ఉత్తర ప్రదేశ్‌ ఉభాలో సంఘటన
పది మంది మృతి : 29 మందికి గాయాలు
ఉత్తర ప్రదేశ్‌ సోన్‌భద్ర జిల్లా కేంద్రమైన రాబర్ట్స్‌గంజ్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉభా గ్రామానికి రెండు ఈ నెల 17 దాదాపు 200 మంది సాయుధులు చేరుకున్నారు. వీరి చేతిలో ఆయుధాలతో పాటు కర్రలు, రైఫిల్స్‌ ఉన్నాయి. వీరందరికి ఆ గ్రామ ప్రధాన్‌ యజ్ఞదత్‌ గుర్జార్‌ నేతృత్వం వహించాడు. వీరంతా 32 ట్రాక్టర్‌ ట్రాలీలలో గ్రామానికి చేరుకున్నారు. గ్రామానికి చేరుకున్న వారు అక్కడ ఉన్న 100 బిగాల భూమిని తమ అధీనంలోకి తెచ్చుకుని ట్రాక్టర్లతో దున్నడం ప్రారంభించారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి ఈ భూమిని అక్కడి గ్రామస్తులలో అత్యధికంగా ఉన్న ముండా గిరిజన సంతతికి చెందిన ఆదివాసీలు సాగు చేస్తున్నారు. తమ భూమిలోకి వేరే వారు వచ్చి ట్రాక్టర్లతో దున్నుతుండటంతో ఒకింత విస్మయానికి లోనైన వారందరూ కలిసికట్టుగా నిరసన తెలిపి ప్రతిఘటించారు.దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ప్రారంభమైంది. గ్రామ పెద్ద తరుపున వచ్చిన సాయుధులు తమ వద్ద ఉన్న కర్రలతో, లాఠీలతో మహిళలతో సహా గ్రామస్తులపై దాడి చేయడంతోపాటు పాశవికంగా కాల్పులు జరిపారు. కేవలం 20 నిముషాల వ్యవధిలో ఆ ప్రదేశమంతా రక్తమయ్యమయింది. ఈ ఘర్షణల్లో ఏడుగురు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. ఒకరు ఆసు పత్రిలో మరణించారు. మొత్తం 10 మంది మరణించగా మరో 29 మందికి గాయాలయ్యాయి. సీనియర్‌ పోలీసు అధికారులకు విషయం తెలియచేసినప్పటికీ, ఎవరూ ఘటనా స్థలికి రాలేదని గ్రామస్తులు మీడియాకు తెలిపారు. చివరకు కంట్రోల్‌ రూమ్‌కు ఫోను చేయడంతో కేవలం ఇద్దరు పోలీసులు అక్కడకు చేరుకుని ప్రేక్షక పాత్ర వహించారని చెప్పారు. ఈ ఘర్షణలో గాయపడిన వారిని, మృతి చెందిన వారిని ఇక్కడకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘోరవాల్‌లోని స్థానిక కమ్యూనిటి హెల్త్‌ సెంటర్‌కు తరలించారు.
భూ స్వామి కర్కశత్వానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలుస్తుంది. పేదల భూమిని బలవంతంగా లాక్కునేందుకే సాయుధ బలగాలు పథకం ప్రకారం చేసిన దాడి అని చెప్పక తప్పదు.
ఇంతకీ విషయమేమంటే…
ఉభా గ్రామంలోని ముండా గిరిజన సంతతికి చెందిన ఆదివాసీలు స్వాతంత్య్రానికి ముందు నాటి నుండి ఆ భూమిని సాగు చేస్తున్నారు. మీడియా కధనం మేరకు 1955లో ఆదర్శ్‌ సొసైటీ అనే చట్టబద్ధంగా నమోదైన సంస్ధ ఉభా గ్రామంలో 600 బిగాల భూమిని స్వాధీనం చేసుకుంది. ఈ నెల 17న ఆక్రమించుకునేందుకు ప్రయత్నించిన 100 బిగాల భూమి కూడా ఇందులో ఉంది. భూమిని సాగు చేస్తున్న ఆదివాసీలకు దీనిపై అవగాహన లేదు. బహుశా ఈ భూమిని ఆదర్శ్‌ సొసైటీకి బదిలీ చేయడం ఆ భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో భాగమై ఉండవచ్చునని, 1950 నాటి ఉత్తర ప్రదేశ్‌ జమిందారీ వ్యవస్ధ రద్దు చట్టం, 1952లో రూపొందించిన దాని నిబంధనల నుండి తప్పించుకునేందుకు అయ్యుం డొచ్చని కొన్ని మీడియా కధనాలు పేర్కొంటున్నాయి.
అయితే 1978లో ఆదర్శ్‌ సొసైటీ ఈ భూమిపై హక్కులు కోల్పోయిందని, పాట్నాలో ఉన్న మిశ్రా కుటుంబానికి ఆ భూమి అమ్మినట్లు చెప్పబడుతున్నదని గ్రామస్తులు తెలిపారు. ఆ కుటుంబం ప్రతి ఏడాది భూమిని సాగు చేస్తున్న కుటుంబాల నుండి అద్దె (కౌలు) తీసుకుంటున్నదని వారు తెలిపారు. ఆదివాసీలు ఈ విధానాన్ని నిరసిస్తూ వ్యవసాయాన్ని సాగిస్తున్నారు. ఈ క్రమంలో 2017లో ఈ కధ కొత్తమలుపు తీసుకుంది. గ్రామ ప్రధాని యజ్ఞదత్‌ ఆ భూమిని కొనుగోలు చేసినట్లు తెలిసింది. అయితే ఆ భూమి ఎవరి దగ్గర, ఎంతకు కొన్నాడన్న విషయం స్పష్టంగా తెలియదు. అతనికి వివిధ రాజకీయ పార్టీలతో కూడా సంబంధాలున్నాయి.
