క్షీణిస్తున్న వ్యవసాయ వృద్ధిరేటు
గతేడాదిలో 2.8 శాతంగా నమోదు
మొత్తం ఆర్థిక వ్యవస్థలో 16.5 శాతం వాటా
మోడీ పాలనలో క్రమంగా కిందికి : ఆర్థిక సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ : వ్యవసాయాధారిత దేశమైన భారత్‌లో వ్యవసాయం, దాని అనుబంధరంగాల వృద్ధిరేటు క్రమంగా క్షీణిస్తున్నది. గడిచిన ఆరేండ్లలో ఇది మరింత కిందికి దిగజారింది. తాము అధికారంలోకి వస్తే దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామనీ, మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చిన మోడీ సర్కారు.. ఈ ఆరేండ్లలో వ్యవసాయ వృద్ధిరేటును నేలకు దించుతున్నదే తప్ప కర్షకులను ఆదుకోవడంలో దారుణంగా విఫలమవుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేగాక కార్పొరేట్‌ అనుకూల విధానాలతో రైతుల నడ్డి విరిచే ప్రయత్నాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నదని స్వయంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వే ద్వారా తెలుస్తున్నది. 2016-17లో 6.3 శాతంగా ఉన్న వ్యవసాయ వృద్ధిరేటు గతేడాదికి వచ్చేసరికి 2.8 శాతానికి పడిపోయింది. అంతేగాక దేశం మొత్తం ఆర్థికవ్యవస్థలో వ్యవసాయ రంగం వాటా కూడా 16.5 శాతానికి క్షీణించింది. కాగా, రైతులను గురించి మాట్లాడిన ప్రతిసారి మోడీతో పాటు బీజేపీ అనుచరగణమంతా 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఓవైపు ప్రచారం చేస్తుండగా…

వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని కేంద్రం విడుదల చేసిన గణాంకాలే వెల్లడిస్తున్నాయి. 2016-17లో 6.3 శాతం ఉన్న వ్యవసాయ వృద్ధిరేటు.. తర్వాతి ఏడాదిలో 5 శాతానికి పడిపోయింది. ఇది 2018-19కి వచ్చే నాటికి ఇది 2.9 శాతానికి దిగజారింది. ఇక గతేడాదిలో మరింత కిందకు పడిపోయింది.

అంతేగాక దేశం మొత్తం ఆర్థిక వ్యవస్థలోనూ వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా నానాటికీ తక్కువౌవుతున్నది. మోడీ అధికారం చేపట్టేనాటికి ఇది 18.2 శాతంగా ఉంది. తర్వాతి ఏడాదుల్లో వరుసగా.. 17.7 శాతం, 17.9 శాతం, 16.1 శాతం నమోదైంది. ఇది 2018-19కి గానూ 16.5 శాతానికి చేరింది. కాగా, భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థిక పరివర్తన అనేది వ్యవసాయ, దాని అనుబంధ రంగాల ప్రదర్శనపై ఆధారపడి ఉంటుందని ఆర్థిక సర్వే తెలిపింది.

ఆర్థిక వ్యవస్థలో ఈ రంగం ప్రధాన పాత్ర పోషిస్తుందనీ, గ్రామీణప్రాంతాల్లోని లక్షలాది కుటుంబాలకు ఉపాధిని కల్పించడంలో ఇదే కీలకమని నొక్కి చెప్పింది. సర్వే ప్రకారం.. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ 70 శాతానికి పైగా వ్యవసాయరంగం మీదే ఆధారపడి జీవిస్తున్నారనీ, వీరిలో 82 శాతం మంది చిన్న, సన్నకారు రైతులున్నారని పేర్కొనడం గమనార్హం. అయితే ఆర్థిక సర్వే గణాంకాల ప్రకారం చూస్తే మోడీ సర్కారు ప్రజలకు హామీనిచ్చిన ‘రెట్టింపు ఆదాయం’ అనేది అందని ద్రాక్ష వంటిదేనని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. రైతులకు కనీస అవసరాలైన నీళ్లు, కరెంటు, విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లను అందించకుండా.. వారు పండించిన పంటకు మార్కెట్‌లో మద్దతు ధర కల్పించకుండా రైతుల ఆదాయం రెట్టింపు చేయడం సాధ్యపడదని వారు స్పష్టం చేస్తున్నారు.

Courtesy Nava Telangana