చల్లపల్లి స్వరూపరాణి

స్త్రీవాదం అన్నీ అమరిన వంటింటి గుమ్మం ముందే ఆగిపోయింది. అది వంటగదిలో, లేబర్ రూములో స్వేచ్చకోసం తండ్లాడి పవిటల్ని తగలెయ్యడంలో చాలాకాలం తలమునకలైంది. వంటి నిండా కప్పుకోడానికి గుడ్డలు లేని మూడురాళ్ళ పొయ్యిల బాధలు పెత్తందారీ కులాల స్త్రీవాదులకు అర్ధం కావు. రెక్కలుముక్కలు చేసుకుని సంపాదించిన ‘ఆడకూలీ’ డబ్బులతో సారాయి తాగొచ్చి రోజూ తన్నే మొగుడితో పాటు పెత్తనదారీ కులాల పురుషులవల్ల శ్రమదోపిడీతో పాటు లైంగిక దోపిడీకి గురయ్యే దళిత ఆదివాసీ స్త్రీల వెతలపై స్త్రీవాదం మాట్లాడదు. మాట్లాడుతున్నామని ఈమధ్య కొందరు మాటకారులు కొత్తగా దబాయిస్తున్నారు. స్త్రీవాదం తన పోరాటంగా చెప్పుకునే సారా వ్యతిరేక ఉద్యమంలో నల్లమల అటవీ గ్రామాల ఆదివాసీ చెంచు జాతి మహిళలు సైతం సారా నిషేధం కోసం రోడ్డెక్కి తమదైన ఉద్యమాన్ని నిర్మించారని ఎంతమందికి స్త్రీవాదులకు తెలుసు?

నల్లమల అడవిలో ఉండే అనేక చెంచు పెంటల్లో(గ్రామాలు) ‘హటకేశ్వరం’ ఒకటి. ఈ గ్రామం శ్రీశైల ముఖద్వారం నుంచి దేవస్థానానికి వెళ్ళేదారిలో రోడ్డు పక్కనే ఎడమవైపు ఉంటుంది. అక్కడ మొత్తం ముప్పై రెండు దాకా ఉండే చెంచు కుటుంబాలలో పిల్లా, పెద్దా కల్సి సుమారు నూటా యాభై మందిదాకా జనాభా ఉంటారు. అక్కడ ఉండే ‘మల్లమ్మ కన్నీరు’ ‘వేమిరెడ్డి మల్లమ్మ ధార’, ‘భీముని కొలను’ వంటి ప్రత్యేక స్థావరాలకు యాత్రీకులు వస్తుంటారు. చెంచులు శ్రీశైల ముఖద్వారం నుంచి దేవస్థానానికి వెళ్ళే రహదారి పక్కనే ఉన్న చదునైన ప్రదేశంలో గుడిసెలు వేసుకుని బతుకుతున్న ఈ గూడెం చెంచులు అడవి లోపల ఉండేవారికంటే కొంత మేరకు భిన్నంగా ఉంటారు. వారు వేట ద్వారా కొంత జీవనోపాధిని పొందుతున్నప్పటికీ వారు శ్రీశైల దేవస్థానానికి వెళ్ళే దారిలో గుడికి దగ్గరలో ఉండడం వలన వారు యాత్రీకులకు అవసరమైన వస్తువులు, చిరుతిళ్ళు అమ్మే చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేస్తుంటారు. వారికి చదువులేదు కాబట్టి ఆ వ్యాపారంలో కూడా వారిని మోసం చేసేవారే ఎక్కువ.

