ప్రభాత్‌ పట్నాయక్‌
ప్రభాత్‌ పట్నాయక్‌

గత వారం పార్లమెంటులో ఆమోదింపజేసుకున్న వ్యవసాయ బిల్లులు ఏ విధంగా చూసినా అభ్యంతరకరమే. సభ్యులు రాజ్యసభలో వోటింగ్‌ కోరినా నిరాకరించి బలవంతంగా ఆమోదింపజేసుకున్న తీరు అత్యంత అప్రజాస్వామికం. రాజ్యాంగం లోని 7వ షెడ్యూలు ప్రకారం వ్యవసాయం రాష్ట్రాల పరిధి లోకి వస్తుంది. అయినప్పటికీ కేంద్రం ఏకపక్షంగా వ్యవసాయ మార్కెటింగుకు సంబంధించి మౌలికమైన మార్పులను చట్ట రూపంలో తీసుకురావడం ఫెడరలిజానికి పెద్ద దెబ్బ. స్వాతంత్య్రానికి పూర్వం రైతాంగానికి ప్రభుత్వం నుండి ఎటువంటి మద్దతూ ఉండేది కాదు. దాంతో వారు పూర్తిగా పెట్టుబడిదారీ మార్కెట్‌ పైనే ఆధారపడ్డారు. 1930 దశకంలో వచ్చిన మహా మాంద్యం కాలంలో ఆ మార్కెట్‌ తాకిడికి రైతులు పూర్తిగా చితికిపోయారు. ఇప్పుడు తాజాగా చేసిన చట్టాలు మళ్ళీ రైతులను అటువంటి పరిస్థితులలోకి నెడుతున్నాయి. ఇది జాతీయోద్యమ కాలంలో రైతులకు ఇచ్చిన హామీలకు ద్రోహం చేయడమే. ఈ చట్టాలు కోట్లాది చిన్న రైతులను అతి కొద్ది మంది శక్తివంతులైన కొనుగోలుదారుల దయాదాక్షిణ్యాలకు వదిలిపెడుతున్నాయి. కొనుగోలుదారుడి గుత్తాధిపత్యపు దోపిడీకి రైతాంగం బలి కానుంది.

అయితే మోడీ మాత్రం అటువంటిదేమీ లేదని నమ్మబలుకుతున్నారు. గుత్త కొనుగోలు దారుల నుండి రైతులకు ఎటువంటి ఇబ్బందీ రాబోదని కనీస మద్దతు ధర విధానం కొనసాగు తుందని చెప్తున్నారు. కాని ఆ విషయం ఆ బిల్లుల్లో ఎక్కడా పేర్కొనలేదు. చట్టంలో మద్దతు ధరను చేర్చడానికి ప్రభుత్వం తిరస్కరించింది. స్వామినాథన్‌ కమిటీ రైతుకు కనీస మద్దతు ధర పొందే హక్కు ఉందని, పెట్టుబడికి తోడు అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధరగా ప్రకటించి అమలు చేయాలని నిర్దేశించింది. కాని మోడీ ప్రభుత్వం దానిని నిరాకరించి రైతులను మార్కెట్‌ దయాదాక్షిణ్యాలకు వదిలిపెట్టింది. ఈ విషయంలో ఆనాటి బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల మాదిరిగానే మోడీ కూడా వ్యవహరిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో ధరలు చాలా భయంకరంగా కిందా, మీదా అవుతూంటాయి. వాటి వత్తిడిని రైతులు తట్టుకోలేరు. అప్పులపాలై, దివాలా తీయడం ఖాయం. ఆ పరిస్థితి తమకు రాకూడదనే ఇప్పుడు రైతులు ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.

ఈ విషయమై జరుగుతున్న చర్చలో ఒక ముఖ్యమైన విషయం పక్కకు పోతోంది. ఈ చట్టాల వలన రైతాంగానికి వాటిల్లనున్న కష్ట, నష్టాల గురించే చర్చిస్తున్నారు తప్ప దేశ ఆహార భద్రత గురించి ఎవరూ మాట్లాడడం లేదు. ఒకసారి దేశ ఆహార భద్రత అనగానే ఆ చర్చ సామ్రాజ్యవాదాన్ని తెర పైకి తీసుకొస్తుంది.

