• బాధితుల ప్రయోజనాలు ముఖ్యం కావాలి
  • ఆ రకంగా నిబంధనలుండాలి
  • సుప్రీం మార్గనిర్దేశకత్వాన్ని కోరిన కేంద్రం

న్యూఢిల్లీ, జనవరి : నిర్భయ హత్యాచార కేసులో దోషులు రకరకాల పిటిషన్లతో ఉరిశిక్ష వాయిదాకు తెగబడుతుండడంతో కేంద్రం బుధవారం అనూహ్యంగా సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ వేసింది. ఒక కేసులో మరణ శిక్ష పడ్డ వ్యక్తి పెట్టుకున్న క్షమాభిక్షను తిరస్కరించాక వారంలోగా డెత్‌ వారెంట్‌ జారీ చేసి ఉరి తీసేయాల్సిందేనని, ఆ రకంగా నిబంధనలుండాలని, ఈ విషయంలో తగిన మార్గదర్శకాలు ఇవ్వాలని కోరింది. చట్టాన్ని, న్యాయాన్ని ‘‘ఉరి శిక్ష పడ్డ వ్యక్తికి కూడా కొన్ని హక్కులున్నాయని 2014లో శతృఘ్న చౌహాన్‌ కేసులో సుప్రీంకోర్టు ఓ తీర్పు ఇచ్చింది.

ఆ తీర్పు నిందితులను దృష్టిలో పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. దోషుల హక్కులు కాదు, బాధితుల ప్రయోజనాలు ముఖ్యం కావాలి. అత్యాచారం, అనంతర హత్యల్లాంటి ఘోరమైన నేరాలకు పాల్పడిన వారు చట్టంతో ఆటలాడుకుంటున్నారు. జాతి ఆత్మను దెబ్బతీస్తున్నారు. అంచేత ఆనాటి తీర్పును పరిశీలించి స్పష్టత నివ్వాలి.. అవసరమైతే దానికి సవరణలు చేయాలి’’ అని సుప్రీంకోర్టుకు సమర్పించిన ఓ అప్లికేషన్లో కేంద్ర హోంశాఖ కోరింది. క్షమాభిక్ష పిటిషన్లు పెండింగ్‌లో పడిపోతే శిక్ష కాస్తా జీవితఖైదుగా మారే అవకాశాలున్నాయని నాటి తీర్పు పేర్కొందని గుర్తుచేసింది.

దోషులు ఇలా పిటిషన్లతో కాలక్షేపం చేస్తూ పోతే బాధిత కుటుంబాలు పడే ఆవేదన అంతాఇంతా కాదనీ, చివరకు మతి భ్రమణానికి గురికావడమూ జరుగుతోందనీ’ సుప్రీం దృష్టికి కేంద్రం తెచ్చింది. క్యూరేటివ్‌, క్షమాభిక్ష పిటిషన్ల దాఖలుకు నిర్దిష్ట గడువు విధించాలని కోరింది. క్షమాభిక్ష కూడా తిరస్కారమయ్యాక 14 రోజులు గడువిచ్చి ఉరితీయాలన్న నిబంధనను ఏడు రోజులకు మార్చాలని విజ్ఞప్తి చేసింది. ‘‘ఒక దోషి క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించాక అతని రాత తేలిపోయినట్లే. కానీ అతనితో పాటు శిక్ష పడ్డ మరొకడి పిటిషను పెండింగ్‌లో ఉన్నపుడు ఈ వ్యక్తి పడే బాధ నరకప్రాయం. ఈస్థితి మారాలి’’ అని హోంశాఖ పేర్కొంది.

కేంద్రం కోరిన సవరణలివీ..

  • ఉరి శిక్ష పడ్డ దోషులు రివ్యూ పిటిషన్లను కోర్టు చెప్పిన నిర్ణీత గడువులోగా మాత్రమే దాఖలు చేయాలి.
  • కోర్టు డెత్‌ వారెంట్‌ జారీ చేసిన వారంలోగా మాత్రమే క్యూరేటివ్‌ లేదా క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకోవాలి
  • క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కారమయ్యాక తక్షణం.. వారంలోగా… కోర్టులు లేదా ప్రభుత్వాలు లేదా జైళ్ల అధికారులు డెత్‌ వారెంట్‌ను జారీ చేయాలి. వారంలోగానే ఉరి అమలు చేసెయ్యాలి.
  • సహ దోషుల పిటిషన్లతో నిమిత్తం లేకుండా ఉరితీసే అవకాశం ఉండాలి.

Courtesy Andhrajyothi