చెంచులు భారతదేశపు అతి ప్రాచీన ఆదిమ తెగ అని మానవశాస్త్రం చెబుతుంది. వారిది అనాదిగా మాతృస్వామిక సమాజం. పురుషులతో పాటు స్త్రీలు కూడా వేటాడడం, కందమూలాలు సేకరించడంలో సమానంగా పాల్గొంటారు. అటువంటి ఆదిమ జాతికి చెందిన మాతృస్వామిక వ్యవస్థకి అసలైన ప్రతినిధి భూమని ‘జెండాలమ్మ’. ఆమెకి తల్లిదండ్రులు ఆ పేరు ఎందుకు పెట్టారో తెలీదుగానీ ఆమె నిలువెత్తు ఆదివాసీ స్త్ర్రీ చైతన్య ‘జెండా’ లా ఉంటుంది. హటకేస్వరంలో చెంచు గుడిసెల ముందు ఉండే చెట్టు నీడే ఆమె సింహాసనం.

జెండాలమ్మకు సుమారు అరవై సంవత్సరాలుంటాయి. ఆమె భర్త ‘గజ్జలయ్య’ సాదా సీదా మనిషి. ఆమెకి పుట్టిన ఏడుగురు సంతానంలో ఒక్క ‘మల్లమ్మ’ తప్ప అందరూ చిన్న వయసులోనే పౌష్టికాహార లోపంతో రోగాల బారినపడి చనిపోయారు. ఇప్పుడు ఆమె కూతురు మల్లమ్మ కుటుంబం కూడా హటకేశ్వరంలోనే జెండాలమ్మ దగ్గరే ఉంటుంది. ఒకరకంగా జెండాలమ్మ ముప్పై రెండు గడప ఉండే హటకేశ్వరం చెంచు పెంటకి పెద్ద దిక్కు అనొచ్చు. ఆ గ్రామానికి ఆమె నాయకురాలు, అందరి మంచి చెడ్డలు చూసుకునే తల్లి. సారా వ్యతిరేక ఉద్యమంతో పాటు చెంచులకు

ఇళ్ళ పట్టాల కోసం, వారికి ఓటు హక్కు, ఆధార్ కార్డులు, ఉపాధి హామీ పధకం కింద పని, చెంచుల అభివృద్ధి కోసం ఏర్పాటైన సమగ్ర గిరిజాభివ్రుద్ధి సంస్థ నుంచి రుణాలు ఇప్పించడం, చెంచులు అడవిలో సేకరించే వస్తువులకు న్యాయమైన ధరల కోసం గిరిజన కో ఆపరేటివ్ స్టోర్ వారితో వాదించడం వంటి పోరాటాలు ఎన్నో చేసింది జెండాలమ్మ.

తొంభైల నాటి సారా వ్యతిరేక ఉద్యమంలో జెండాలమ్మ క్రియాశీలక కార్యకర్త. చెంచు పెంటల్లో మగవాళ్ళు సొంతగా తయారుచేసుకునే సారాతో పాటు ప్రభుత్వ సారా దుకాణాలలో దొరికే సర్కారీ సారా కూడా ఎక్కువగా తాగి చిన్న వయసులోనే చనిపోవడంపై జెండాలమ్మ మరికొందరు చెంచు స్త్రీలతో కలిసి సారా నిషేధం కోసం ఉద్యమం చేసింది. అప్పట్లో శ్రీశైలం దేవస్థానం సమీపంలోని ‘మేకలబండ’, ‘కొత్తపేట’ కాలనీల చెంచు స్త్రీలు ‘జయమ్మ’ వంటి గిరిజనేతర స్త్రీల నాయకత్వంలో సారా నిషేధం కోసం రోడ్డెక్కి అటు భర్తలతో, ఇటు పోలీసులతో తన్నులు తిన్నారు. వారికి ఎటువంటి గుర్తింపు రాకుండానే ఆ ఉద్యమం ముగిసింది. శ్రీశైల దేవస్థానం పక్కనే ఉన్నప్పటికీ జెండాలమ్మకి వీళ్ళెవరూ తెలీదు, సారాని నిషేధించమని ఆమె తొంభైయవ దశకంలోనే కాదు ఇప్పటికీ అధికారులను అడుగుతూనే ఉంటుంది. చేతిలో పది రూపాయలుంటే దాన్ని తాగుడుకి తగలేసి భార్యా బిడ్డల్ని పస్తులుంచి ముప్పై, నలభై ఏళ్లకే రాలిపోయే చెంచు పురుషుల కోసం ఆమె పడే తపన కొలువలేనిది. ‘తాగుడు మానేస్తే ఈ అడవిలో దొరికే తిండితో మావోల్లు చానాకాలం బతకొచ్చు, నాబాధ అదే’ అంటుంది జెండాలమ్మ.

