• కార్మిక శాఖ డైరెక్టర్‌ ఇంట్లో సోదాలు
  • మరో 16 మంది ఉద్యోగుల ఇళ్లలోనూ
  • ఏకకాలంలో 23 చోట్ల ఏసీబీ దాడులు
  • డైరెక్టర్‌ సహా 21 మందిపై కేసులు
  • పలువురి అరెస్టుకు రంగం సిద్ధం
  • రాష్ట్ర ఖజానాకు పది కోట్ల నష్టం

హౖదరాబాద్‌ : తెలంగాణ కార్మిక శాఖ పరిధిలోని వైద్య బీమా సేవల విభాగం ఈఎ్‌సఐకి మందులు సరఫరా చేసే విషయంలో భారీ కుంభకోణం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల నుంచి మందులు కొనడం, అసలు కొనకుండానే కొని, ఆస్పత్రులకు సరఫరా చేసినట్లు బిల్లులు సృష్టించడం లాంటి చర్యలతో రాష్ట్ర ఖజానాకు కనీసం పది కోట్ల రూపాయలకు పైగా నష్టం కలిగించినట్లు అవినీతి నిరోధక శాఖ దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో 17 మంది ప్రభుత్వ ఉద్యోగులు, నలుగురు ప్రైవేటు వ్యక్తులపై ఏసీబీ అవినీతి నిరోధక చట్టం వివిధ సెక్షన్ల కేసులు నమోదు చేసింది. గత ఏడాది జరిగిన కుంభకోణంలో భాగస్వాములైన వైద్య బీమా సేవల డైరెక్టర్‌ డాక్టర్‌ సీహెచ్‌ దేవికారాణి, జాయింట్‌ డైరెక్టర్‌ కె.పద్మ సహా మొత్తం 21 మంది ఇళ్లు, కార్యాలయాల్లో గురువారం పెద్ద ఎత్తున సోదాలు జరిపింది.

హైదరాబాద్‌, వరంగల్‌లో 23 చోట్ల సోదాలు జరిగాయి. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన సోదాల్లో పలు కీలక పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఐఎంఎస్‌ విభాగంలో అవినీతి, అవకతవకలపై విజిలెన్స్‌ విభాగం నుంచి సమాచారం అందిన వెంటనే నిజం నిగ్గు తేల్చాలని ప్రభుత్వం ఏసీబీని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ వైద్య బీమా సేవల విభాగం డైరెక్టర్‌తో పాటు మరికొందరు వ్యక్తులు కలిసి నకిలీ ఇండెంట్లు తయారు చేసి ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టినట్లు గుర్తించింది. రికార్డులను తారుమారు చేయడం, మందులు, సర్జికల్‌ కిట్ల కొనుగోలు సమయంలో రూల్స్‌ను అతిక్రమించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు గండికొట్టినట్లు గమనించింది. త్వరలోనే ఈ కేసుల్లో పలువుర్ని అరెస్ట్‌ చేసేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేస్తోంది. వారి బ్యాంకు ఖాతాలు, నగదు లావాదేవీలతో పాటు స్థిర, చర ఆస్తులు, గత నాలుగేళ్లుగా వారి ఖర్చుల పైనా ఏసీబీ దృష్టి సారించింది.

వివాదాస్పద లావాదేవీలు

జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.పద్మ రూ.1.03 కోట్ల మందులకు సంబంధించి నకిలీ ఇండెంట్లను గత ఏడాది మేలో తయారు చేసి, బిల్లులు క్లైమ్‌ చేశారు. పటాన్‌చెరువు, బోరబండ ఈఎ్‌సఐ డిస్పెన్సరీల పేరుతో బిల్లులు తీసుకున్నారు. విచారణ జరపకుండానే డైరెక్టర్‌ డాక్టర్‌ దేవికారాణి బిల్లులు మంజూరు చేశారు. జాయింట్‌ డైరెక్టర్‌ కె.పద్మ… బొల్లారం, బొంతపల్లి డిస్పెన్సరీలకు మందులు పంపకుండానే రూ. 1.22 కోట్ల ఇండెంట్‌ తీసుకున్నారు. డైరెక్టర్‌ దేవికా రాణి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కె.వసంత ఇందిర, ఇతరులు కలిసి రూ.9.43 కోట్ల నష్టం కలిగించారని ఏసీబీ తేల్చింది. దేవికారాణి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వసంత ఇందిర కలిసి నిరుడు ఆగస్టులో 286 కొనుగోలు ఆర్డర్లు చూపించారు.