ఇండియా వంటి దేశాలు తమ ఆహార అవసరాల కోసం దిగుమతుల పైన ఆధారపడే పరిస్థితి ఉండాలని సామ్రాజ్య వాదం కోరుకుంటుంది. మన దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి కోసం వినియోగిస్తున్న భూమిని సామ్రాజ్యవాదులకు అవసరమైన పంటలను పండించడానికి మళ్ళించాలని చూస్తుంది. ఉష్ణ, సమశీతోష్ణ ప్రదేశాలలో మాత్రమే పండే చాలా పంటలు చలి ప్రదేశాలైన సామ్రాజ్యవాద దేశాలలో పండవు. అయితే ఇలా వేరే పంటలకు మళ్ళినందువలన ఈ ఉష్ణ, సమశీతోష్ణ దేశాలు తమ ఆహార భద్రతను కోల్పోతాయి.
భారతదేశం వంటి దేశాలకు ఆహారభద్రత అంటే ఆహారోత్పత్తిలో స్వయం సమృద్థిని సాధించడమే. దానికి బదులు దిగుమతులపై ఆహారం కోసం ఆధారపడడం ఏవిధంగా చూసినా సరైన విధానం కాజాలదు. ఇంత హెచ్చు జనాభా ఉన్న మన దేశం ఆహారధాన్యాల దిగుమతి కోసం ప్రపంచ మార్కెట్‌ లోకి అడుగు పెడితే ఆహార ధాన్యాల ధరలు అమాంతం ఎగబాకుతాయి. మనం దిగుమతుల కోసం చాలా ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుంది. ఆ మోతాదులో దిగుమతులు చేసుకుంటే చెల్లించడానికి మన వద్ద చాలినంత విదేశీ మారక ద్రవ్యం ఉండకపోయే ప్రమాదం ఉంది. ఏదో ఒక విధంగా దిగుమతి చేసుకున్నా ఆ ధర చెల్లించి కొనగలిగే స్థోమత మన ప్రజలకు ఉండదు. అదనపు ఆహారధాన్యాల నిల్వలు సామ్రాజ్యవాద దేశాల దగ్గరే ఉంటాయి. కనుక అధిక ధరకైనా సరే మనం కొనుక్కోవాలంటే ఆ సామ్రాజ్యవాదుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసి వస్తుంది. నిజానికి తమకు అనుగుణంగా వ్యవహరించేలా లొంగదీసుకోవడం కోసం ఆహార కొరతను ఒక శక్తివంతమైన ఆయుధంగా సామ్రాజ్యవాద దేశాలు ఉపయోగిస్తాయి.

ఇదేమీ ఊహించి చెప్తున్న విషయం కాదు. 1965-66, 1966-67 సంవత్సరాల్లో మన దేశంలో చాలా పెద్ద ఎత్తున పంటనష్టం జరిగింది. ప్రత్యేకించి బీహార్‌ లో తీవ్రమైన కరువు ఏర్పడింది. దీంతో మన దేశం ఒక బిచ్చగాడి మాదిరి అమెరికా ముందు బొచ్చె పట్టుకుని నిలబడాల్సి వచ్చింది. అప్పుడు దిగుమతి చేసుకున్న (పిఎల్‌-480 ధాన్యాలు) తిండిగింజలను ఆ నౌకల వద్దే ప్రజలకు పంపిణీ చేయాల్సినంత కాటకం వచ్చిపడింది. అప్పటి ఆహార మంత్రి జగజ్జీవన్‌రామ్‌ను ప్రధాని ఇందిరా గాంధీ ఆహారం విషయంలో స్వయంసమృద్ధి సాధించే లక్ష్యంతో పని చేయాలని కోరారు. అప్పుడే హరిత విప్లవం మొదలైంది. ఇప్పటికీ మనం ఇంకా అందరికీ సమృద్ధిగా తిండి అందించగలిగేంత స్థాయికి ఎదగలేదు కాని తిండి కోసం దిగుమతులపై ఆధారపడే స్థితిలో మాత్రం లేము. ప్రజల కొనుగోలుశక్తి దారుణంగా హరించుకు పోతూండడంతో ప్రపంచంలోనే అత్యంత ఆకలిగొన్న జనం ఉన్న దేశంగా నేడు మనం ఉన్నాం. కాని అదే సమయంలో రెగ్యులర్‌గా, పెద్ద మోతాదులో ఆహార ధాన్యాలను ఎగుమతి చేస్తున్న దేశంగా కూడా ఉన్నాం.
అదే ఆఫ్రికా దేశాలను చూడండి. సామ్రాజ్యవాదుల బుజ్జగింపులకు లోబడి తమ దేశాల్లో ఎగుమతులకోసం ఎక్కువ భూభాగాన్ని మళ్ళించారు. ఈ రోజు దాని పర్యవసానాలను అనుభవిస్తున్నారు. అక్కడ పదే పదే సంభవించే కరువుకాటకాలు, ప్రజల ఆకలిబాధలు అందరికీ తెలిసినవే.

