ప్రణాళిక.. పర్యవేక్షణ లోపాలే ఆర్టీసీకి శాపాలు
 చక్కదిద్దితే లాభాల పరుగు  సాధ్యమే..

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిజంగా తెల్లఏనుగుగా మారిందా? అది నష్టాల బాట వీడి లాభాల మార్గంలో ప్రయాణించే అవకాశం లేదా? ఆర్టీసీ సంక్షోభానికి అసలు మూలం ఎక్కడుంది? దాని పరిష్కారం ఎవరి చేతుల్లో ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం ఇది. ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు కాస్త దృష్టి సారిస్తే లాభాల పరుగు సాధ్యమేనని నిపుణులు సూచిస్తున్నారు.

ఆదాయం మూరెడు. ఖర్చు బారెడు. ఇదీ ఆర్టీసీ తాజా ఆర్థిక పరిస్థితి. నడిపే ప్రతి కిలోమీటరుకు రూ.7.09 నష్టం వస్తోంది. ఖర్చుల్లో జీతభత్యాలు, డీజిల్‌ వ్యయాలే 64.7 శాతం ఉన్నాయి. మూడేళ్లుగా డీజిల్‌ ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నా ఛార్జీలు మాత్రం అలాగే ఉన్నాయి. వచ్చే ఆదాయానికి, ఖర్చులకు మధ్య పొంతన కుదరక నష్టాల మూట కొండ మాదిరిగా పెరుగుతోంది.
* పేద విద్యార్థులకు, వివిధ వర్గాలకు ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. ఆ వ్యత్యాసాన్ని మాత్రం ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆర్టీసీకి చెల్లించటం లేదు.
* మోటారు వాహన పన్నును, డీజిల్‌, విడిభాగాలపై వ్యాట్‌ను ప్రభుత్వం ముక్కుపిండి వసూలు చేస్తోంది.
* నష్టాల నేపథ్యంలో చేస్తున్న అప్పుల భారం కూడా పెరుగుతోంది. ఏటా రూ. 250 కోట్ల వరకు వడ్డీ రూపంలో ఆర్టీసీ చెల్లిస్తోంది.

కాగితాల్లోనే ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు….ప్రయాణికుల ద్వారా కాకుండా ఇతరత్రా మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అధికారులు పెద్దగా కష్టపడకుండానే ప్రస్తుతం ఏడాదికి రూ. 610 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే రూ.750 కోట్ల నుంచి రూ. 800 కోట్ల వరకు ఆదాయం పెరిగే అవకాశం ఉందన్నది అంచనా. ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం కావడంతో ఈ ఆదాయం దక్కడంలేదు.
ఆస్తులు పుష్కలం..  తెలంగాణ ఆర్టీసీకి సుమారుగా 1,500 ఎకరాల భూములు ఉన్నాయి. వాటి విలువ సుమారు రూ. ఆరేడు వేల కోట్లు ఉంటుందన్నది అంచనా. అత్యంత విలువైన భవనాల్లో బస్‌ భవన్‌, పక్కనే ఉన్న ఏడెకరాల ఖాళీ స్థలం, ఆర్టీసీ కల్యాణ మండపం, తార్నాక ఆస్పత్రి, డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రం ఇలా రూ. వందల కోట్ల విలువ చేసే నిర్మాణాలూ ఉన్నాయి.
* ఆస్తులను లీజుకు ఇచ్చినా, వాణిజ్య నిర్మాణాలు మార్చినా భారీగా ఆదాయం వస్తుంది. జిల్లా కేంద్రాలు, ప్రధాన ప్రాంతాల్లో మాల్స్‌, మినీ సినిమా హాల్స్‌, ఆహారశాలల నిర్మాణానికి స్థలాలను లీజుకు ఇచ్చేందుకు దస్త్రాన్ని రూపొందించి ప్రభుత్వానికి పంపారు. ఇప్పటివరకు పట్టించుకున్న నాథుడు లేడు.
* చిన్న చిన్న స్థలాల్లో పదుల సంఖ్యలో పెట్రోలు బంకులు పెట్టేందుకు చమురు సంస్థలతో ఆర్టీసీ ఒప్పందం చేసుకుంది. వేళ్లమీద లెక్కించదగిన సంఖ్యలో మాత్రమే అవి ఏర్పాటు అయ్యాయి.
భారీగా అవినీతి..  ఆర్టీసీలో అధికారుల స్థాయిలో దుబారాతోపాటు అవినీతి భారీగానే ఉంది. విధి నిర్వహణలో ఉన్న కండక్టర్ల వద్ద టికెట్టు సొమ్ములో వ్యత్యాసం వస్తే వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తారు. అదే అధికారులు బయోడీజిల్‌, ఇతర కొనుగోళ్లలో చేతివాటాన్ని ప్రదర్శిస్తే అడిగేవారులేరు. అద్దె బస్సుల విషయంలోనూ ఆరోపణలున్నాయి.
Courtesy Eenadu…