జెండాలమ్మ చేపట్టిన పోరాటాలలో చెంచుల ఇళ్ళ పట్టాల సమస్య ముఖ్యమైంది. ఇతరుల దృష్టిలో చెంచులు అసలు మనుషులు కారని, హటకేశ్వరం లో తాము ఎన్నో తరాలుగా నివసిస్తున్నా కనీసం ఇళ్ళ పట్టాలు ఇవ్వకపోగా అటవీ అధికారులు ఒకవైపు, దేవస్థానం వారు మరోవైపు మని మాటిమాటికీ ఖాళీ చెయ్యమంటున్నారని ఎట్టి పరిస్థితిలోనూ చెంచులు హటకేశ్వరం ను వదిలి వెళ్ళేది లేదని ఆమె కొంతకాలంగా అటవీ అధికారులతో యుద్ధం చేస్తుంది. అడవి అక్కడ అనాదిగా జంతువులను, పరిసరాలను అంటిపెట్టుకు బతికే అడవి బిడ్డలదేనని, తమని అక్కడినుంచి వెళ్ళమని అడిగే హక్కు దేవుడికి కూడా లేదని ఆమె అటవీ అధికారులతో, దేవస్థానం అధికారులతో తెగేసి చెప్పింది. దేవస్థానం వారు గతంలో ఒకసారి హటకేశ్వరం చెంచు గుడిసెలను తొలగించే ప్రయత్నం చేసినప్పుడు జెండాలమ్మ నాయకత్వంలో చెంచులు ప్రతిఘటించారు. జెండాలమ్మ ఫారెస్ట్ అధికారులను తమ నివాసాల వైపు కన్నెత్తి కూడా చూడనివ్వదు, ఆమె ఎంతకైనా తెగించి పోరాడుతుందని ఫారెస్ట్ ఉద్యోగులందరికీ తెలుసు. అందుకే ఎవరూ ఆమెతో ఘర్షణకు దిగరు. ‘అధికారులతో ఏ పోరాటానికైనా నేను సిద్ధమే, పోరాటంలో పోతే నేను పోతా, కానీ నా చెంచు బిడ్డలు అడవిలో నిర్భయంగా బతకాలి, మా చెంచు పెంటలు ప్రశాంతంగా నిద్రపోవాలి’ అంటుంది వీరురాలు జెండాలమ్మ. రాజకీయ నాయకులు ఓట్లు అడగడానికి శ్రీశైలం, సున్నిపెంట గ్రామాలకు వొచ్చినట్టు హటకేశ్వరం రాకపోవడం అక్కడ నివసించే చెంచుజాతిపై వారికుండే నిర్లక్ష్య ధోరణికి చిహ్నమని జెండాలమ్మ భావన. ఆమె చుట్టుపక్కల పెంటల చెంచులను సమీకరించి పాజక్ట్ ఆఫీసర్ కార్యాలయం ముందు గతంలో ఎన్నోసార్లు ధర్నాలు, రాస్తా రోకోలు నిర్వహించింది. ఇళ్ళ పట్టాలకోసం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆఫీసుకు వెళ్తే గుడిసె కప్పుకునే పట్టాలు ఇచ్చారని జెండాలమ్మ చమత్కరిస్తుంది.