మన దేశంలో 1966-67 అనుభవాల తర్వాత కనీస మద్దతు ధర, సేకరణ ధర, పంపిణీ ధర, మార్కెట్‌లో ధాన్యం సేకరణ విధానం, ప్రజా పంపిణీ వ్యవస్థ, సబ్సిడీలు వంటి అంశాలతో ఒక విస్తృతమైన విధానం రూపొందింది. అటు ఉత్పత్తిదారుల (రైతుల) ప్రయోజనాలు, ఇటు వినియోగదారుల (ప్రజల) ప్రయోజనాలు రెండింటినీ సర్దు బాటు చేయడమే గాక, ఆహార ధాన్యాల విషయంలో ఎటు వంటి దిగుమతుల అవసరమూ లేకుండా చేయగలిగారు. ఈ మొత్తం ఏర్పాటు నయా ఉదారవాదానికి పూర్తిగా భిన్నం. దీనివలన కార్పొరేట్ల లాభాలు రానురాను తగ్గిపోతూ వుంటాయి. 1990 దశకంలో ఎపిఎల్‌, బిపిఎల్‌ కార్డులు ప్రవేశ పెట్టడం వలన వ్యాపారుల లాభాల మార్జిన్‌ దెబ్బ తింది. అదే సమయంలో మరోసారి మనం అంతర్జాతీయ మార్కెట్‌లో బిచ్చగాడిగా నిలబడనవసరం లేకుండా చేసింది.

మనం ఏర్పరచుకొన్న ఈ వ్యవస్థను పడగొట్టాలని సామ్రాజ్యవాదం మొదటి నుండీ ప్రయత్నిస్తూనే వుంది. దోహా రౌండు చర్చల్లో కూడా అమెరికా మన ధాన్యం సేకరణ విధానాన్ని తప్పుబట్టింది. అది స్వేచ్ఛా మార్కెట్‌ సూత్రాలకే విరుద్ధం అని వాదించింది. ఆ విధానానికి స్వస్తి చెప్పాలని వత్తిడి చేసింది. ఇప్పటిదాకా మన స్వతంత్ర భారత దేశంలో ఏ ప్రభుత్వమూ ఈ తరహా వత్తిళ్ళకు భయపడి లొంగిపోలేదు. అందుకే దోహా చర్చలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. కాని మొట్టమొదటిసారి అజ్ఞానం వల్లనో భయంవల్లనో సామ్రాజ్యవాదం చెప్పినదానిని కాదనగలిగే సత్తా లేని ప్రభుత్వాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ‘వ్యవసాయ మార్కెట్ల ఆధునీకరణ’ పేరుతో, ’21వ శతాబ్దపు టెక్నాలజీ’ పేరుతో ఈ ప్రభుత్వం మనల్ని తిరిగి వలసపాలన రోజులలోకి తీసుకుపోతోంది. ఒక పక్క తలసరి ఆహారధాన్యాల లభ్యత తరిగిపోతున్నా ఇంకొక పక్క భూములను ఆహార పంటల నుండి ఇతర పంటల వైపు మళ్ళించిన విధానాలను ఆ రోజుల్లో అమలు చేశారు.మళ్ళీ అదే జరగబోతోంది. ఇది నిజానికి సామ్రాజ్యవాదుల కోసం అమలు చేస్తున్న విధానమే తప్ప ఇంకొకటి కాదు.

