గన్‌తో తలకు గురిపెట్టి కాల్చుకుని మృతి.. భార్యతో జరిగిన గొడవే కారణమా?
కొడుకుతో మాట్లాడాలని రాత్రి 2 గంటలకు భార్యకు ఫోన్‌ 
కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

జవహర్‌నగర్‌, మార్చి 9: ఇద్దరూ డాక్టర్లు.. ప్రేమ వివాహం చేసుకున్నారు! సొంత ఆస్పత్రి ఉంది!! వారి అన్యోన్యమైన దాంపత్యానికి గుర్తుగా పదేళ్ల బాబు ఉన్నాడు. అన్నీ ఉన్నా.. అందరి జీవితాల్లో లాగే వారి జీవితంలో చిన్న చిన్న మనస్పర్థలు వచ్చాయి. భర్త మీద కోపంతో భార్య పుట్టింటికి వెళ్లిపోతే.. భార్య మీద కోపంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు! తన లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌తో తలకు గురిపెట్టుకుని.. పాయింట్‌ బ్లాంక్‌ రేంజిలో కాల్చుకుని ఉసురుతీసుకున్నాడు. హైదరాబాద్‌ కాప్రా పరిధిలో ఆదివారం రాత్రి జరిగిన విషాదమిది. బలవన్మరణానికి పాల్పడిన ఆ వ్యక్తి.. దమ్మాయిగూడలోని శ్రీఆదిత్య హాస్పటల్స్‌ ఎండీ డాక్టర్‌ రవీంద్రకుమార్‌. సిద్దిపేటకు చెందిన డాక్టర్‌ రవీంద్రకుమార్‌ (42) ఆయన భార్య స్మిత(36)ది ప్రేమ పెళ్లి.

వారికి కుమారుడు ఆదిత్య (10) ఉన్నాడు. దంపతులు కాప్రా పరిధిలోని సాకేత్‌లో ఒక విల్లాలో ఉంటున్నారు. దమ్మాయిగూడలో తమ కుమారుడి పేరిట నిర్మించిన శ్రీ ఆదిత్య ఆస్పత్రిలో స్మిత గైనకాలజిస్టుగా సేవలందిస్తుండగా.. రవీంద్రకుమార్‌ ఎండీగా కొనసాగుతూ, మత్తు డాక్టర్‌గా సేవలందిస్తున్నారు. సోమవారం ఉదయం ఆస్పత్రిలో పలు ఆపరేషన్‌లు చేయాల్సి ఉండడంతో అనస్తీషియా ఇవ్వడం కోసం డాక్టర్‌ రవీంద్ర కుమార్‌కు ఆస్పత్రి సిబ్బంది ఫోన్‌చేశారు. అయన నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆస్పత్రిలో పనిచేస్తున్న స్వప్న అనే ఉద్యోగి.. డాక్టర్‌ ఇంటికి వెళ్లారు. అక్కడ తన పడగ్గదిలో మంచంపై రక్తపుమడుగులో పడి ఉన్న రవీంద్రకుమార్‌ను చూసిన స్వప్న వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్ట్‌మార్టమ్‌ నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. రవీంద్రకుమార్‌ భార్య స్మిత స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేశారు.

అసలేం జరిగింది?
విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. ఆదివారంనాడు తన సోదరుడి ఇంట్లో శుభకార్యానికి వెళ్దామని డాక్టర్‌ రవీంద్రకుమార్‌ తన భార్యతో చెప్పారు. తనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పిన ఆమె.. ఆయన్ను ఒక్కరినే వెళ్లి రావాల్సిందిగా సూచించారు. రవీంద్రకుమార్‌ ఆ కార్యక్రమానికి వెళ్లొచ్చిన తర్వాత భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. మాటా మాటా పెరగడంతో ఆగ్రహించిన స్మిత.. అర్ధరాత్రి సమయంలో తన కుమారుణ్ని తీసుకుని అదే కాలనీలో ఉన్న మరో వైద్యురాలి ఇంటికి వెళ్లారు. తాను పుట్టింటికి వెళ్లాలని, క్యాబ్‌ బుక్‌చేయాలని కోరారు. రాత్రివేళ క్యాబ్‌లో వెళ్లవద్దని, ఏదైనా ఉంటే తరువాత మాట్లాడుదాం అని స్మితను వారించినా వినకపోవడంతో.. ఆ వైద్యురాలు తన కారులోనే స్మితను దిల్‌సుక్‌నగర్‌లో ఉంటున్న ఆమె తల్లిదండ్రుల ఇంటి వద్ద దింపేసి వచ్చారు. అదే రాత్రి రెండు గంటల సమయంలో డాక్టర్‌ రవీందర్‌ తన కొడుకుతో మాట్లాడాలంటూ భార్యకు  ఫోన్‌చేశారు. కొడుకుతో మాట్లాడిన అనంతరం తన లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.

మావోయిస్టుల బెదిరింపులతో గన్‌
డాక్టర్‌ రవీంద్రకుమార్‌ను.. 2016లో మావోయిస్టుల పేరుతో కొందరు బెదిరించారు. దాంతో ఆయన రివాల్వర్‌ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకుని అనుమతి పొందారు. ఇప్పుడు అదే రివాల్వర్‌తో కాల్చుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.

Courtesy Andhrajyothi