– ఆదివాసీ గ్రామసభలపై అజమాయిషీ
– ‘పెసా’ గ్రామసభలకు ‘కోరం’తో చెక్‌
– మార్గదర్శక సూత్రాల్లో మార్పు
– విస్తతాభిప్రాయానికి తావు లేకుండా నిబంధనలు జారీ
– కలకలం సృష్టిస్తున్న జీఓ నంబర్‌ 54కొండూరి రమేశ్‌బాబు
ఏజెన్సీ ప్రాంత గ్రామసభలపై ఇక రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం చెలాయించబోతున్నది. ఆదివాసీల స్వయం పాలనాధికారాన్ని, సంస్కతీ సాంప్రదాయాలను కాపాడటం కోసం అమల్లోకి వచ్చిన ‘పెసా’ చట్టాన్ని నీరు కారుస్తూ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. గిరిజన ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు, ఇసుక తదితర చిన్న తరహా ఖనిజాల తవ్వకం, భూసేకరణ చేపట్టాలంటే పెసా చట్టం ప్రకారం గ్రామసభల అనుమతి అవసరం. తమకు ఇష్టం లేని ప్రతిపాదనలను గ్రామసభల ముందుంచినప్పుడు ఆ గ్రామసభలకు ఆదివాసీలు హాజరు కావటం లేదు. ఫలితంగా ‘కోరం’ చాలక ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే అవి వాయిదా పడుతున్నాయి. దీనితో కోరం నిబంధనల్ని మార్చాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివాసీల హాజరు సంఖ్యను (కోరం) తగ్గిస్తూ పంచాయితీరాజ్‌ శాఖ ఇటీవల జీఓ నంబర్‌ 54 ను విడుదల చేసింది. దీనితో ఆదివాసీల విస్తతాభిప్రాయం తీసుకోకుండానే తీర్మానాలు ఆమోదించుకునే వెసులుబాటు ప్రభుత్వానికి సంక్రమించింది. గ్రామసభల నిర్వహణ కోసం 2011 లో జీవో నంబర్‌ 66 ద్వారా రూపొందించిన మార్గదర్శక సూత్రాల ప్రకారం ఆదివాసీ గ్రామాల్లో మొత్తం ఓటర్లలో మూడవ వంతు మంది హాజరైతేనే గ్రామసభలకు కోరం పూర్తయినట్టని పేర్కొన్నది. మద్యం, ఇసుక తవ్వకాల వంటి ప్రతిపాదనల కోసం గ్రామసభలు సమావేశ పరచినప్పుడు ఎక్కువ మంది ఆదివాసీలు ఈ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. దీనితో కీలక నిర్ణయాలు వాయిదా పడుతున్నాయి. ఫలితంగా రాష్ట్ర ఖజానాకు ఆదాయం రావటం లేదని కొందరు ఉన్నతాధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. దీనితో గత సంవత్సరం అమల్లోకి తెచ్చిన కొత్త పంచాయితీరాజ్‌ చట్టంలో కీలక మార్పులు తీసుకు రావాలని, ఏజెన్సీ ప్రాంతాలకు వర్తించే కొన్ని కీలక నిబంధనలను సడలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కోరం నిబంధలను మారుస్తూ జీఓ జారీ….
