CAA– వారణాసిలో 56 మందికి బెయిల్‌

లక్నో: డిసెంబరు 19న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న వారిలో అరెస్టయిన 56 మందికి కోర్టు గురువారం బెయిల్‌ మంజూరుచేసింది. అరెస్టయినవారిలో పర్యావరణానికి సంబంధించిన ఎన్జీఓ సంస్థను నడుపుతున్న సామాజిక కార్యకర్తలు ఏక్తా, రవి శేఖర్‌లు కూడా ఉన్నారు. కాగా, గురువారం వారికి కోర్టు బెయిల్‌ మంజూరు చేయటంతో వారి పద్నాలుగు నెలల చిన్నారి చంపక్‌ ఎట్టకేలకు తల్లి ఒడికి చేరింది. ఒక్కొక్కరికీ రూ. 25 వేల పూచీకత్తుపై అడిషనల్‌ సెషన్స్‌ న్యాయమూర్తి సర్వేశ్‌ కుమార్‌ పాండే వీరికి బెయిల్‌ మంజూరుచేశారు. ‘చంపక్‌ నా పాలమీద ఆధారపడిన పసికందు. తన గురించి నేను ఎంతో ఆందోళన చెందాను’ అని బెయిల్‌పైన విడుదలైన అనంతరం ఏక్తా మీడియాకు తెలిపారు. పాలుతాగే పసిబిడ్డ వున్న ఏక్తాను అరెస్టు చేయటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఏక్తా అరెస్టు నేపథ్యంలో వారి కుమార్తె చంపక్‌ను బంధువులు తమ ఇంటికి తీసుకువెళ్లారు. అనంతరం తన బామ్మ ఇంటికి పంపించారు.

గత రెండువారాలుగా చంపక్‌ బామ్మ శీలా తివారీ సంరక్షణలోనే వుంది. దాదాపు రెండువారాలపాటు ఏక్తా, రవి శేఖర్‌కు బెయిలు కూడా లభించకపోవడంతో చిన్నారి తల్లిదండ్రుల కోసం అల్లాడిపోయింది. సీఏఏ, ఎన్నార్సీ నిరసనల నేపథ్యంలో ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే దాదాపు 19 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అందులో 15 మంది పోలీసుల బుల్లెట్‌ గాయాలతో చనిపోయారు.

(Courtesy Nava Telangana)