంద్రం ఆదేశాల మేరకు కోల్‌ మైనింగ్‌లో కొత్త నియామకాలు ఆగిపోయాయని వాటిని ఉద్యోగ నియామకాలను కొనసాగించాలని మైనింగ్‌ యూనియన్లు తెలుపుతున్నాయి. తమ డిమాండ్లు పరిష్కారం కాకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని కేంద్రాన్ని యూనియన్లు హెచ్చరించాయి.
కాగా, ఈ సమ్మెలో ఆర్‌ఎస్‌ఎస్‌ అనుంబంధ కార్మిక సంఘం భారతీయ మజ్దూర్‌ సంఫ్‌ు(బీఎంఎస్‌) మాత్రం పాల్గొనలేదు. అయితే ఇదే అంశంపై తాము సోమవారం నుంచి 27 వరకు ఐదురోజుల సమ్మెకు దిగనున్నట్టు నోటీసును ఇచ్చింది. అయితే తాము ఏదో చేస్తున్నామన్న భావనను కార్మికుల్లో కల్పించేందుకే బీఎంఎస్‌ చర్యలని ఇండియన్‌ నేషనల్‌ మైన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ సెక్రెటరీ జనరల్‌ ఎస్‌.క్యూ జామా ఆరోపించారు.

కార్మికుల ఐక్యతకు నిదర్శనం..సీఐటీయూ
దేశవ్యాప్తంగా కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరి స్తున్న బీజేపీ సర్కారుపై కార్మికులు ఐక్యంగా పోరాడాలని సెంటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్స్‌(సీఐటీయూ) పిలుపునిచ్చింది. కోల్‌ మైనింగ్‌లో ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా మోడీ సర్కారు తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా సమ్మె చేప ట్టిన బొగ్గు గని కార్మికులను ఓ ప్రకటనలో అభినందించింది. దేశప్రయోజనాలను కాపాడే విషయంలో కార్మిక లోకం ముందుంటుందన్న విషయాన్ని ఈ సమ్మెతో కార్మికులు మరోసారి నిరూపించారన్నారని పేర్కొన్నది. కేంద్రం, ప్రధాని మోడీకి కార్పొరేట్‌, ప్రయివేటు వ్యక్తుల ప్రయోజనాల ముఖ్య మన్న విషయం మరోసారి స్పష్టమైందని ఆరోపించింది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే దేశభక్తి భావనను బీజేపీ వాడుకుంటున్నదనీ.. కార్మికులు మాత్రం ఈ సమ్మెతో నిజ మైన దేశభక్తిని చాటారని సీఐటీయూ పేర్కొన్నది. సమ్మెకు వెళ్తామని కార్మికులు ముందుగానే నోటీసు ఇచ్చినప్పటికీ కేంద్రం దానిని పెడచెవిన పెట్టి నోటిఫికేషన్‌ను జారీ చేయ డానికి ముందుకెళ్తున్నదని ఆరోపించింది. సంఘాలకతీ తంగా కార్మిక, దేశ, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తు న్న మోడీ సర్కారు విధానాలపై కార్మికులంతా ఐక్యం కావాలని సీఐటీయూ పిలుపునిచ్చింది.

Courtesy Nava telangana…