దేవీందర్‌ శర్మ 

దేశంలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సన్నకారు రైతులు గరిష్టంగా చేసిన రెండు లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేస్తున్నందుకే మన ఆర్థికవేత్తలు, ఆర్థికరంగ సమర్థకులు ద్రవ్యలోటు చుక్కలంటుతుందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. కానీ మన బ్యాంకులు లక్షల కోట్ల మేరకు కార్పొరేట్‌ రుణాలను అలవోకగా మాఫీ చేసినప్పుడు వీరికి ద్రవ్యలోటు ప్రమాదం గుర్తుకురావడం లేదు. వ్యవసాయరంగ దుస్థితిని పట్టించుకోని మన విధాన నిర్ణేతలు ఒకటి, రెండు నెలలు కార్లు, ఆటోమైబైల్స్‌ అమ్మకాలు పడిపోయి, పరిశ్రమలు కొన్ని వేల ఉద్యోగాలకు కోతపెట్టగానే కొంపలంటుకుపోయినట్లు గావుకేకలు పెడుతున్నారు. వ్యవసాయరంగం నిత్య సంక్షోభంలో కూరుకుపోయినంతకాలం మన ఆర్థిక వ్యవస్థ కూడా నిత్య అనిశ్చిత పరిస్థితుల్లోనే కొనసాగుతుంది. దేశీయ డిమాండ్‌ పెరగాలంటే వ్యవసాయరంగంలో భారీ పెట్టుబడులు పెట్టాలి.

కెఫే కాఫీ డే వ్యవస్థాపకుడు వీఎమ్‌ సిద్ధార్థ తన జీవితాన్ని ముగించుకుంటున్నట్లు ప్రకటించి ఆత్మహత్య చేసుకున్న కొద్ది రోజుల తర్వాత అయిదు మంది రైతులు మహారాష్ట్రలోని అకోలా జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో పురుగుమందు సేవించి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తమ భూమికి సత్వరం పరిహారం అందించాలన్నది వారి డిమాండు. సరిగ్గా అదేసమయంలో, హరియాణాలో నాలుగు నెలలుగా ధర్నా చేస్తున్న మరొక రైతు మరణించాడు. ఆ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తన భూమికి అధిక పరిహారం ఇవ్వాలని ఆ రైతు నిరసన తెలుపుతూ చనిపోయాడు. ఈ రైతుల మరణం, లేదా ఆత్మహత్యా ప్రయత్నం ప్రపంచం దృష్టికి రాలేదు కానీ కాఫీ కింగ్‌ విషాదమరణానికి దారితీసిన పరిస్థితుల గురించి పరిశ్రమవర్గాలు పెట్టిన గగ్గోలుకు మీడియా విపరీత ప్రచారం కల్పించింది. మన పారిశ్రామిక అధిపతుల్లో చాలామంది సిద్ధార్థ మృతిని పన్నుల రూపంలోని ఉగ్రవాదంతో ముడిపెట్టారు. తమకు మరిన్ని పెట్టుబడులు, పన్నురాయితీలు ఇవ్వాలని, పన్నుల బారి నుంచి స్వాతంత్య్రం కల్పించాలని పరిశ్రమవర్గాలు డిమాండు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కెఫే కాఫీ డే యజమాని దాదాపు రూ.11,000 కోట్ల భారీ రుణ ఊబిలో చిక్కుకుపోయారన్న విషయాన్ని విస్మరించి, పరిశ్రమ వర్గాల మనోభావాలను ప్రతిధ్వనింపచేయడంలో బిజినెస్‌ జర్నలిస్టులు మునిగిపోయారు.

ఆర్థిక మందగమనంలో తాము నిలదొక్కుకోవడానికి ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీతోపాటు మరిన్ని రాయితీలను కల్పించాలని పరిశ్రమ వర్గాలు సహేతుకమైన ఆర్థిక కారణాలను చూపించవచ్చు. కానీ వ్యవసాయరంగంలో మృత్యుదేవత ప్రళయతాండవం గురించి ఎవరికీ పట్టింపు లేదు. రైతుల ఆత్మహత్యలపై మీడియా కనీసంగా ప్రస్తావించటం లేదు. ఒక వ్యాపారవేత్తగా సిద్ధార్థకు కష్టకాలంలో తగిన మద్దతు అవసరం కావచ్చు. అయితే రైతులు కూడా తమరంగంలో పారిశ్రామికులుగానే కార్యకలాపాలు సాగిస్తున్న వాస్తవాన్ని ఎవరూ గుర్తించడం లేదు. అందుకే మన దేశ రైతులు తమ కష్టాలను వ్యక్తిగతంగానే ఎదుర్కొంటూ నష్టపోతున్నారు. తమ నష్టాలకు తగిన పరిహారం లభించే హక్కును సకాలంలో పొందగలిగినట్లయితే, దేశీయరైతులు కూడా తమ వ్యవసాయ రంగ వ్యాపార సామర్థ్యాన్ని నిరూపించుకోగలరు. కానీ అలాంటి అవకాశాన్నే తోసిపుచ్చడం అంటే ఆ అవకాశాన్ని రైతులు కోల్పోవడమనే అర్థం.

