• మరో ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు..
  • నగరంలో వర్షాలకు 25 మందికిపైగా మృతి

హైదరాబాద్‌ సిటీ : మైలార్‌దేవుపల్లి పల్లె చెరువు ప్రవాహంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది కొట్టుకుపోయారు. వీరిలో ఇద్దరు మహిళల మృతదేహాలు దొరికాయి. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. దొరికిన వారి మృతదేహాలను పోలీసులకు తెలియకుండా ఖననం చేసేందుకు సైదాబాద్‌ జీవన్‌యార్‌ జంగ్‌ కాలనీకి తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ ఘటన రాజేంద్రనగర్‌ మండల పరిధిలో జరిగింది. వర్షాలకు మైలార్‌దేవుపల్లి పల్లె చెరువు నిండి అలుగు పారింది. కట్టపై నుంచి నీరు ప్రవహించింది. అలీనగర్‌లోని పలు నివాసాలలోకి వరద నీరు వచ్చి చేరింది. అలీనగర్‌ ప్రాంతానికి చెందిన తొమ్మిది మంది అందులో కొట్టుకుపోయారు. వారిలో దరాబ్‌ షా (35), తబస్సుమ్‌ (33) మృతదేహాలను ఫలక్‌నుమా అల్‌ జుబైల్‌ కాలనీ వద్ద ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బలగాలు గుర్తించాయి.

ఇక, వరద బీభత్సానికి ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే 25 మందికిపైగా మరణించారు. సెల్లార్‌ నీటిలో పడి, ప్రహరీ గోడలు కూలి పలువురు మృతి చెందారు. మరికొందరు గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు, పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు, కార్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. పదుల సంఖ్యలో వ్యక్తులు వరద నీటిలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. సుదూర ప్రాంతాల నుంచి మృతదేహాలు వరద నీటిలో మూసీలోకి కొట్టుకువచ్చినట్లు తెలుస్తోంది.

కొట్టుకుపోయిన నాలుగు మృతదేహాలు
భారీ వర్షానికి గగన్‌పహాడ్‌లో నివాసం ఉండే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నీటిలో కొట్టుకుపోయారు. శంషాబాద్‌ విమానాశ్రయ పోలీసులు మూడు మృతదేహాలను వెలికి తీసి ఉస్మానియా మార్చురీకి తరలించారు. గగన్‌పహాడ్‌ ప్రాంతంలో నివాసం ఉండే కరీమా బేగం(25), ఆమీర్‌ ఖాన్‌ (20), సాహిల్‌ (3), మరో ఆరేళ్ల బాలుడు నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయారు.

కొట్టుకుపోయిన జీహెచ్‌ఎంసీ కార్మికురాలు
జీహెచ్‌ఎంసీ కార్మికురాలి మృతదేహం కొట్టుకొచ్చిన ఘటన బుధవారం పహాడిషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. తుక్కుగూడ ఫ్లై ఓవర్‌ వద్దకు జీహెచ్‌ఎంసీ కార్మికురాలు వరలక్ష్మి మృతదేహం కొట్టుకొచ్చింది. అలాగే, నాగోల్‌- బండ్లగూడ చెరువు వద్ద వరద ఉఽధృతిలో మంగళవారం రాత్రి జీఎ్‌సఐ పోస్టల్‌ ఉద్యోగి సుందర్‌రాజ్‌ (52) కొట్టుకుపోయారు. బయటకు వెళ్లిన ఆయన.. తిరిగి ఇంటికి చేరుకునే క్రమంలో వరద నీటిలో జారిపడి చెరువులోకి కొట్టుకుపోయారు.

వరద భయంతో గుండెపోటు
ఖమ్మంకు చెందిన వి.నర్సింహారెడ్డి రిటైర్డ్‌ హెడ్మాస్టర్‌. తన భార్య రత్నమాల (65), కొడుకు రాంచంద్రారెడ్డితో కలిసి అల్మా్‌సగూడ శ్రీసాయిబాలాజీ టౌన్‌షి్‌పలో ఉంటున్నారు. వీరు మొదటి అంతస్తులో ఉంటుండగా, కింది పోర్షన్‌ మొత్తం మునిగిపోయింది. దాంతో, రత్నమాల ఆందోళనకు గురై గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయింది.

నీటిలో పడి వృద్ధురాలి మృతి
అల్వాల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో నాలా పొంగి పెద్ద ఎత్తున వరద నీరు ఇంట్లోకి చేరుకుంది. నాలా పక్కనే రెండో ఇంట్లో ఉంటున్న విజయా రెడ్డి ఆ వరద నీటిలో పడి మరణించారు.

