13 ఏళ్ల క్రితం తప్పిపోయిన భవాని కథ సుఖాంతం
కన్నవారికి అప్పగించిన పెంచిన తల్లి
ఇద్దరు తల్లుల ప్రేమా కావాలన్న యువతి
విజయవాడ, న్యూస్‌టుడే: పదమూడేళ్ల కిందట కన్నవారి నుంచి తప్పిపోయిన భవాని (17) అనే యువతి కథ సుఖాంతమైంది. ఆదివారం విజయవాడలో ఆమె తల్లిదండ్రులను కలుసుకుంది. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం చీపురుపల్లి నుంచి భవాని తల్లిదండ్రులు ఆదివారం విజయవాడ వచ్చి కన్నకూతురిని అక్కున చేర్చుకున్నారు. ఇన్నాళ్లూ భవానిని పెంచిన తల్లిదండ్రులు ఆమెను కన్నవారికి అప్పగించారు. దీనికి ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆధారాలు లేకుండా తల్లిదండ్రులు అని ఎవరు పడితే వాళ్లొస్తే ఎలా అప్పగిస్తామంటూ పటమటలంకకు చెందిన పెంచిన తల్లి జయమ్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. డీఎన్‌ఏ పరీక్ష చేయించాలని, కన్నవాళ్లు అయితే అప్పగించడానికి సిద్ధమేనని అన్నారు. దీనిపై పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కన్న తల్లిదండ్రులు కె.మాధవరావు, వరలక్ష్మి, సోదరులు సంతోష్‌, గోపాల్‌, భవాని పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఏసీపీ నాగరాజు, పటమట సీఐ సురేష్‌రెడ్డిలు భవాని సహా అందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
ఇద్దరు అమ్మల దగ్గరా ఉండాలని ఉందని భవాని చెప్పింది. చిన్నప్పుడు తాను తప్పిపోతే పదమూడేళ్ల పాటు జయమ్మ సొంత కూతురిలా పెంచి, పెద్ద చేసిందని.. మరోవైపు కన్నతల్లిదండ్రులు తన కోసం ఎంతో తల్లడిల్లారని భవాని పేర్కొంది. తనకు ఇద్దరు తల్లుల ప్రేమా కావాలని, కొన్ని రోజులు వారి దగ్గర, మరికొన్ని రోజులు పెంచిన జయమ్మ దగ్గర ఉంటానని తెలిపింది. దీనికి అందరూ అంగీకరించారు. పెంచిన తల్లిదండ్రులు భవానిని కన్నతల్లిదండ్రులకు అప్పగించారు. పదమూడేళ్ల కిందట తప్పిపోయిన కూతురు తిరిగి మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందని తల్లి వరలక్ష్మి సంతోషం వ్యక్తం చేశారు. భవాని కన్నతల్లిదండ్రుల ఆచూకీ లభించినందుకు ఆనందంగా ఉన్నా, తమను వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉందని జయమ్మ చెప్పారు.
ఎలా తప్పిపోయింది?
భవాని కన్న తల్లిదండ్రులు మాధవరావు, వరలక్ష్మి.. ఇద్దరు కుమారులు, కుమార్తెతో కలిసి చాలాకాలం క్రితం పనుల కోసం హైదరాబాద్‌ వెళ్లారు. భవాని నాలుగేళ్ల వయసులో.. తన సోదరుడి వెనకాల బడికి వెళ్తూ దారి తప్పింది. తప్పిపోయిన భవాని హైదరాబాద్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ సమీపంలోని ఓ ఇంటివద్ద కూర్చొని ఏడుస్తుండగా ఆ ఇంట్లో పనిచేస్తున్న జయమ్మ (జయరాణి) తీసుకెళ్లి స్థానిక పోలీసుస్టేషన్‌లో సమాచారమిచ్చారు. బాలిక తరఫువారు ఎవరూ రాకపోవడంతో తన ఇద్దరు కుమార్తెలతో పాటు భవానీని పెంచి పెద్దచేసింది. కొన్నేళ్ల కిందటే వారంతా విజయవాడ వచ్చేశారు. భవానిని ఇంటర్‌ వరకు చదివించిన జయమ్మ ఆమెను పనిలో పెట్టేందుకు ఇటీవల స్థిరాస్తి వ్యాపారి మోహనవంశీ ఇంటికి తీసుకెళ్లింది. భవాని చిన్నప్పుడు తప్పిపోయిన విషయం తెలుసుకున్న వంశీ… ఆమె తల్లిదండ్రులు, సోదరుల ఆచూకీ కోసం ఫేస్‌బుక్‌లో వెతికారు. ఓ యువకుడు ఫోన్‌ చేసి భవానీ వివరాలన్నీ చెప్పాడు. అవన్నీ సరిపోలడంతో ఆ కుటుంబ సభ్యులందరూ భవానీతో వీడియోలో మాట్లాడారు. అనంతరం విజయవాడ వచ్చారు.

(Courtesy Eenadu)