దీపికా పదుకొనే

బాహ్య సౌందర్యం కన్నా అంతఃసౌందర్యం ప్రధానం అంటారు కానీ వాస్తవంలో బాహ్య సౌందర్యాన్ని దాటుకుని ముందుకు వెళ్లలేరు. మరీ ముఖ్యంగా యాసిడ్‌ బాధితుల విషయంలో ఈ నిజం అడుగడుగునా అనుభవానికొస్తుంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ముసుగు చాటున దాచిన నా రూపాన్ని బహిర్గతం చేయాలనుకున్నా. అలాగే చేశా. నా కథ వెండితెరకెక్కడం నేను సాధించిన విజయం’’ అంటోంది యాసిడ్‌ బాఽధితురాలు లక్ష్మీ అగర్వాల్‌! ఆమె జీవితం ఆధారంగా రూపొందిన ‘చపాక్‌’ విడుదలవుతున్న (10న) సందర్భంగా లక్ష్మి అంతరంగమిది…

నా మీద యాసిడ్‌ దాడి జరగకపోయి ఉంటే, నా జీవిత లక్ష్యం ఒక రూపు దిద్దుకుని ఉండేది కాదేమో? యాసిడ్‌ దాడి బాధితులకు సహాయపడడం, వారికి ఉద్యోగాలు కల్పించి, గౌరవమైన జీవితం గడిపేలా చేయడం కోసమే నా మీద ఆ దాడి జరిగిందేమో అనిపిస్తుంది. నిజానికి దాడి జరిగిన తొలి రోజుల్లో బాగా కుంగిపోయాను. సామాన్యులకే వేధింపులు తప్పని ఈ సమాజంలో నాలాంటి వాళ్ల పరిస్థితి గురించి ప్రత్యేకించి చెప్పాలా? దాడి జరిగిన రెండు నెలల వరకూ నా ముఖాన్ని నేను అద్దంలో చూసుకోలేకపోయాను. కొన్ని నెలల పాటు దుస్తులు వేసుకోవడమూ కష్టమైంది. ఏడేళ్లలో ఏడు సర్జరీలు జరిగాయి. దాదాపు రూ.20 లక్షలు ఖర్చయ్యాయి. ఓ సందర్భంలో ఆత్మహత్యకూ ప్రయత్నించా. ఇంతలా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా కుంగదీసిన ఆ దాడిని తలుచుకుంటూ ముసుగు మాటునే దాక్కుంటే ఏం ప్రయోజనం? దానిలో నా ప్రమేయం ఏమాత్రం లేనప్పుడు నా మీద నేను జాలి పడుతూ కూర్చోవడం అనవసరం అనిపించింది.

ముసుగు తీయకపోతే ఎలా?
ఓ రోజు అద్దంలో నన్ను నేను చూసుకున్నాను. ఇలా ముఖాన్ని ముసుగుతో కప్పేస్తే బ్యూటీ, టైలరింగ్‌ కోర్సులు చదివీ ఏం ఉపయోగం? అనిపించింది. అయినా దీనిలో సిగ్గుపడాల్సింది ఏముందనిపించింది. అంతే… ముఖం మీద దుపట్టా లేకుండానే ఇంట్లో నుంచి బయటకు రావడం మొదలెట్టాను. అలా మొదలైంది నా కొత్త ప్రయాణం. ఢిల్లీలోని ‘నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌’లో వొకేషనల్‌ ట్రైనింగ్‌లో డిప్లొమా చేశాను. యాసిడ్‌ ఎటాక్‌ ఉద్యమంలో భాగస్వామిని అయ్యాను. ‘చన్నవ్‌’ ఫౌండేషన్‌తో కలిసి, దేశంలో యాసిడ్‌ దాడులకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టాను. ఆ క్రమంలో ఎంతోమంది యాసిడ్‌ బాఽధితులను కలిశాను. వారికి అవసరమైన వైద్యం, న్యాయపరమైన సహాయం, పునరావాసం కల్పించాను. ఆగ్రాలో పూర్తిగా యాసిడ్‌ బాధితులతో ‘షీరోస్‌’ అనే కెఫేను నడిపాను. ఉద్యోగం అనేది యాసిడ్‌ బాధితుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు వారి కుటుంబానికి జీవనోపాధి దక్కుతుంది. అయితే ఎంత చేసినా యాసిడ్‌ బాధితులకు ఇంకా చేయాల్సింది మిగిలే ఉంటుంది.

చపాక్‌’తో అర్థ విజయం!
నా కథ సినిమాగా రూపొందుతోందనీ, నా పాత్రలో దీపికా పదుకొనే నటిస్తోందనీ తెలిసిన క్షణం యాసిడ్‌ బాఽధితులకు అండగా సమాజంతో చేస్తున్న యుద్ధంలో సగం విజయం సాధించేశానని అనిపించింది. ఈ సినిమా ద్వారా యాసిడ్‌ బాధితుల బాధలు ప్రపంచానికి తెలియచెప్పే ప్రయత్నం చేసిన దర్శకురాలు మేఘనా గుల్జార్‌, దీపికకు రుణపడి ఉంటాను. 2016లో మేఘనను కలిశాను. ఆమె తన వంతుగా ఏదైనా సహాయం చేయాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. 2013కు ముందు వరకూ ఎవరికీ యాసిడ్‌ దాడుల గురించి అంతగా తెలియదు. ఎప్పుడైతే నేను బయటకు వచ్చి, గొంతు విప్పి మాట్లాడడం మొదలుపెట్టానో, అప్పటి నుంచి నాలాంటి వాళ్లు ఒక్కొక్కరుగా తమ స్వరం వినిపిస్తున్నారు. మా అందరి గొంతుల ఫలితమే ఈ సినిమా! ఈ సినిమా సమాజం మీద పెద్ద ప్రభావం చూపిస్తుందనే నమ్మకం నాకుంది. అందం ప్రధానం కాదు అని సినిమా ద్వారా గొప్ప సందేశం ఇవ్వడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. ఈ సినిమాతో ప్రజల మనసుల్లో బాధితుల పట్ల ఉన్న ప్రతికూల భావనల యాసిడ్లు బయటకు వెళ్లిపోతాయని భావిస్తున్నా.’’

ఈ సినిమా నాకు ప్రత్యేకం!
కళాకారుల వృత్తిజీవితంలో అత్యంత అరుదుగా ఎదురయ్యే సందర్భం.. కథతో ఎమోషనల్‌గా కనెక్ట్‌ కావడం. ‘చపాక్‌’ కథ విన్నప్పుడు నాకు అలాగే అనిపించింది. ‘చపాక్‌’ కథ వినడం మొదలుపెట్టిన కొన్ని క్షణాల్లోనే దీనిలో నటించాలని నిశ్చయించుకున్నా. ఇది నా సినీ జీవితంలో ఎంతో ప్రత్యేకమైన చిత్రం. ఈ సినిమా ప్రభావం మనందరి మీదా పడుతుంది. ఈ విషయం సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ అర్థం అవుతుంది.