కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్‌ విశ్వవిద్యాల యంలో గురువారం ఏబీవీపీ విధ్వంసం సృష్టించింది. కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో విశ్వవిద్యాలయానికి రాక సందర్భంగా ఏబీవీపీ ముసుగుతో వర్సిటీలోకి చొరబడిన బీజేపీ కార్యకర్తలు క్యాంపస్‌ ఆవరణంలో హింసాకాండకు పాల్పడ్డారు. ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయాన్ని తగులబెట్టారు.

మంత్రి సమక్షంలోనే ఇంతటి హింసాకాండకు పాల్పడటాన్ని నిరసిస్తూ వర్సిటీ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు గురువారం మధ్యాహ్నం వర్సిటీకి పెద్ద ఎత్తున భారీ భద్రతా బలగాలు, పోలీసుల నడుమ కేంద్ర మంత్రి చేరుకున్నారు. మైనార్టీల ఉద్దేశాలను తాము పట్టించుకోబోమనీ, వారిని దేశం నుంచి వెళ్లగొడతామన్న రీతిలో మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీంతో వేలాది మంది వర్సిటీ విద్యార్థులు అక్కడకు చేరుకొని ఆయనను ఘెరావ్‌ చేశారు. మూక దాడులను సమర్థించడంపై నిలదీశారు. దీంతో పోలీసులను వర్సిటీలోకి రప్పించి విద్యార్థులను చెదరగొట్టాలని విశ్వవిద్యాలయ వైఎస్‌ ఛాన్సలర్‌పై మంత్రి ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే విశ్వవిద్యాలయంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులను అనుమతించబోమనీ, తమ అనుమతి తీసుకోకుండా విశ్వవిద్యాలయంలోకి రావడం సరికాదని కేంద్ర మంత్రికే వైఎస్‌ చాన్సలర్‌ హితవు పలికారు. విద్యార్థులకు అండగా నిలిచారు. విశ్వవిద్యాలయ వాతావరణాన్ని దెబ్బతీయకుండా దయచేసి వెళ్లిపోవాలని మంత్రికి సూచించారు. ఈ విషయం తెలుసుకున్న పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ దన్‌కర్‌.. కేంద్ర మంత్రిని విడిపించేందుకు భారీ భద్రత నడుమ వర్సిటీకి చేరుకునే ప్రయత్నం చేశారు. చాన్సలర్‌ హౌదాలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేంద్ర మంత్రిని తీసుకెళ్లేందుకు యత్నించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ను కూడా విద్యార్థులు ఘెరావ్‌ చేశారు. గవర్నరు నేరుగా జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు మంత్రి బాబుల్‌ సుప్రీయా ఏబీవీపీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తాను రాజకీయాలు చేయడానికి వర్సిటీలోకి రాలేదంటూనే విద్యార్థులను ఆయన నక్సలైట్లతో పోలుస్తూ ప్రసంగించడం గమనార్హం. నాటకీయ పరిణామాల అనంతరం రాత్రి 8 గంటల సమయంలో పోలీసుల భద్రత సహాయంతో కేంద్ర మంత్రి, గవర్నర్‌ నాలుగో నెంబర్‌ గేటు నుంచి కాకుండా వేరొక గేటు నుంచి బయటకు వెళ్లిపోయారు.

సీపీఐ(ఎం)ఖండన.
జాదవ్‌ పూర్‌ యూనివర్సిటీలో గురువారం ఏబీవీపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ మూకలు సాగించిన అరాచకాన్ని మాజీ ఎంపీ, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు మహ్మద్‌ సలీం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వీసమెత్తు పాటుపడని ఇద్దరు కేంద్ర మంత్రులూ రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించడంలో మాత్రం ముందున్నారని విమర్శించారు. గతంలో మమత కేంద్ర మంత్రిగా ఉన్న కాలంలో సైతం ఇదే తీరున వ్యవహరిం చారని గుర్తు చేశారు. ఒకపక్క యూజీసీని దెబ్బతీస్తూ యూనివర్సిటీల స్వయంప్రతిపత్తిని నాశనం చేస్తున్న బీజేపీ ఇంకోపక్క యూనివర్సిటీల్లో ప్రజాస్వామిక వాతావారణాన్ని అకడమిక్‌ స్వాతంత్య్రాన్ని సైతం దెబ్బతీస్తోందని సలీం అన్నారు. ఈ ధోరణులను విద్యార్థి లోకం దేశవ్యాప్తంగా ప్రతిఘటించాలనీ, జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ మాజీ విద్యార్థిగా ఆ యూనివర్సిటీ నెలకొల్పిన ప్రజాస్వామిక ప్రమాణాలను, సంస్క ృతిని కాపాడేందుకు విద్యార్థులంతా ముందుకురావాలని కోరుతున్నానని సలీం ప్రకటించారు.

Courtesy Navatelangana…