– మూడు చోట్ల 20 ప్రత్యేక బృందాలతో సోదాలు
– రూ.30 కోట్ల మేర ఆస్తుల గుర్తింపు?
– కానిస్టేబుల్‌ సాంబారెడ్డి ఇంట్లోనూ తనిఖీలు

సిద్దిపేట: అవినీతి ఆరోపణల నేపథ్యంలో సిద్దిపేట అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. నర్సింహారెడ్డి మూడేండ్లుగా సిద్దిపేటలోనే విధులు నిర్వర్తిస్తు న్నాడు. మొదట ఏసీపీగా వచ్చిన నర్సింహారెడ్డి 13 నెలల తర్వాత అదనపు డీసీపీగా
ఉద్యోగోన్నతి పొందారు. ఏసీబీ ఎస్పీ అనూష, డీఎస్పీ భద్రయ్య, ముగ్గురు సీఐలు, ఇతర సిబ్బంది నర్సింహారెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. డీసీపీకి సంబంధించిన సిద్దిపేట, హైదరాబాద్‌ షేక్‌పేట్‌, కామారెడ్డిలోని నివాసాలతో పాటు బంధువుల నివాసాల్లో ఒకేసారి 20 ప్రత్యేక బృందాలతో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు రూ.30కోట్ల మేర ఆస్తులు ఉన్నట్టు గుర్తించినట్టు సమాచారం. నర్సింహారెడ్డి బంధువుల ఇండ్లలోనూ మొత్తం 10చోట్ల నిర్వహించిన దాడుల్లో వంద ఎకరాల భూపత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఒక విల్లా, బ్యాంకు లాకర్‌ ఉన్నట్టు గుర్తించారు. సిద్దిపేట వన్‌టౌన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ కానిస్టేబుల్‌ సాంబారెడ్డి ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కానిస్టేబుల్‌కు అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్టు గుర్తించినట్టు తెలుస్తోంది.

Courtesy Nava telangana