2018 పంచాయితీరాజ్‌ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ‘పెసా’ గ్రామసభల మార్గదర్శక సూత్రాల్లో కీలక మార్పులు తెస్తూ పంచాయితీరాజ్‌ శాఖ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు జీఓ నంబర్‌ 54 ను ఇటీవల విడుదల చేసింది. ఈ జీఓ ప్రకారం ఏజెన్సీ గ్రామసభలకు అంతకు ముందున్న మూడవ వంతు హాజరు నిబంధనను సడలించింది. 5 వేల నుంచి 10 వేల మంది ఓటర్లు ఉన్న గ్రామంలో గ్రామసభకు 300 మంది ఆదివాసీలు హాజరైతే కోరం పూర్తయినట్టే. పది వేల కంటే ఎక్కువమంది ఉన్న గ్రామంలో కేవలం 400 ఆదివాసీలు హాజరైతే కోరం పూర్తవుతుంది. అంతకు ముందున్న నిబంధన ప్రకారం పదివేల మంది ఓటర్లుండే గ్రామంలో మూడవ వంతు 3,300 మంది హాజరైతేనే కోరం పూర్తయ్యేది. తాజా నిబంధనల ప్రకారం కేవలం మూడు నుంచి నాలుగు శాతం మంది హాజరైతే గ్రామసభను నడిపించే వెసులుబాటు కలిగింది. ఆదివాసీల విస్త్రుత అభిప్రాయం సేకరించకుండా కేవలం నామ మాత్రంగా గ్రామసభలను నిర్వహించటానికే ప్రభుత్వం ఈ నిబంధన అమల్లోకి తెచ్చింది. కొత్త నిబంధనలతో తమకు అనుకూలమైన కొంత మందితో గ్రామసభలు నిర్వహించుకుని ఆదివాసీ వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నదని ఆదివాసీ సంఘాలు అంటున్నాయి. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా 10 శాతం కన్నా తక్కువ మంది హాజరయ్యే కోరం నిబంధనలు లేక పోవటం విశేషం.
గిరిజన సలహా మండలికి సమాచారం లేకుండానే…
ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి ఎటువంటి కీలక నిర్ణయం తీసుకోవాలన్నా గిరిజన ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉండే గిరిజన సలహామండలి (టీఏసీ)ని సంప్రదించాల్సి ఉంటుంది. ఆదివాసీల సాధికారితకు సంబంధించి అతి ముఖ్యమైన ‘పెసా’ నిబంధనల మార్పు విషయంలో ప్రభుత్వం ఈ నిబంధన కూడా పట్టించుకోలేదు. ఈ నెలఖారులో జరిగే టీఏసీ సమావేశంలో ఈ అంశం చర్చకు రానున్నది.
గవర్నర్‌కు ఫైల్‌ పంపకుండానే..

రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూలులో ఉన్న గిరిజన ప్రాంతానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలంటే రాష్ట్ర గవర్నర్‌ అనుమతి తీసుకోవాల్సి ఉంది. ‘పెసా’ నిబంధనల మార్పుకు సంబంధించిన ఫైల్‌ను గవర్నక్‌కు పంపలేదని అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ విషయాన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకు వెళ్లాలని కొన్ని గిరిజన సంఘాలు నిర్ణయించాయి.
సోమేశ్‌కుమార్‌ లేఖతో …
ఏజెన్సీ ప్రాంతంలో మద్యం దుకాణాలు తెరవటానికి గ్రామ సభల ఆమోదం పొందాలంటే ‘కోరం’ నిబంధన ప్రతిబంధకంగా ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆబ్కారీ కమిషనర్‌ హౌదాలో ఇటీవల లేఖ రాశారు. ఈ లేఖపై గిరిజన సంక్షేమ శాఖ అభిప్రాయం తెలుసుకోకుండానే పంచాయితీరాజ్‌ శాఖ కొత్త జీఓను జారీ చేయటం సంచలనం కలిగించింది. కోరం నిబంధనలు మార్చటంతో కేవలం మద్యం దుకాణాలకే కాకుండా ఇసుక తవ్వకాలు, భూసేకరణ వంటి కీలక నిర్ణయాలు ఇకపై సులభంగా తీసుకోవచ్చని ప్రభత్వం అభిప్రాయపడు తున్నది. మాఊర్లో మారాజ్యం పేరుతో ఆదివాసీలు చేసిన సుదీర్ఘ పోరాటం తర్వాత దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ‘పెసా’ చట్టానికి ఇక రాష్ట్రంలో తూట్టు పొడిచినట్టేనని ఒక సీనియర్‌ అధికారి వ్యాఖ్యానించారు.
54 జీవో ప్రకారం
గ్రామసభల కోరం ఈ విధంగా…
ఓటర్ల సంఖ్య కోరం
500 వరకు 50 మంది
501- 1,000 75 ”
1,001- 3,000 150 ”
3,001- 5,000 200 ”
5,001- 10,000 300 ”
10,000 కంటే ఎక్కువ మంది 400

Courtesy Navatelangana…