ప్రతి ఏటా మన పరిశ్రమ వర్గాలు రూ.1.8 లక్షల కోట్ల మేరకు ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని పొందుతూనే ఉన్నాయి. 2008–09లో ప్రపంచ ఆర్థికరంగం కుప్పగూలినప్పటినుంచి జాతీయ బ్యాంకులు పరిశ్రమకు 17 లక్షల కోట్ల రూపాయల భారీ రుణాలను అందించాయి. దీనిలో రూ.10 లక్షల కోట్లు నిరర్థక ఆస్తులుగా మిగిలిపోయాయి. మన పారిశ్రామిక రంగం గత 10 సంవత్సరాల్లో ఆర్థిక ప్యాకేజీ కింద రు. 18 లక్షల కోట్లను అందుకుంది. కానీ ఇప్పటికీ పారిశ్రామిక రంగం తీవ్రమైన సంక్షోభంలో కొనసాగుతోంది. పైగా, 2007 నుంచి 2019 వరకు గత 12 ఏళ్లలో బ్యాంకులు దాదాపు రూ. 8.36 లక్షల కోట్ల మొండిబకాయిలను రద్దు చేసినట్లు ఆర్బీఐ నివేదికను మీడియా ప్రస్తావిస్తుంది. పరిశ్రమ, వస్తూత్పత్తి రంగం, ఎగుమతుల రంగం పనితీరు దిగజారిపోవడానికి ఆర్థిక మందగమనమే కారణమా లేక బ్యాంకులు భారీస్థాయిలో దివాలా ఎత్తడమే అసలు కారణమా అని తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైంది.

దేశీయబ్యాంకులు 2007–2016 మధ్యకాలంలో మొత్తం రూ. 2.88 లక్షల కోట్ల మేరకు మొండిబకాయిలను రద్దు చేశాయి. అయితే 2016–17లో 1.33 లక్షల కోట్లను, 2017–18లో 1.61 లక్షల కోట్లను మాఫీ చేసిన బ్యాంకులు 2018–19 సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ. 2.54 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశాయి. బ్యాంకులు పూర్తిగా ఒట్టిపోవడానికి ప్రధాన కారణం.. ఇంత భారీ మొత్తాన్ని మూడేళ్లకాలంలోనే మాఫీ చేయడమే. కారణాలు ఏవైనా కావచ్చు.. దేశంలో ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టిన 9 వేలమంది డిఫాల్టర్ల పేర్లను బహిరంగపర్చాలని ఆర్బీఐ పట్టుపడుతోంది. మొండి బకాయిలు ఇంకా అధికంగా ఉన్నాయనడానికి ఇది నికార్సైన సంకేతం. కేంద్రప్రభుత్వం ఇప్పటికే బ్యాంకుల ప్రక్షాళన ప్రక్రియను ప్రారంభించడంపై పట్టుదలతో ఉంటున్నప్పటికీ, రుణం చెల్లింపు అశక్తత,  దివాలా కోడ్‌ (ఐబీసీ)ని 2016లో ప్రవేశపెట్టింది. మొండిబకాయిల ఉపద్రవాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ప్రదర్శిస్తున్న బలమైన వైఖరికి ఇది నిదర్శనం. ప్రతిసంవత్సరం పరిశ్రమవర్గాలు భారీ పన్ను రాయితీలను అందుకుంటున్న సమయంలో పన్నుల అధికారులు తమ తలుపు తడితే మాత్రం పరిశ్రమవర్గాలు విలపించడం సమర్థనీయం కాదు.

మన వ్యవస్థ రైతుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నదో ఇప్పుడు మనం పరిశ్రమల రంగంతో పోల్చి చూద్దాం. బ్యాంకులకు రుణాలను చెల్లించలేకపోయారన్న కారణంతో పలు సంవత్సరాలుగా దేశంలో వందలాది మంది రైతులను బహిరంగంగా అవమానాల పాలు చేశారు. జైళ్లలో పెట్టారు. పరిశ్రమల రంగానికి లక్షలాది కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తుండగా, ఒక్కటంటే ఒక్క నెల బకాయిని చెల్లించలేకపోయిన రైతులను జైళ్లలోకి నెడుతున్నారు. అలాంటి రైతుల స్థిరాస్తి, చరాస్తిని బ్యాంకు  తక్షణం స్వాధీనం చేసుకోవడమే కాదు.. రైతులు తాము చెల్లించాల్సిన అసలు మొత్తాన్ని చెల్లించలేని సందర్భాల్లో, వారికి రుణాన్ని మంజూరు చేసే సమయంలో రైతులనుంచి తీసుకున్న సంతకం చేసిన ఖాళీ చెక్కును బ్యాంకు తానే డిపాజిట్‌ చేసి, అవి చెల్లనప్పుడు ఈ సివిల్‌ కేసును క్రిమినల్‌ కేసుగా మార్చి వేధిస్తున్నాయి. తర్వాత అలాంటి రైతులను జైలుకు పంపుతున్నారు. తాము తీసుకున్న రుణాన్ని అసలు, వడ్డీతో సహా తీర్చివేయాలని కోర్టులు రైతులను ఆదేశిస్తున్నాయి కూడా.