చెంచులకు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా లభించే లబ్ది, సదుపాయాల గురించి దాదాపు నల్లమల చెంచులకు ఎవరికీ తెలీదు. జెండాలమ్మకి కొందరు గిరిజనేతర అభ్యుదయ వాదులతో పరిచయాలు ఉన్నందున ఆమెకి వాటిపైన కొంతమేరకు అవగాహన ఏర్పడింది. ఆమె తరచూ సున్నిపెంట(ప్రాజెక్ట్ కాలనీ)లో ఉండే సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆఫీసుకి, ఫారెస్ట్ రేంజర్ ఆఫీసుకి వెళ్లి చెంచులకు ప్రభుత్వ పరంగా దక్కవలసిన సదుపాయాల కోసం అధికారులను అడుగుతుంది. ఆ విధంగా చెంచులకు కొన్ని స్కీముల ద్వారా చిన్న మొత్తాలలో రుణాలు, వారికి వోటు హక్కు, ఆధార్ గుర్తింపు కార్డులు వంటివి వచ్చేలా కృషి చేసింది. శ్రీశైల దేవస్థానానికి, సున్నిపెంట ప్రాజెక్ట్ కీ వచ్చిపోయే రాజకీయ నాయకులను, ప్రభుత్వాధికారులను కల్సి గిరిజనుల సమస్యలల్ని పరిష్కరించమని వినతి పత్రాలు సమర్పిస్తుంది జెండాలమ్మ. ఉపాధి హామీ పధకం ప్రకారం చెంచులకు పని కల్పించమని ఆమె అధికారులను కోరుతుంది. అయినా ప్రాజెక్ట్ ఆఫీసు దగ్గర ఎప్పుడూ తచ్చాడే దళారీల గురించి కూడా ఆమెకు తెలుసు. వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి అనే ఎరుక ఆమెకి ఉంది.

అడవి బిడ్డలకు అడవే తిండి పెడుతుంది. హటకేశ్వరం రోడ్డుమీద ఉండడం వల్ల అటవీ అధికారులు తరచుగా అక్కడ తిరుగుతూ చెంచులు జంతువులను వేటాడకుండా వారిని బెదిరించడం వలన వారు వేట దాదాపు మానుకుని పాల గడ్డలు, చెంచు గడ్డలు తవ్వుకుని తింటారు. చింతపండు, కరక్కాయలు, కుంకుడుకాయలు, జిగురు, తేనె మొదలైన వస్తువులను గిరిజన కో ఆపరేటివ్ స్టోర్ లో అమ్మి అక్కడ నుంచి బట్టలు, నూనె వంటి వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. వారి అమాయకత్వాన్ని స్టోర్ నిర్వాహకులు సోమ్ముచేసుకోవడం సర్వసాధారణం. ‘అలగ్గాయ, మిత్తి గింజలు, కరక్కాయ మా సొత్తు, ఆటి మీద హక్కు మాదే! మీకు అవెక్కడ ఉంటాయో ఎరుకేనా?’ అంటూ గిరిజన స్టోర్ వారి జులుంని ప్రతిఘటిస్తుంది జెండాలమ్మ.

అడవిలో బోర్లు వెయ్యడం వల్ల బంకమాకులు, పాల తీగలు చచ్చిపోయి అడవి బిడ్డలు తిండి కోసం నకనకలాడుతున్నారని, మరోవైపు ఫారెస్ట్ ఉద్యోగులు వారిని జంతువుల్ని వేటాడనీయకుండా వేధిస్తున్నారని జెండాలమ్మ ఆవేదన చెందుతుంది. వర్షాకాలం వస్తే సొప్ప గడ్డిలో ఉండే ‘గుడ్డీగలు’ కుట్టి చెంచులు జ్వరంతో చనిపోతున్నారని, కరువు పనిలో భాగంగా చెంచులకు తమ పరిసరాల్లో పెరిగే సొప్ప గడ్డిని కోసే పని ఇప్పించమని ఆమె ఫారెస్ట్ అధికారులకు వినతి పత్రాలు అందిస్తుంది.

