పారిశ్రామిక ప్రాంతం నుంచి వచ్చింది కాబట్టి ఆమెకు యూనియన్లు, సమ్మెలు, పోరాటాలు చిన్నప్పటి నుంచే తెలుసు. కమ్యూనిస్టుల పురిటిగడ్డ నుంచి వచ్చింది కాబట్టి వామపక్ష భావజాలాన్ని తన బలంగా మలుచుకుంది. హక్కుల సాధన కోసం విద్యార్థి దశలోనే (ఎస్‌ఎఫ్‌ఐ తరపున) అనేక పోరాటాలు చేసింది. ఆ తెగువే ఆమెను ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక జేఎన్‌యూస్టూడెంట్‌ యూనియన్‌కు ప్రెసిడెంట్‌ను చేసింది. పదవి చేపట్టి మూడునెలలు కూడా కాకుండానే ఇటీవల జేఎన్‌యూలో జరిగిన సంఘటనతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఎర్ర నిప్పుకణికఆయిషీ ఘోష్‌ నేపథ్యం ఇది.

జేఎన్‌యూ స్ఫూర్తిని ఎవ్వరూ దెబ్బతీయలేరు. క్యాంపస్‌లో గూండాగిరీకి చోటు లేదు. ఇలాంటి దాడులకు బెదిరిపోయే వాళ్లం కాదు.

వామపక్ష భావజాలానికి కంచుకోట అయిన పశ్చిమబెంగాల్‌లోని పారిశ్రామిక ప్రాంతం దుర్గాపూర్‌ ఆయిషీ సొంతూరు. న్యూఢిల్లీలోని దౌలత్‌ రామ్‌ కాలేజీలో రాజనీతిశాస్త్రంలో డిగ్రీ చేసే రోజుల్లోనే విద్యార్థి రాజకీయాల దిశగా ఆమె తొలి అడుగులు పడ్డాయి. ఆ తరువాత జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ీ పీజీ అవగానే అంతర్జాతీయ సంబంధాల మీద ఆసక్తితో ఎం.ఫిల్‌లో అదే సబ్జెక్టు ఎంచుకున్నారు. ఎం.ఫిల్‌ అయ్యాక అక్కడే పీహెచ్‌డీలో చేరారు.

విద్యార్థి నేత అయ్యారిలా…
జేఎన్‌యూ క్యాంపస్‌కు చేరిన తరువాత విద్యార్థి రాజకీయాల్లో మరింత చురుగ్గా పాల్గొనడం మొదలెట్టారు ఆయిషీ. ఈ క్రమంలోనే లెఫ్ట్‌వింగ్‌ స్టూడెంట్‌ ఆర్గనైజేషన్‌ అయిన ‘స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ (ఎస్‌ఎఫ్‌ఐ)లో చేరారు. సొంత రాష్ట్రంలో ఉన్నన్నాళ్లు ఏ పోరాటంలోనూ పాల్గొనని ఆయిషీ జేఎన్‌యూలో ఉద్యమ గొంతుకగా ఎదిగారు. పోరాట స్వభావానికి తోడు విషయపరిజ్ఞానం, తూటాల్లాంటి మాటలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ప్రసంగాలు తోటి విద్యార్థుల్లో ఆలోచనబీజాలను నాటడమే కాదు… పోరాటస్ఫూర్తిని కూడా నింపేవి. ఈ నాయకత్వ లక్షణాలే ఆమెను దేశంలోనే అత్యున్నత విశ్వవిద్యాలయానికి విద్యార్థి నాయకురాలిని చేశాయి.

13 ఏళ్ల్ల తరువాత జేఎన్‌యూ స్టూడెంట్స్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా ఎస్‌ఎఫ్‌ఐ జయకేతనం ఎగురవేయడంలో ఆయిషీ కీలకంగా వ్యవహరించారు. ప్రెసిడెంట్‌ అయ్యాక క్యాంపస్‌ సమస్యల మీద దృష్ట పెట్టారు. హాస్టల్‌ ఫీజు తగ్గించాలని, ఆ తరువాతే రెండో సెమిస్టర్‌ రిజిస్ట్రేషన్‌ నిర్వహించాలని విద్యార్థులకు మద్దతుగా పోరాటానికి దిగారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కూడా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో క్యాంపస్‌లో నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారామె. ఈ క్రమంలోనే ఆమె ఉంటున్న జెఎన్‌యూలోని సబర్మతీ హాస్టల్‌లోకి జనవరి 5న కొందరు ఆగంతుకుల చొరబడి కర్రలతో దాడిచేసి ఆమెతో సహా దాదాపు 36మందిని గాయపరిచారు.

