– బాబ్రీమసీదు కూల్చివేత కేసులో అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతీలకు నోటీసులు

న్యూఢిల్లీ : బాబ్రీమసీదు కూల్చివేత కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ సీనియర్‌ నాయకులు ఎల్‌.కె.అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతీ…తదితరులు కోర్టు ముంగిట హాజరుకావాల్సిందేనని ప్రత్యేక న్యాయస్థానం తీర్పుచెప్పింది. మసీదు కూల్చివేత కేసులో నేరశిక్షా స్మృతి (సీఆర్‌పీసీ) సెక్షన్‌-313 కింద 32మంది నిందితులుగా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరంతా ప్రత్యేక న్యాయస్థానం ముంగిట హాజరై విచారణను ఎదుర్కోవాల్సి ఉంది. నిందితుల వాంగ్మూలాన్ని న్యాయస్థానం రికార్డు చేస్తున్నది. తమకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా ఎల్‌.కె.అద్వానీ, జోషి, ఉమాభారతీ..గతంలో కోరగా న్యాయస్థానం అందుకు అనుమతిచ్చింది. అయితే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మాత్రమే ఇది అమల్లో ఉంటుందని తెలిపింది.

తాజాగా ఈ అంశంపై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సురేంద్ర కుమార్‌ యాదవ్‌ క్రితం ఇచ్చిన తీర్పుపై స్పష్టత ఇచ్చారు. కోర్టు నిర్ణయించిన తేదీన అద్వానీ, జోషి, ఉమాభారతి హాజరుకావాల్సి ఉంటుందని తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. సుప్రీం ఆదేశాల ప్రకారం, ఆగస్టు 31వరకు ప్రత్యేక న్యాయస్థానం రోజువారీ విచారణ జరపాలి. ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం కల్యాణ్‌సింగ్‌, మాజీ ఉపప్రధాని ఎల్‌.కె.అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, వినరు కతియార్‌, సాధ్వి రితాంబరా, సాక్షి మహరాజ్‌, చంపత్‌ రారు, రామ్‌ విలాస్‌ వేదాంతి…మొదలైనవారు ఈకేసులో నిందితులుగా ఉన్నారు. ఈకేసులో 26 మే 2017న కోర్టు ముంగిట హాజరైన అద్వానీ, జోషి, ఉమాభారతి బెయిల్‌, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు.

Courtesy Nava Telangana