ఈ కొత్త వ్యవసాయ మార్కెటింగ్‌ విధానం నుండి ముందుగా లబ్ధి పొందేది అంబానీలు, అదానీలు మాత్రమే అన్నది నిజం. అయితే వాళ్ళు కాంట్రాక్టులు కుదుర్చుకునేది ఆహార ధాన్యాల కోసం కాదు. అంతకన్నా ఎక్కువగా పండ్లు, కూరగాయలు, పూలు వంటి ఉత్పత్తుల కోసం, వాటిని ఎగుమతి చేయడం కోసం. ఈ కాంట్రాక్టు వ్యవసాయ పద్ధతి ఫలితంగా ఆహారధాన్యాల కోసం వినియోగించే భూమిని ఇతర వ్యవసాయ
ఉత్పత్తుల కోసం మళ్ళించడం పెరుగుతుంది. వలసపాలన కాలంలో కూడా ఇదే జరిగింది. అంతవరకూ ఆహార పంటలను పండించే భూములను నల్లమందు, నీలిమందు వంటి పంటలను పండించేందుకు మళ్ళించారు. బెంగాల్‌ ప్రెసిడెన్సీలో ఇది ఎక్కువగా జరిగింది. ఆ తర్వాత రైతులను వ్యాపారులు ఏ విధంగా పీడించారో కళ్ళకు కట్టినట్టు ‘నీల్‌ దర్పణ్‌’ అనే నాటికలో దీనబంధు మిత్రా చూపించారు. మళ్ళీ అటువంటి దుర్భర పరిస్థితులు తమకు రాకూడదనే నేడు రైతాంగం కోరుకుంటున్నారు.

ఇంతవరకూ అమలులో ఉన్న మార్కెటింగు విధానం రైతుల ప్రయోజనాలను పూర్తిగా కాపాడలేకపోయినా, కనీసం భూ వినియోగాన్ని ఆహారధాన్యాల పంటల నుండి ఇతర పంటల వైపు మార్చలేదు. ఆ విధానాన్ని మార్చివేయడం వలన భూ వినియోగం మారిపోయి దేశ ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది.
భూమి పరిమితమైన వనరు. అందుచేత భూ వినియోగాన్ని సామాజికంగానే నియంత్రించాలి. ప్రైవేటు వ్యాపారుల లాభాపేక్ష భూవినియోగాన్ని శాసించకూడదు. అదే విధంగా, ఈ భూమి రైతుల చేతుల్లో ఉంది గనుక, ఆ రైతుల ప్రయోజనాలనూ కాపాడుకుంటూనే, భూ వినియోగాన్ని సామాజికంగా నియంత్రించాలి. ఆ విధంగా నియంత్రిస్తున్నందున రైతులకు గిట్టుబాటు ధర గ్యారంటీ చేయడం సమాజం బాధ్యత అవుతుంది. ఇందుకు ప్రస్తుత ఏర్పాటు తోడ్పడుతుంది. కాని దానినే మోడీ ప్రభుత్వం ధ్వంసం చేస్తోంది. ఇప్పుడున్న ఏర్పాటులోని లోపాలను సరిదిద్దేబదులు ఏకంగా దానిని నాశనం చేస్తోంది. అందువలన భూమి వినియోగాన్ని సామాజికంగా నియంత్రించగల శక్తిని ప్రభుత్వం కోల్పోతుంది. సామ్రాజ్య వాదం కోరుకుంటున్నది ఇదే. బిజెపి ప్రభుత్వం సామ్రాజ్యవాదాన్ని సంతృప్తిపరిచే పనిలో నిండా మునిగివుంది.
సోషలిస్టు విధానం అమలులో లేని మూడో ప్రపంచ దేశాల భూభాగంలో ఈ సామాజిక నియంత్రణ అవసరాన్ని గుర్తించి అమలు చేస్తున్న ఒకే ఒక ప్రాంతం కేరళ రాష్ట్రం. అక్కడ వరి పండించే భూములను ఇతర పంటల వైపు మరల్చ డానికి వీలు లేకుండా చట్టాన్ని చేశారు. ఇటువంటి చట్టాలు అక్కడి ప్రభుత్వపు సూక్ష్మగ్రాహ్యతను సూచిస్తే, కేంద్రం చేసిన చట్టాలు దాని బుద్ధిమాంద్యాన్ని సూచిస్తున్నాయి.

Courtesy Prajashakti