జేఎన్‌యూ స్ఫూర్తిని దెబ్బతీయలేరు…
‘‘జేఎన్‌యూ స్ఫూర్తిని ఎవ్వరూ దెబ్బతీయలేరు. క్యాంపస్‌లో ఈ 50 ఏళ్లలో విద్యార్థులపై దాడులు జరిగిన సంఘటన ఒక్కటి కూడా లేదు. ఇక్కడ గూండాగిరీకి చోటు లేదు. ఇలాంటి దాడులకు బెదిరిపోయే వాళ్లంకాదు. ప్రజాస్వామ్యయుతంగా మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. నేను ఎలాంటి హింసాత్మక ఘటనలో భాగం కాలేదు. పోలీసులు నా మీద చర్యలు తీసుకునే ముందు అందుకు తగిన ఆధారాలు చూపించాలి’’ అని దాడి అనంతరం ఆయిషీ మీడియాతో అన్నారు. తనపై భౌతికంగా జరిగిన దాడికి ఆమె ఏమాత్రం వెరవలేదు. పైగా ఆమె ఆలోచనలు మరింత దృఢంగా మారాయి. ఆయిషీ కుటుంబ సభ్యులకు, ఆమెను దగ్గర నుంచి చూసిన వాళ్లకు ఆమె పట్టుదల, పోరాటతత్వం బాగా తెలుసు. ‘‘ఆయిషీ చాలా ధైర్యవంతురాలు. దాడిలో గాయపడినా కూడా న్యాయం కోసం పోరాటాన్ని కొనసాగిస్తుందని నేను కచ్చితంగా చెప్పగలను. ఈ దాడితో ఆమె మరింత దృఢంగా అవుతుంది. నా మనవరాలి గురించి నేను అస్సలు భయపడడం లేదు’’ అంటున్నారు ఆయిషీ అమ్మమ్మ శాంతీ సిన్హా.
ఆయిషీ నాన్న దేబషిశ్‌ ఘోష్‌ దుర్గాపూర్‌లోని ‘దామోదర్‌ వ్యాలీ కార్పోరేషన్‌’ (డివీసీ)లో ఉద్యోగి. అక్కడి కార్మిక సంఘంలో సభ్యుడు కూడా. తన కూతురుపై జరిగిన దాడి గురించి జర్నలిస్టుల ద్వారా తెలుసుకున్న ఆయన ‘‘నా కూతురి గురించి నేను ఆందోళన చెందడం లేదు. ఆమె ఒక ఫైటర్‌. ఆమె పోరాడుతున్న అంశం సరైనది. ఆమె పోరాటపంథా శాంతియుతమైనది. తనపై దాడి చేసినంత మాత్రాన ఆమె ఆగిపోదు’’ అన్నారు. ఈ మాటలు ఆయిషీపై ఆయనకున్న నమ్మకానికి అద్దంపడతాయి. దేశ రాజధానిలో ఆయిషీ చేస్తున్న పోరాటానికి రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. ఆమె పోరాటపటిమకు దన్నుగా నిలిచేందుకు ఎంతోమంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ముందుకు వస్తున్నారు. తమ సంఘీభావాన్ని తెలుపుతున్నారు. ఆయిషీ మాత్రం గాయాలతోనే తిరిగి కదనరంగంలోకి దూకి, నమ్మిన సిద్ధాంతాల కోసం నినాదాల బావుటా ఎగురవేస్తూనే ఉన్నారు.
పోరాటానికి మద్దతుగా…
జేఎన్‌యూ క్యాంపస్‌లో దుండగుల దాడిలో గాయపడిన ఆయిషీ ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షించారు. రాజకీయ ప్రముఖులు, బాలీవుడ్‌ నటీనటులు ఆమెను పరామర్శించి సంఘీభావం తెలియజేస్తున్నారు. సీపీఐ జాతీయ నాయకుడు సీతారాం ఏచూరి, బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌, తాప్సీ పన్నూ, దీపికా పదుకొనేలు ఇప్పటికే ఆమెను కలిశారు. పలువురు ట్వీట్ల ద్వారా ఆమె పోరాటానికి జేజేలు పలుకుతున్నారు. జేఎన్‌యూ విద్యార్థుల మీద దాడిచేసిన వారు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని టెక్‌ దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు.

(Courtesy Andhrajyothi)