ఎప్పుడైతే యజ్ఞదత్‌ సాగుదారులను తొలగించి భూమిని సొంతానికి ఉపయోగించుకోవాలనుకున్నాడో అప్పుడే చట్టపరమైన వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో సాగుదారులకు పలు బెదిరింపులు వచ్చాయి. కొన్ని ఘర్షణలు కూడా జరిగాయి. ఆదివాసీలు తొలుత ఈ విషయాన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ దృష్టికి తీసుకెళ్ళగా ఆయన పట్టించుకోలేదు. దీంతో జిల్లా మెజిస్ట్రేట్‌ వద్దకు వెళ్ళారు. ఆయన కూడా చర్య తీసుకొనేందుకు నిరాకరించాడు. ఆ తరువాత వారు కమిషనర్‌ కార్యాలయానికి వెళ్ళి ఫిర్యాదు చేయడానికి సిద్ధపడ్డారు. ఈ నెల 17న అక్కడికి వెళ్ళి తమ సమస్యను చెప్పుకుందామనుకున్నారు. ఘోరవాల్‌లోని సీనియర్‌ అధికారులతో సహా ఈ విషయం అందరికి తెలిసింది. యజ్ఞదత్‌కు కూడా విషయం చేరింది. దీంతో భూమిని ఆక్రమించుకుని తన స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్నవే ఈ పరిణామాలన్నీ.
పోలీసులు, పాలనా యంత్రాంగం కుమ్మక్కు
పోలీసులకు,పాలనా యంత్రాంగానికి తెలియకుండా పెద్ద ఎత్తున దాడి జరగడం సాధ్యపడదు. భూమిపై చట్టపరమైన వివాదం కొనసాగుతున్నదని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ప్రస్తుతం ఆ భూమిని ఎవరు ఆక్రమించారన్న విషయం ప్రతి సీనియర్‌ అధికారికి తెలుసు. ప్రభుత్వాధికారులు, పోలీసులు, యజ్ఞదత్తు మధ్య రహస్య ఒప్పందం ఉందన్నది తెలుస్తోంది. చివరకు ఈ ఘర్షణలు ప్రాణాంతకంగా పరిణమించడంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ జిల్లాకు చెందిన ఐదుగురు ఉన్నతాధికారులను సస్పెండ్‌ చేశారు. నష్ట పరిహారాన్నిప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాక కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ ఆ గ్రామంలోకి రాకుండా ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వాధికారులు అడ్డుకున్నారు. పొరుగునే ఉన్న మిర్జాపూర్‌ జిల్లాలోనే ఆమెను నిలిపివేశారు. భూ వివాదాన్ని త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.ఉభాలోని ముండా ఆదివాసీలు తమకు జరుగుతున్న అన్యాయంపై పోరాడేందుకు రక్తాన్ని చిందిస్తున్నారు.

ప్రియాంక పర్యటన అడ్డగింత
పోలీసుల వైఖరిపై కాంగ్రెస్‌ మండిపాటు
కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ పర్యటనను ఉత్తరప్రదేశ్‌ పోలీసులు శుక్రవారం అడ్డుకున్నారు. రాష్ట్రంలోని సోంభద్ర జిల్లాలో ఒక భూవివాద ఘర్షణలో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఆమె అక్కడకు బయలుదేరారు. ముందుగా ఘటనలో గాయపడిన వారిని వారణాస ిలోని ఒక ఆసుపత్రిలో పరామర్శించారు. అనంతరం ఘటన జరిగిన ఉబ్బా గ్రామానికి బయలుదేరారు. దీంతో ప్రియాంకను పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. ఘటన అనంతరం ఆ ప్రాంతంలో 144 సెక్షన్‌ విధించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆగ్రహించిన ప్రియాంక, కాంగ్రెస్‌ కార్యకర్తలు నారాయణపూర్‌లోని మీర్జాపూర్‌ రహదారిపై నిరసనకు దిగారు. పోలీసుల వైఖరిపై నినాదాలు చేశారు. అనంతరం ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని జీపులో సమీపంలోని చూనార్‌ గెస్టుహౌస్‌కు తరలించారు. ఈ సందర్భంగా మిమ్నల్ని అరెస్టు చేశారా అని మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ‘అవును, పోలీసులు ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. మేం కేవలం బాధిత కుటుంబాలను మాత్రమే కలిసేందుకు వెళ్తున్నాం. పోలీసులు అడ్డుకోవడంతో మేం శాంతియుతంగానే నిరసన కార్యక్రమం చేపట్టాం. ఇలా మమ్మల్ని అదుపులోకి తీసుకునేందుకు ఎవరు వీరికి ఆదేశాలు ఇచ్చారు. ప్రజల సంక్షేమం కోసం ఎక్కడికి వెళ్లడానికైనా సిద్ధం’ అని అన్నారు.
ప్రియాంకను అడ్డుకోవడం దారుణం : రాహుల్‌
ప్రియాంక పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌లో స్పందించారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న ప్రియాంకను పోలీసులు అడ్డుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారం చేతిలో ఉంది కదా అని ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. యోగి ప్రభుత్వ చర్య కారణంగా రాష్ట్ర ప్రజానీకం అభద్రతా భావనకు గురౌతున్నారని వ్యాఖ్యానించారు. ప్రియాంక గాంధీని అరెస్టు చేయడం అక్రమమని, దారుణమని ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు.

(ప్రజాశక్తి సౌజన్యంతో)