ప్రహరీ కూలి ఓ వ్యక్తి మరణించిన ఘటన చాంద్రాయణగుట్ట ఘాజిమిల్లత్‌ కాలనీలో జరిగింది. మహ్మద్‌ మునీర్‌, స్నేహితుడు బాషా (35) బుధవారం ఉదయం ఇంటి ముందు నిలబడి నీటి ప్రవాహాన్ని చూస్తున్నారు. అదే సమయంలో ఎదురుగా ఉన్న ఒక ప్రహరీ వీరిపై కూలింది. మునీర్‌ తలకు, కాళ్లు, చేతులపై తీవ్రగాయాలు కాగా, స్నేహితుడు బాషా అక్కడికక్కడే మృతిచెందాడు. బంధువుల ఇంటికి వెళ్లి వస్తూ నాలాలో పడి ఓ మహిళ మృతి చెందింది. మణికొండకు చెందిన జోగు శంకర్‌, వరలక్ష్మి (32) అక్కాతమ్ముళ్ళు. మంగళవారం ఉదయం ఆదిభట్లకు వెళ్లి రాత్రి 11 గంటల సమయంలో శంషాబాద్‌ వైపు వెళ్తున్నారు. బైక్‌ అదుపు తప్పి నీటిలో పడిపోయింది. శంకర్‌ ఈదుకుంటూ ఒడ్డుకు చేరగా వరలక్ష్మి, ద్విచక్ర వాహనం నీటిలో కొట్టుకుపోయింది. బుధవారం ఉదయం 7 గంటల సమయంలో సర్వీస్‌ రోడ్డు పక్కన ఆమె మృతదేహం లభించింది.

సెల్లార్‌ నీటిలో పడి బాలుడు మృతి
దిల్‌సుఖ్‌నగర్‌ సాహితీ అపార్టుమెంట్‌లోని సెల్లార్‌ నీటిలో మునిగి బాలుడు మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే ఉన్నా.. మూడేళ్ల అజిత్‌ సాయి ఆడుకుంటూ వెళ్లి సెల్లార్‌ నీటిలో మునిగిపోయాడు. బాబు కోసం కిందకు వెళ్లిన తండ్రి యుగేందర్‌ నీటిలో మునిగిన సాయిని బయటకు తీసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

విద్యుదాఘాతంతో…
ఎల్బీ నగర్‌లో బైరామల్‌గూడలోని సాగర్‌ ఎన్‌క్లేవ్‌లో మోటార్‌ స్విచాఫ్‌ చేయడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి విద్యుదాఘతంతో మృతి చెందారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన కాసోజు నారాయణాచారి నగరానికి వచ్చి కార్పెంటర్‌గా జీవిస్తున్నారు. మోటారు స్విచాఫ్‌ చేయడానికి వెళ్లి విద్యుదాఘాతంతో ఆయన మరణించారు. ఆయన మృతదేహాన్ని ఎల్బీ నగర్‌ సీఐ అశోక్‌ రెడ్డి భుజాలపై మోసుకొని వాహనం వద్దకు తీసుకొచ్చారు. ఇక, భవనంసెల్లార్‌లో నిలిచిన వరద నీటిని బయటకు పంపించేందుకు మోటారు వేస్తుండగా విద్యుదాఘాతంతో ఓ వైద్యుడు మరణించారు. శ్రీనగర్‌ కాలనీలోని ఎస్‌బీహెచ్‌ కాలనీకి చెందిన డాక్టర్‌ చల్లా సతీశ్‌ కుమార్‌ రెడ్డి నేచురోపతి కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. మంగళవారం కురిసిన వర్షానికి భవనం సెల్లార్‌లో వరద నీరు చేరింది. బుధవారం ఉదయం దానిని బయటకు పంపించేందుకు మోటారు వేసేందుకు సెల్లార్‌లోకి వెళ్లారు. విద్యుత్‌ షాక్‌ తగిలి మరణించారు. అంబర్‌పేట వినాయకనగర్‌లో రాజ్‌కుమార్‌ అనే వ్యక్తి విద్యుత్తు షాక్‌తో మృతి చెందారు. సెల్లార్‌లోకి చేరిన నీటిని తొలగించేందుకు మోటార్‌ పెట్టారు. కొద్దిసేపటి తర్వాత మోటార్‌ ఆగిపోవడంతో నీటిలోకి దిగారు. కరెంట్‌ షాక్‌ తగిలి మరణించారు.

Courtesy Andhrajyothi