హటకేశ్వరం చెంచు గూడెంలో నివసించే భార్యాభర్తలు తగువు పడినా, తాగుబోతు భర్తలు భార్యల్ని కొట్టినా ఆ విషయం జెండాలమ్మకు తెలిస్తే ఊరుకోదు. బయట సమాజంతో కొట్లాడే జెండాలమ్మ అంతరంగిక కుటుంబ వివాదాల్ని కూడా నేర్పుగా పరిష్కరిస్తుంది. ఆమె మాటకు హటకేశ్వరం చెంచు పెంటలోనే కాదు శ్రీశైలం దేవస్థానం, ప్రాజెక్ట్ కాలనీలలో కూడా విలువ ఉంది. అక్కడి ప్రజా సంఘాలకు జెండాలమ్మ తలలో నాలుకలా ఉంటూ సమస్యలమీద నిత్యం తన గొంతు వినిపిస్తూ ఉంటుంది. ‘కొమురం భీమ్ చెంచు గిరిజన సంక్షేమ సంఘం’కి ఆమె అధ్యక్షురాలు.

జెండాలమ్మ కృషి ఫలితంగా హటకేశ్వరం చెంచులకు ఓటుహక్కు వచ్చినాక వారికి కొంత బేరమాడే శక్తి పెరిగిందనవచ్చు. అయినప్పటికీ రాజకీయ నాయకులు ఆ అమాయకులను కూడా గిరిజనేతర సామాన్య జనాన్ని చూసినట్టే కేవలం ‘ఓటర్లు’ గా పరిగణించడం తప్ప వారి కడగండ్లను పట్టించుకునే నాయకులు లేరు. జెండాలమ్మ చెంచుల ఇళ్ళ పట్టాల కోసం చేస్తున్న పోరాటం ఇంకా ఫలించలేదు. ఆమె పంచాయితీ, మండల ఆఫీసుల చుట్టూ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ ఆఫీసరు కార్యాలయం చుట్టూ కాళ్ళరిగిపోయేలా తిరుగుతూనే ఉంది.

అడవిలో పుట్టి అడవి మానుల్లా పెరిగి అమాయకంగా ఉండే చెంచు స్త్రీ, పురుషులు పెద్దగా నోరువిప్పి మాట్లాడే సందర్భాలు ఉండవు. జెండాలమ్మ మాత్రం సగటు చెంచు స్త్రీకి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆమె ఎవరినైనా నిలదీసి మాట్లాడుతుంది. ఆ తెగువ ఆమెకి ఎలా అబ్బిందో ఆశ్చర్యం వేస్తుంది. దానికి ఆమె చెప్పే సమాధానం ‘తెంపు వొచ్చినప్పుడు ఎవురైనా మాట్టాడతారు’ అని. అది నల్లమల చెంచుల విషయంలో ఇప్పుడు జరుగుతున్న దౌర్జన్యాల సందర్భంగా బాగా నెరవేరుతుంది. వన్ ఆఫ్ సెవెంటీ(1/70) చట్టం గురించి ఆమెకి తెలీకపోయినా సహజ చైతన్యంతో తన పెంటలో గిరిజనేతరులనే కాదు, ఆఖరుకి మరో గిరిజన తెగ అయిన లంబాడీల పెత్తనాన్ని కూడా సహించని అడవి బిడ్డ స్వయం ప్రతిపత్తి జెండాలమ్మలో నిండుగా కనిపిస్తుంది. ఏ సిద్ధాంతం చదవకపోయినా జెండాలమ్మ స్వయంగా స్త్రీ సాధికారతకు ప్రతీక. ఆమె ఆదివాసీ మాత్రుస్వామ్యానికి, ఆత్మగౌరవానికీ నిలువెత్తు ‘జెండా’