గుగులోతు శంకర్ నాయక్

 భారత దేశ సంస్కృతి అతి పురాతమైనది. భారతీయ సంస్కృతి బీజాలు పట్టణాల్లో మొలకెత్తలేదు, నగరాలలో పురుడు బోసుకోలేదు. సాహిత్యం నుండో, పురాణాల పరిమళాల నుంచో లేక ఓ నలుగురు చెప్పిన మాటల నుంచో పుట్టినది కాదు. ఒక యుగానిదో తరానిదో కాదు. ఈ భూమి మీద మానవ ఆవిర్భావంతో పాటే పుట్టి పరిణామం చెందుతూ వచ్చింది. ఎక్కడికక్కడ మానవ సమాజాలు సాంకేతి విజ్ఞానంలో వచ్చిన మార్పులను అందిపుచ్చుకుంటూ ఆధునిక కాలంతో పాటు అడుగులు వేశాయి. కొన్ని మాత్రం అడవులు, కొండలు గుట్టల్లోనే ఉండిపోయి ఆదిమ కాలపు అలవాట్లు, ఆచార సంప్రదాయాలను ఇంకా కొనసాగిస్తున్నాయి. అట్లాగే ఆదిమ వ్యవసాయ పద్ధతులను, కళలను సజీవంగా కొనసాగిస్తున్నాయి. వారినే ఆదివాసీలని, గిరిజనులని అంటున్నారు. వీరు ఆధునిక కాలానికి, ఆదిమ కాలానికి మధ్య వారధిలాంటివారు. ఆధునిక సమాజాలు ఏ స్థితి నుంచి పరిణామం చెందాయో చెప్పడానికి సజీవ ఉదాహరణలు. అట్లాంటి గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి నేటి ఆధునిక ప్రభుత్వాలు. అడవులతో విడదీయరాని బంధం గిరిజనులది. అట్లాంటి గిరిజనుల జీవనాన్ని, సంస్కృతిని ధ్వంసం చేయడానికి ఈ మధ్యకాలంలో వారిని అడవుల నుండి దూరం చేయడానికి కూడా కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ఇవి సఫలీకృతమైతే ఆదివాసీల సంస్కృతులు సర్వనాశనమై పోతాయి. ముఖ్యంగా వారి కళలకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది.
వరంగల్‌ జిల్లా నుండి మొదలుకొని భద్రాచలం, అదిలాబాద్‌, లక్సెట్టిపేట, ఉట్నూరు నుంచి మన్నూరు, వరకు… ఇటు నల్లమల అడవుల్లోనూ అద్భుతమైన గిరిజన వారసత్వంతో కూడిన భౌగోళిక జీవనం ఉంటుంది. ఆ వన జీవుల సంస్కృతి అత్యంత ఆచార భరితంగా, సహజంగా ఉంటుంది. వారి జీవనానికి సంబంధించిన విశేషాలు అనేకం వారి కళల్లో ప్రతిబింబిస్తాయి.
గిరిజన కళారూపాలు బాట్‌, డాడీ, డప్డియా, డోలి, పట్టెడ, కుర్ర, రాజుల, పూజారి, చెంచు, కొమ్ము నృత్యం, కోయ నృత్యం, బంజారా నృత్యం, సోది, దండారి నృత్యం, గుస్సాడి, లక్ష్మీదేవర లాంటి గిరిజన తెగల కళలు ఉన్నాయి. గిరిజనుల్లో ప్రధాన తెగకు ఉపతెగగా ఉంటూ ప్రధాన తెగ చరిత్ర ను, గోత్రాలను, దేవతలను గురించి చెప్పే ఆశ్రిత ఉప తెగల వృత్తి కళాకారులున్నారు. అదేవిధంగా కాలాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఆటపాటలతో సామూహిక నృత్యాలు ఉంటాయి. ఆశ్రిత కళాకారులు ఇచ్చిన ప్రదర్శనలకు గాను వీరికి త్యాగం (ప్రతిఫలంగా డబ్బులు లేదా ధాన్యం, కూరగాయలు వంటివి) లభిస్తుంది. ఏ ఏ గూడేలలో ఏ ఏ ఉప తెగలవారు కథా గానం చేయాలో తెలిపే రాగి సన్నతి లాంటి హక్కు పత్రాలు ఉంటాయి.
