నెలరోజుల్లో ఐదుగురు మృతి
కొమురంభీం జిల్లాలో కిక్కిరిసిపోతున్న ఆస్పత్రులు
ఆసిఫాబాద్‌ పీహెచ్‌సీలో రోజుకు 600మందికి ఓపీ
వణికిస్తున్న డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌
నవతెలంగాణ-కాగజ్‌నగర్‌ రూరల్‌/కౌటాల
విషజ్వరాల కౌగిట చిక్కుకుని కుమురంభీం జిల్లా విలవిల్లాడుతోంది. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌ లాంటి జ్వరాలతో జనం అల్లాడుతున్నారు. నెల రోజుల్లోనే ఐదుగురు ప్రాణం కోల్పోయారు. వేలాది మంది మంచం పట్టారు. ఆస్పత్రులన్నీ కిక్కిరిసిపోతుండగా ఆసిఫాబాద్‌ పీహెచ్‌సీలో రోజుకు 600మంది వరకు ఓపీ చూస్తున్నారు. ఇక పలుచోట్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల్లేక కాగజ్‌నగర్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌లోని ప్రయివేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు.
ఇటీవల భారీ వర్షాలకుతోడు అడపాదడపా పడుతున్న ముసురుతో అటవీపల్లెలు మురుగుమయం అయ్యాయి. ఎక్కడ చూసినా బురదరోడ్లు, నీటినిల్వలు, కలుషిత నీటి కారణంగా దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. రెండు నెలలకాలంగా మొదలైన జ్వరాల తీవ్రత వారం పదిరోజులుగా మరింత పెరిగింది. ఆసిఫాబాద్‌ పీహెచ్‌సీకి రోజుకు 600 మంది వరకు ఓపీ కోసం వస్తుండటం జిల్లాలోని పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో ‘నవతెలంగాణ’ కౌటాల మండలంలోని తాటినగర్‌ను సందర్శించింది. ‘పైసల్లేక ప్రయివేటు దవాఖాన్లకు పోలేదు. వారంసంది ఏ పనీ చేయలేకపోతున్న. జ్వరంతో తిండి కూడా సక్కగా తినడం లేదు. ఊళ్లే సర్పంచ్‌ ఇంట్లనే బాగా లేదు. ఆయనా ఏం చేయలేకపోతున్నాడు. డాక్టర్లొచ్చి పరీక్షలు చేయాలే. మందులు ఇయ్యాలే. లేకపోతే సచ్చిపోయేటట్టు ఉన్నాం’ అంటూ కొట్రంగి వెంకటి ఆవేదన వ్యక్తం చేశాడు. 1500జనాభా ఉన్న తాటినగర్‌లో ఇంటికి ఇద్దరు, ముగ్గురు చొప్పున మంచం పట్టారు. సర్పంచ్‌ సోమయ్య భార్య పరిస్థితి విషమించడంతో కాగజ్‌నగర్‌ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్చారు. ‘పెద్ద దావఖాన్ల పైసలు పెట్టలేక గీన్నే ఆర్‌ఎంపీ సారు దగ్గర గోలీలు కొంటున్నం’ అంటూ జ్వరంతో బాధపడుతున్న సాయికిరణ్‌, వెంకటి, ఆదె సుమలత, పోశకల, నక్క సంజీవ్‌, దేవమ్మ, చిన్నక్క అన్నారు. ఇలా ఎవరిని కదిలించినా ఇదే మాట చెబుతున్నారు. ఇది ఒక్క తాటినగర్‌లోనే కాదు.. మారుమూల బెజ్జూర్‌, సిర్పూర్‌టీ, ఈజ్‌గాం, కౌటాల, కెరమెరిలాంటి మండలాల్లోనూ ఇదే పరిస్థితి. ఇప్పటికే మలేరియా, విషజ్వరాలతో నెల రోజుల్లోనే ఐదుగురు మృతిచెందారు. పరిస్థితి చేదాటిపోతున్నా.. ఎక్కడా ప్రభుత్వం వైద్యశిబిరాలు ఏర్పాటు చేయలేదు. కౌటాల పీహెచ్‌సీ సిబ్బంది గురువారం తాటినగర్‌ గ్రామంలో పలువురికి రక్తపరీక్షలు చేయగా.. అందులో 10మంది మలేరియా, 45మంది టైఫాయిడ్‌ ఉన్నట్టు గుర్తించడం జిల్లా పరిస్థితిని తెలియజేస్తోంది.
