మోదీ సర్కారుకు కాంగ్రెస్‌ డిమాండ్‌

లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో వివిధ నగరాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి స్వంత ఊళ్లకు తరలించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేసింది.

న్యూఢిల్లీ: కోవిడ్‌ నివారణ చర్యలో భాగంగా ముందు వెనుక ఆలోచించకుండా మోదీ సర్కారు లాక్‌డౌన్‌ విధించడంతో వలస కార్మికులు, రోజువారి కూలీలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది. లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో వివిధ నగరాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి స్వంత ఊళ్లకు తరలించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేసింది. దీనికి అవసరమైన ఏర్పాట్లు వెంటనే చేయాలని కోరుతూ కాంగ్రెస్‌ లోక్‌సభ పక్షనేత అధిర్‌ రంజన్‌ చౌధురి గురువారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. వలస కార్మికులను వారి సొంతూళ్ల పంపించాలని లేదా తమ కార్మికులను తీసుకెళ్లేందుకు ఆయా రాష్ట్రాలు ఏర్పాటు చేసిన కేంద్రాలకు వద్దకు వారిని చేర్చాలని విజ్ఞప్తి చేశారు.

ఎటువంటి ముందస్తు సంకేతాలు లేకుండా లాక్‌డౌన్‌ విధించడంతో వలస కార్మికులు చిక్కుకుపోయారని తెలిపారు. తిండి, బట్ట, గూడు లేక అల్లాడుతున్నారని, వారికి వైద్యం కూడా అందడం లేదని ప్రధానికి దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుని వలస కార్మికులను వారి సొంత ఊళ్లకు తరలించాలని డిమాండ్‌ చేశారు. వలస కార్మికులను తరలించేందుకు అవసరమైతే ‘కోవిడ్‌ నివారణ రైళ్ల’ను వినియోగించాలని సూచించారు. వలస కార్మికుల మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని, ప్రధాని సానుకూలంగా స్పందించాలని కోరారు. కాంగ్రస్‌ పార్టీ లేఖపై మోదీ సర్కారు ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.