ప్రైవేటు వ్యక్తులు

ఓమ్ని మెడి సంస్థ ఎండీ శ్రీహరి, ఓమ్ని ప్రతినిధి సీహెచ్‌ శివ నాగరాజు, తేజా ఫార్మా ఏజెంట్‌ బి.సుధాకర్‌రెడ్డి, ఓ టీవీ ఛానల్‌ రిపోర్టర్‌(ఏబీఎన్‌ కాదు) కె.నరేందర్‌ అలియాస్‌ నరేందర్‌రెడ్డి.

నిందితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు

సీహెచ్‌ దేవికారాణి- డైరెక్టర్‌, కె.పద్మ- జాయింట్‌ డైరెక్టర్‌ వరంగల్‌, వసంత ఇందిర – ఏడీ స్టోర్స్‌, ఫార్మసిస్టులు ఎం.రాధిక, జి.జ్యోత్స్న, వి.తబిత (రిటైర్డు), ఫాతిమా, వి.లావణ్య, కె.నాగలక్ష్మి, ఎం.సురేంద్రనాథ్‌ బాబు-సినియర్‌ అసిస్టెంట్‌, ఆర్‌.రాజశేఖర్‌ అలియాస్‌ రాజు- రికార్డు అసిస్టెంట్‌, వి.హర్షవర్ధన్‌-సీనియర్‌ అసిస్టెంట్‌, సత్యనారాయణ సురేశ్‌ అగర్వాల్‌-ఆఫీస్‌ సూపరింటిండెంట్‌, ఎస్‌.శ్రీనివాసరావు- ఆఫీస్‌ సూపరింటెండెంట్‌, కె.వీరన్న- ఆఫీస్‌ సూపరింటిండెంట్‌, కె. పావని-సీనియర్‌ అసిస్టెంట్‌, వరంగల్‌కు చెందిన మహ్మద్‌ గౌస్‌ పాషా.

విజిలెన్స్‌ తనిఖీల్లో బట్టబయలు

విజిలెన్స్‌.. గతంలో నిర్వహించిన విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారి నివేదిక ఆధారంగా ఏసీబీ అధికారులు ఈఎ్‌సఐ రికార్డుల్ని పరిశీలించారు. లొసుగులను బయట పెట్టారు. అవి… పెద్ద మొత్తంలో మందులు కొనుగులో చేస్తున్న సమయంలో డైరెక్టర్‌ ఎలాంటి కమిటీ వేయలేదు.  రేటు కాంట్రాక్టులోని రూల్స్‌ పాటించలేదు. ప్రీ బిడ్డింగ్‌ ప్రాసె్‌సలో బిడ్డింగ్‌లో పాల్గొనే సంస్థల్ని గుర్తించాలి. ఇందుకు కమిటీ వేయలేదు. ఒకే ఇంటి వ్యక్తులు స్వల్ప తేడాతో వేర్వేరుగా కొటేషన్లు దాఖలు చేశారు. చూడకుండా ఓకే చేశారు. టెండరుపై విస్తృత ప్రచారం కల్పించాల్సి ఉండగా, కేవలం కొన్ని సంస్థలకు సమాచారం ఇచ్చారు. అధికారిక వెబ్‌సైట్‌లోనూ టెండర్‌ ప్రస్తావన లేదు. ఎంపిక చేసిన కొన్ని సంస్థలకు ఫోన్లో సమాచారం అందించి కొటేషన్లు వేయాలని చెప్పారు. కొన్ని మందులు రేటు కాంట్రాక్టు(ఆర్‌సీ) కంటే ఎక్కువ మొత్తానికి కొన్నారు. మార్కెట్‌ ధరలతో ఏ మాత్రం బేరీజు వేసుకోకుండా ఇష్టానుసారంగా ధరలు నిర్ణయించారు. అత్యవసరం పేరుతో 305 శాతం అధిక ధరలకు మందు కొన్నారు.