• చిన్నారులపై హాస్టల్‌ వార్డెన్ల లైంగిక వేధింపులు
  • ఇద్దరికి తల్లిదండ్రుల దేహశుద్ధి
ఉట్నూర్‌/తాండూరు/యాలాల: వాళ్లిద్దరూ వేర్వేరు పాఠశాలలకు చెందిన హాస్టల్‌ వార్డెన్లు. తల్లిదండ్రులకు దూరంగా ఉన్న పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన వాళ్లే, చిన్నారులను లైంగికంగా వేధించడం మొదలుపెట్టారు. మాట వినని చిన్నారులను హింసించారు. దీంతో చిన్నారుల తల్లిదండ్రులు గురువారం ఆ వార్డెన్లకు దేహశుద్ధి చేశారు. లింగన్న ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాల హాస్టల్‌ వార్డెన్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నాడు. మాట వినని చిన్నారులను అగరువత్తులతో కాల్చాడు. ఈ విషయమై విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పగా వారు లింగన్నకు దేహశుద్ధి చేశారు. పోలీసులు లింగన్నను అదుపులోకి తీసుకొని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వికారాబాద్‌లో ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన ఇద్దరు మైనర్‌ బాలురపై హాస్టల్‌ వార్డెన్‌ దశరథ్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. హాస్టల్‌ నుంచి బయటపడిన విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు నిందితున్ని అక్కడే చితకబాది యాలాల పోలీసులకు అప్పగించారు.
బాలికను గర్భవతిని చేసిన ఏఎన్‌ఎం భర్త
మహబూబాబాద్‌ క్రైం/వనపర్తి: కస్తూర్బాగాంధీ ఆశ్రమ పాఠశాలలో ఏఎన్‌ఎంగా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ భర్త, అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికకు మాయమాటలు చెప్పి మోసం చేశాడు. పలుమార్లు ఇంటికి పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చింది. నిందితుడిని మహబూబాబాద్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బ్రాహ్మణపల్లిలోని కస్తూర్భా పాఠశాలలో విద్యార్థినిపై ఏఎన్‌ఎం రాధ భర్త సోలెం సాగర్‌ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. విద్యార్థిని శరీరంలో మార్పులు గమనించిన టీచర్‌ ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. కాగా, వనపర్తి జిల్లా పెబ్బేరులో మధ్యాహ్న భోజన విరామంలో స్కూలు వద్ద ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలికపై రవి అనే యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక ఏడుస్తూ బయటకు పరుగెత్తడంతో గ్రామస్థులు రవిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
Courtesy Andhara jyothy..