• మృత్యుంజయురాలిగా బయటపడ్డ వైనం
  • టర్కీ భూకంపంలో 107కు చేరిన మృతులు

ఇజ్మీర్‌: నడుమువరకూ శిథిలాల మధ్య ఇరుక్కుపోయిన దేహం. కనుచూపు మేర ఒక్కరూ కనపడని శూన్యం. ఆకలిదప్పులతో అలమటిస్తూ, అమ్మ కోసం రోదిస్తూ మూడేళ్ల ఈ చిన్నారి నాలుగు రోజుల పాటు నరకం చూసింది. ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతూనే, తనను ఎవరైనా కాపాడకపోతారా అన్న ఆశతో ఎదురు చూసింది. దేవుడు ఆ చిన్నారి మొర ఆలకించాడో ఏమో.. శిథిలాలను తొలగిస్తున్న సహాయక బృందం అటువైపు వచ్చింది. శక్తినంతా గొంతులోకి తెచ్చుకుని వారిని పిలిచింది.  ఆ గొంతు విని ఆశ్చర్యపోయిన సహాయక బృంద సభ్యులు ఆచిన్నారి ఆచూకీ కనిపెట్టి వెలికి తీశారు. ఆ పాప ప్రాణాలతో బయటపడటం చూసి స్థానికులు సంభ్రమాశ్చర్యాలతో ‘దేవుడు గొప్పవాడు (గాడ్‌ ఈజ్‌ గ్రేట్‌)’ అంటూ గట్టిగా కేకలు పెట్టారు.

టర్కీలోని ఇజ్మీర్‌లో భూకంపం ధాటికి నేలమట్టమైన భవన శిథిలాల మధ్య ఇరుక్కుని 91 గంటల తర్వాత సురక్షితంగా బయటపడిన ఆ మృత్యుంజయురాలి పేరు ఐదా గెజ్గిన్‌. దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఆ పాప తల్లి మరణించింది. ప్రమాదం జరిగిన సమయంలో చిన్నారి తండ్రి, సోదరుడు ఇంట్లో లేరు. మంగళవారం ఆ పాపను వెలికి తీసిన సహాయక బృంద సభ్యుడొకరు మీడియాతో తన ఉద్వేగాన్ని పంచుకున్నారు. ‘‘మమ్మల్ని చూడగానే ఆ పాప చేయి ఊపింది. క్షేమంగానే ఉన్నట్లు తెలిపింది. ఆ మాట వినగానే మాకు అమితానందం కలిగింది’’అని తెలిపారు. పాపను ఆసుపత్రికి తరలిస్తుండగా తల్లి గురించి అడిగిందని, మీట్‌ బాల్స్‌, యోగర్ట్‌ డ్రింక్‌ కావాలని అడిగిందని అక్కడి మీడియా సంస్థ ఒకటి వెల్లడించింది. కాగా ఈ భూకంప ప్రమాదంలో ఇప్పటివరకూ మరణించినవారి సంఖ్య 107కు చేరింది.

Courtesy Eenadu