వైద్యుల్లేక ప్రయివేటుకు..
కాగజ్‌నగర్‌ పట్టణ పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉద యం మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. దాంతో రోగు లు ప్రయివేటు ఆస్పత్రులకు పోతున్నారు. ఈజ్‌గాం ప్రాథమి క ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు ఉన్నా సుదూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో అక్కడా సరైన వైద్యం అందడం లేదు. సర్‌సిల్క్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో వైద్యుడు లేడు. నర్సులే రోగులకు మాత్రలు ఇచ్చి సరిపెడుతున్నారు. మారుమూల మండలాలు, బెజ్జూర్‌, సిర్పూర్‌(టి) కేంద్రాల్లో ఒక్కొక్కరే వైద్యులు ఉన్నారు. ఆ మండలాల పరిధిలో రోజుకు ఒక్కో కేంద్రానికి 100మంది వరకు ఓపీ కోసం వస్తున్నారు. పెంచికల్‌పేట వైదుడికి ఆసిఫాబాద్‌ పీహెచ్‌సీలో అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఆ మండలంలో వైద్యం అందడం లేదు. వాంకిడి కేంద్రంలో నలుగురు వైద్యులకు ఒక్కరే సేవలందిస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం : కుమురంబాలు, డీఎంఅండ్‌హెచ్‌వో
గ్రామాల్లో వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంటాం. జ్వరపీడితులు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తాం. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. అన్ని పీహెచ్‌సీల్లో మందులు అందుబాటులో ఉన్నాయి. లేనివాటిని గుర్తించి తక్షణమే పంపిణీ చేస్తాం.
మెరుగైన వైద్యం అందక..
కుమురంభీం జిల్లా కౌటాల మండల కేంద్రానికి చెందిన మల్యాల గంగాధర్‌-వాణి మూడో కుమారుడు విజయేంద్ర(5) మలేరియాతో బాధపడుతుండగా కాగజ్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఈనెల 10న మంచిర్యాల ఆస్పత్రికి తీసుకుపోతుండగా మార్గమధ్యలో వాంతులు అయ్యాయి. దాంతో అపస్మారకస్థితికి చేరుకున్న బాలుడు మృతిచెందాడు.
అంబులెన్స్‌ లేక ప్రాణం విడిచి..
గత నెల 31న ఇదే జిల్లాలోని తిర్యాణి మండలం కౌవుట అనుబంధ గ్రామం కేరెగూడకు చెందిన కురిసెంగ యాదోరావు(40)కు తీవ్ర జ్వరం రావడంతో ‘108’కు ఫోన్‌ చేయగా స్పందించలేదు. ఐటీడీఏ అధికారులకు ఫోన్‌ చేసినా అవ్వాల్‌ అంబులెన్స్‌ను పంపలేదు. చివరకు ఎడ్లబండిపై యాదోరావును ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణం కోల్పోయాడు.

జిల్లా పరిధిలో ఆస్పత్రుల్లో నమోదైన జ్వరాలు (నెలరోజుల్లో)…
మలేరియా 34
డెంగీ 28
టైఫాయిడ్‌ 200
సామాజిక ఆస్పత్రిలో ఓపీ 12,274
పీహెచ్‌సీల్లో ఓపీ 25,189
సేకరించిన రక్తనమూనాలు 5,345
సాధారణ జ్వరాలు 242
మరణాలు 05

Courtesy Nava telangana