ఉత్తరప్రదేశ్‌లోని చిన్న గ్రామం నుంచి వచ్చిన ఆశాదేవి పెద్దగా చదువుకోనప్పటికీ ఇవాళ దేశంలోని తల్లులందరికీ ఆత్మస్థయిర్యాన్నిఅందిస్తున్నారు. ఏడేళ్ల క్రితం… తన కూతురు నిర్భయఢిల్లీలో దారుణ అత్యాచారానికి గురయినప్పటి నుంచీ ఆమె మానసిక వేదన అనుభవిస్తూనే ధైర్యంగా న్యాయపోరాటం చేశారు.

ఢిల్లీలోని ద్వారకాలో నివసిస్తున్న ఆమె ఇప్పుడు ఎవరు వచ్చినా మాట్లాడడానికి సంకోచించడం లేదు. మహిళల సాధికారికత కోసం ఏ సమావేశం జరిగినా ఆమె తన భర్త బద్రీనాథ్‌తో పాటు హాజరవుతారు. ప్రతి మహిళ నిర్భయంగా పోరాడాలని పిలుపునిస్తారు. నిర్భయనిందితులను కోర్టు దోషులుగా తేల్చింది. ఈ నెల 22న వారికి ఉరిశిక్ష అమలు చేయనున్నారు. ఈ నిర్ణయంపై ఆశాదేవి స్పందిస్తూ అంతిమంగా మా పోరాటానికి ఫలితం దక్కిందని దోషులకు శిక్ష పడే వరకు పోరాటాన్ని సాగించామని చెప్పారు. ఈ సందర్భంగా నవ్యతో ఆశాదేవి పంచుకున్న అభిప్రాయాలివి…

నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష ఖరారు కావడంపై మీరేమంటారు?
ఏడేళ్ల నుంచి దేని కోసమైతే మేము పోరాటం చేశామో అదే ఖరారయ్యింది. ఈ నెల 22వ తేదీన నిందితులకు ఉరిశిక్ష పడుతుండడం సంతోషకరం. ఇది మా ఒక్కరి పోరాటం కాదు… సమాజం మొత్తానిది. ‘నిర్భయ’ తరహా ఘటనలు జరిగిన వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ తీర్పు ఊరటనిస్తుంది. అంతిమంగా నా కూతురికి న్యాయం జరిగింది. ఆమె ఆత్మకు శాంతి కలుగుతుంది. మా పోరాటం సంపూర్ణమైంది. న్యాయ వ్యవస్థపై దేశ ప్రజలకు విశ్వాసం కలిగింది.
 హైదరాబాద్‌లో దిశఘటనలో నిందితుల ఎన్‌కౌంటర్‌ గురించి ఏం చెబుతారు?
హైదరాబాద్‌ పోలీసులు మంచి పని చేశారు. మాకు న్యాయం జరగడానికి ఏడేళ్లు పోరాడాల్సి వచ్చింది. కానీ ‘దిశ’ కుటుంబ సభ్యులకు ఆ అవసరం లేకుండానే నిందితులకు సరైన శిక్ష పడింది. పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసి శిక్ష నుంచి తప్పించుకోవాలని నిందితులు అనుకున్నారు. కానీ అది కుదరలేదు. ఏదేమైనా దిశకు, దిశ కుటుంబానికి న్యాయం జరిగింది.
న్యాయ పోరాటంలో మీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు..?
‘నిర్భయ’కు న్యాయం కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మాకు న్యాయ వ్యవస్థపై పెద్దగా అవగాహన లేదు. కానీ సమాజం మా వెంట నిలబడింది… అండగా నిలిచింది. దాంతో పోరాటాన్ని సాగించాం. అయితే, ఈ దేశంలో ఇంకా న్యాయం జరగని ఎంతో మంది నిర్భయలు ఉన్నారు. వారికి కూడా సత్వర న్యాయం జరగాలని ప్రార్థిస్తున్నాను.
మహిళలు, యువతులకు మీరిచ్చే సందేశం ఏంటి?
పోరాటం చాలా కష్టమైనది. ఎంతో సుదీర్ఘమైనది. ‘నిర్భయ’ కేసును బట్టి న్యాయం ఎప్పుడు జరుగుతుందో అంచనా వేయవచ్చు. కానీ పోరాటం ఎప్పుడూ విఫలం కాదు. న్యాయం తప్పకుండా జరుగుతుంది. ఆ నలుగురు దోషులను ఉరి తీస్తే దేశంలో మహిళల సాధికారత మరింత పెరుగుతుంది. యువతులు ధైర్యంగా ముందుకు సాగాలి.
సుప్రీం కోర్టులో క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేస్తామని, రాష్ట్రపతి క్షమాభిక్ష కోరుతామని దోషుల తరఫు న్యాయవాదులు అంటున్నారు కదా..?
వారికి ఇప్పటికే సమయం మించిపోయింది. వాళ్లు ఏం చేస్తారో చేసుకోనివ్వండి. మేము ఏం చేయాలో అది చేస్తాం. ఇప్పటికే ఏడేళ్లు పోరాటం చేశాం. అవసరమైతే మరి కొంత కాలం పోరాటం చేస్తాం.
నిర్భయ కేసుకు సంబంధించి ప్రభుత్వం మీకు ఎలాంటి సహకారం అందించింది?
గత ప్రభుత్వ హయాంలో ఈ ఘటన జరిగింది. అప్పటి ప్రభుత్వం మాకు కొన్ని హామీలు ఇచ్చింది. వాటిని అమలు చేసింది. కేసు విచారణలో ప్రభుత్వం ఎంతో సహకరించింది.
నిర్భయమరణాన్ని ఎలా తట్టుకోగలిగారు?
కన్న బిడ్డను కోల్పోవడం కన్నా మేము భరించని బాధ అంటూ ఏదీ లేదు. చిన్న దెబ్బ కూడా తగలకుండా నా కూతురిని కంటికి రెప్పలా చూసుకున్నాను. తనపై దారుణంగా అత్యాచారం జరిగింది. నా కళ్ల ముందే ఆమె ప్రతి రోజు మరణిస్తుండగా చూశాను. ఆనాడు నా కూతురు జీవితం కోసం చేసిన పోరాటమే నాకు జీవించాలనే ఆత్మస్థయిర్యాన్ని కలిగించింది. ఆ తర్వాత మొత్తం దేశమంతా స్పందించి నా వెనుక నిలబడింది. నేను ఒంటరిదాన్ని కాదని, ఈ సమాజం నాకు ధైర్యాన్నిచ్చింది.
ఈ రోజు మీరు ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు?
ఆ రోజు సంఘటన జరిగిన తర్వాత నా కంఠం పెగలలేదు. మీడియాతో పాటు మొత్తం ప్రపంచం నా వద్దకు వచ్చి నన్ను మాట్లాడిచ్చింది. నేను నోరు తెరవగానే మాటలు వాటంతటికవే ప్రవాహంగా వచ్చాయి. ఈ రోజు మాట్లాడడం ఏమంత కష్టం కాదు. నా చుట్టూ ఎవరున్నారనే నిమిత్తం లేకుండా ధైర్యంగా నా మసస్సులో ఉన్న భావాలను వ్యక్తం చేయగలను. నా కూతురు ఆత్మే నాతో మాట్లాడిస్తోంది. ఆ రోజుల్లో నేను ఒక ప్రశ్న వేసుకునేదాన్ని ‘తర్వాత ఏం జరుగుతుంది..?’ అని.
కానీ ప్రతి ఉదయం నాలో కొత్త ధైర్యం వచ్చింది. పోరాడాలనే సంకల్పం పెరిగింది. ఇంత దారుణం జరిగిన తర్వాత నేనెందుకు మౌనంగా ఉండాలని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నా కూతురు తప్పు లేకుండా తను ప్రాణాలు కోల్పోయింది. మేము మా కూతురిని చదివించడం ద్వారా ఈ సమాజానికి మంచి పౌరురాలిని అందించేందుకు ప్రయత్నించాం. మా తప్పు లేకుండా కూడా ఆ ఘోర ఘటన జరిగింది. అందుకే జరిగింది ఏమీ దాచుకోలేదు. తీవ్రమైన మానసిక వేదన అనుభవిస్తూనే మేము పోరాడాం. అందుకే ఈ రోజు నేను మీ ముందు నిలబడి ఇలా మాట్లాడగలుగుతున్నాను.
మంద రవిందర్‌ రెడ్డి, న్యూఢిల్లీ

(Courtesy Andhrajyothi)