• రామగుండం ఓపెన్‌కాస్ట్‌లో పేలుడు
  • నలుగురు కాంట్రాక్టు కార్మికుల మృతి
  • మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
  • మానవ తప్పిదమే కారణమా?
  • ఘటనపై విచారణకు సీపీ ఆదేశం
  • ఓసీపీల్లో ఇదే మొదటి ప్రమాదం

పెద్దపల్లి/రామగిరి/హైదరాబాద్‌ : సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ బొగ్గు గనిలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. రామ గుండం డివిజన్‌ పరిధిలోని ఓసీపీ-1లో మందుగుండు పేలి.. నలుగురు కాంట్రాక్టు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బొగ్గు వెలికితీతకు బండరాళ్లు, మట్టి పెళ్లలను తొలగించేందుకు పేలుడు పదార్థాలను వినియోగించే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లో విస్తరించిన సింగరేణి ఓసీపీ-1 గనిలో మంగళవారం పేలుళ్ల కోసం 80 రంధ్రాలు తవ్వి అందులో మందుగుండు సామగ్రితోపాటు డిటోనేటర్లు అమర్చేందుకు కార్మికులు పను లు ప్రారంభించారు. ఉదయం 10:25 గంటల వరకు 32 రంధ్రాలు పూర్తి కాగా, 33వ రంధ్రం తవ్వి అందులో వాహనంతో స్లరీ ఎక్స్‌ప్లోజివ్‌ నింపిన తర్వాత డిటోనేటర్‌ అమరుస్తుండగా.. ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో గోదావరిఖనికి చెందిన బండారి ప్రవీణ్‌కుమార్‌(38), కమాన్‌పూర్‌కు చెందిన బిల్ల రాజేశం(42), బండారి అంజయ్య(41), మహారాష్ట్ర మర్కొండకు చెందిన ఎస్‌.రమేష్‌(28) అక్కడిక్కడే మృతి చెందారు.

పేలుడు ధాటికి వారి శరీరాలు తునాతునకలై చెల్లాచెదురుగా పడిపోయాయి. కమాన్‌పూర్‌ మండలం జూలపల్లికి చెందిన బండి శంకర్‌, శాలపల్లికి చెందిన కుందారపు వెంకటేశం, అదే మండలానికి చెందిన భీమయ్య తీవ్రంగా గాయపడగా వారిని గోదావరిఖనిలోని సింగరేణి సంస్థ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి, గాయపడ్డవారికి రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఐఎన్‌టీయూసీ, బీఎంఎస్‌, హెచ్‌ఎంఎస్‌, ఏఐటీయూసీ, సీఐటీయూ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఆస్పత్రిని ఎంపీ వెంకటే్‌షనేత, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు, ఎమ్మెల్యే చందర్‌, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు సందర్శించారు.

మానవ తప్పిదం వల్లే!
ఓసీపీ-1 ఫేజ్‌-2లో పేలుడు.. మానవ తప్పిదం వల్లనే జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న పెద్ద బండరాయికి గతంలో బ్లాస్టింగ్‌ హోల్స్‌ వేసి నాన్‌ఎల్సీ డిటోనేటర్‌తో లిక్విడ్‌ను నింపి ఉంచినట్లు తెలిసింది. మంగళవారం అదే బండరాయికి మరో రంధ్రం చేసి డిటోనేటర్‌ను అమర్చే క్రమంలో అధిక ఒత్తిడి కారణంగా భారీ విస్ఫోటనం సంభవించినట్లు భావిస్తున్నారు. కాగా, ఓసీపీ-1లో పేలుళ్లకు సంబంధించి కాంట్రాక్టును మహాలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థకు సింగరేణి సంస్థ అప్పగించింది. మృతులు, క్షతగాత్రులంతా ఈ సంస్థలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని రామగుండం సీపీ సత్యనారాయణ సందర్శించి వివరాలను తెలుసుకున్నారు. పెద్దపల్లి డీసీపీని విచారణాధికారిగా నియమించారు. ఓసీపీ గనుల్లో ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు.

పరిహారం ఇవ్వాలి: పవన్‌ కల్యాణ్‌
రామగుండంలోని ఓపెన్‌ కాస్ట్‌ బొగ్గు గనిలో సంభవించిన పేలుడు ప్రమాదం దురదృష్టకరమని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మృతి చెందినవారికి రెగ్యులర్‌ కార్మికులకు ఇచ్చినట్లుగానే నష్టపరిహారం చెల్లించాలని ఒక ప్రకటనలో సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా, మృతి చెందినవారి కుటుంబాలకు రూ.కోటి, గాయపడిన వారికి రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సీపీఐ, సీపీఎం కార్యదర్శులు చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని డిమాండ్‌ చేశారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కరాములు, ప్రధాన కార్యదర్శి సాయిబాబు, ఏఐటీయూసీ నేత వీఎస్‌ బోస్‌ డిమాండ్‌ చేశారు.

Courtesy Andhrajyothi