ఆదివాసీ ఆశ్రిత కళాకారులతో పాటు ఇతర గిరిజన తెగలకు కూడా ప్రత్యేక వాయిద్యాలు ఉన్నాయి. వీటిని గిరిజనులు సొంతంగా తయారు చేసుకోవడం కనిపిస్తుంది. సంప్రదాయ సంగీతానికి ఏ మాత్రం తీసిపోని రాగాలతో వీనుల విందుగా శ్రావ్యమైన సంగీతాన్ని వినిపిస్తారు. సంప్రదాయ వాయిద్య విశేషాలలో డప్పు, జమిడిక, పంబ, శ తి, కిన్నెర, ఢంకా, మద్దెల, హార్మోనియం, తాళాలు, కొమ్ము, జేగంట, రుంజ, ఏకతరా, బుర్ర, తోలుతిత్తి లాంటివి ముఖ్యమైనవి.
డప్పు లపై సందర్భాన్ని బట్టి వేసే దరువులు ఉంటాయి. జమిడిక పై చిలకల పోట్లాట తమకు టముకు, దుడ్డు లాంటి దరువులు; కిన్నెర పై సప్తస్వరాలు, పంచభూతాల హెచ్చుతగ్గులు రాగాలు ఉంటాయి. కొమ్ము వాయిద్యానికి శృతిగా తోలు తిత్తి బ్యాగ్‌ పై పర్‌ గా ఉపయోగించడం ప్రత్యేకం. కథాగమనం బట్టి డోలు వాయిద్యం పాత్ర ఉంటుంది.
పునరుజ్జీవనానికి ఎదురుదెబ్బ 
ఈనాడు తెలుగు రాష్ట్రాలలో ప్రధానంగా గిరిజన తెగల కళల పట్ల, సంస్క తి పట్ల, సాహిత్యం పట్ల, ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఏర్పడడం వల్ల కొంత మేలు జరుగుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో గిరిజన కళాప్రదర్శనలు అనేక సందర్భాలలో చోటుచేసుకుంటు న్నాయి. గిరిజన కళాకారులను వారి వారి ప్రతిభను అనుసరించి సహకరిస్తూ ప్రసార, ప్రచార మాధ్యమాల ద్వారా వారి కళారూపాలను బాహ్య ప్రపంచానికి తెలియజేయడమే కాక, కనుమరుగవు తున్న ఆదివాసీ కొత్త తరానికి చెందిన యువకులకూ తెలియజేయడం ఇటీవల కాలంలో ఊపందుకున్నది. ఈ పునరుజ్జీవన కార్యకలా పాలకు అడవి నుంచి ఆదివాసీలను వేరుచేయడం పెద్ద విఘాతాన్ని కలిగిస్తుంది.
మట్టి గాని, చెక్కలుగాని ఉపయోగించి అమోఘమైన సంగీత వాయిద్యాలు ఇప్పటికి ఉపయోగిస్తూ, వాటిని తయారు చేస్తూ, ప్రత్యేకంగా ప్రదర్శనలిస్తూ తమ ఉనికిని చాటుకున్న గిరిజన తెగలు చాలా ఉన్నాయి. ప్రధానంగా కోయ, బంజారా, నాయక్‌ పోడు, ఎరుకల, కొల్లాం, తోటి, పర్దన్‌, చెంచులు, అంద్‌ తెగలవారు పండుగ పబ్బాల్లో, జాతరల్లో ప్రదర్శించే నృత్యానికి అనుగుణ మైన వేషధారణ, ఇండ్ల లోపలి భాగంలో వారు చేసే అలంకరణ, ఆభరణాలు, ఉపయోగించే వంట సామాగ్రి మొదలైనవి వారి
సంస్కృతికి ప్రతీకలు. 
మరి ఈ ప్రతీకలు ఏం కానున్నాయి. పాలకుల కన్ను అడవిమీద పడింది. అడవుల నుంచి ఆదివాసీలను వేరుచేస్తే అడవితో ముడివడిన వారిజీవన సౌధం కుప్పకూటిపోదా?

 

(Courtacy Nava Telangana)