వాస్తవానికి ఈ దేశంలో క్రమం తప్పకుండా నెలవారీ రుణ చెల్లింపులను చేయగలుగుతున్నది రైతులు మాత్రమే కాగా,  ఇలాంటి వారిపైనా డిఫాల్టర్లుగా ఎందుకు ముద్ర వేస్తున్నారో నాకు అసలు అర్థంకాదు. దేశంలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సన్నకారు రైతులు గరిష్టంగా చేసిన రెండు లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేస్తున్నందుకే మన ఆర్థికవేత్తలు, ఆర్థికరంగ సమర్థకులు ఈ రుణమాఫీతో ద్రవ్యలోటు ఆకాశానికి అంటుతుందంటూ గావుకేకలు పెడుతున్నారు. కానీ ఇదే బ్యాంకులు లక్షల కోట్ల మేరకు కార్పొరేట్‌ రుణాలను అలవోకగా మాఫీ చేసినప్పుడు ఇదే ఆర్థికవేత్తలకు ద్రవ్యలోటు ప్రమాదం అసలు గుర్తుకురావడం లేదు.
అనేక సంవత్సరాలుగా భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంతో ఉందని పలు ప్రగతి సూచికలు తెలుపుతూనే ఉన్నాయి. వ్యవసాయరంగ రాబడులు గత 15 ఏళ్లలో అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. చివరకు గ్రామీణ రంగ ఉపాధి కూడా ఘోరంగా దెబ్బతిందని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. వీటి ప్రకారం 2011–2018 మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతంలో 3.2 కోట్లమంది రోజుకూలీలు పని కోల్పోయారు. వీరిలో 3 కోట్లమంది వ్యవసాయరంగ కార్మికులున్నారు.

కానీ అతిపెద్ద విషాదమేమిటంటే, ముంచుకొస్తున్న వ్యవసాయరంగ దుస్థితి గురించిన తీవ్ర హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోని మన విధాన నిర్ణేతలు ఒకటి, రెండు నెలలు కార్లు, ఆటోమొబైల్స్‌ అమ్మకాలు పడిపోయి పారిశ్రామికరంగంలో కొన్ని వేల ఉద్యోగాలకు కోతపెట్టగానే గావుకేకలు పెడుతున్నారు. వ్యవసాయరంగం నిరంతర సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నంతవరకు మన ఆర్థిక వ్యవస్థ కూడా అనిశ్చిత పరిస్థితుల్లోనే కొనసాగుతుంది. వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ వినియోగం పెరుగుదలపైనే ఆధారపడుతుంది. వినియోగం అనేది ఎంత డిమాండును సృష్టిస్తాం అన్న అంశంపై ఆధారపడుతుంది. దేశీయ డిమాండును పెంచడంలో గ్రామీణ రంగమే అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తోందన్నది అందరూ అర్థం చేసుకోవాలి. దీనికి రాబోయే సంవత్సరాల్లో వ్యవసాయరంగంలో మరిన్ని పెట్టుబడులు అవసరం అవుతాయి. అంటే పరిశ్రమలను మరింతగా ప్రైవేటీకరించడం, మరిన్ని ఉద్దీపన ప్యాకేజీలను ఇవ్వడం నుంచి ప్రభుత్వం తన దృష్టిని వ్యవసాయరంగం వైపు మళ్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.దేశీయ శ్రామికశక్తిలో దాదాపు 50 శాతాన్ని కలిగి ఉన్న వ్యవసాయరంగానికి ప్రభుత్వ మదుపులకు సంబంధించి జీడీపీలో అర్ధ శాతం కంటే తక్కువ కేటాయించడమే మన రైతుల దుస్థితికి అసలు కారణం. కోట్లాది మందికి బతుకునివ్వగల వ్యవసాయ రంగానికి మరింతగా పెట్టుబడులను కేటాయించడం, ఈ క్రమంలో మరింత దేశీయ డిమాండును సృష్టించడమే దీనికి పరిష్కారం.

 

 

 

 

వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు

(Courtacy Sakshi)