కొనసాగుతున్న పెట్రో సెగలు..
ధరల పెరుగుదలలో రికార్డులు
పెట్రోల్‌పై 48 పైసలు, డీజిల్‌పై 59 పైసలు పెంపు
మరింత పెరిగే అవకాశం : నిపుణులు

న్యూఢిల్లీ : దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరల పెంపు కొనసాగుతున్నది. వరుసగా తొమ్మిదో రోజూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. తొమ్మిది రోజుల్లోనే లీటరు పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 5.23 ధరలు పెరగడం గమనార్హం. సోమవారం లీటరు పెట్రోల్‌పై రూ. 0.48, డీజిల్‌పై రూ. 0.59 పెరగడంతో చమురు ధరలు కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. తాజా పెంపుతో అవి ఈ ఏడాది గరిష్ట స్థాయికి చేరాయి. పెరిగిన ధరలతో ముంబయిలో లీటరు పెట్రోల్‌ రూ. 83.17, డీజిల్‌ 73.21కి చేరింది. ఇది 2018 అక్టోబర్‌-నవంబర్‌లో నమోదైన ధరతో సమానం. సవరించిన ధరల ప్రకారం దేశ రాజధానిలో లీటరు పెట్రోల్‌ రూ.76.26, డీజిల్‌ రూ. 74.02 గా నమోదైంది. ఇవే ధరలు హైదరాబాద్‌లో రూ. 79.17, రూ. 72.93కి చేరుకున్నాయి.

బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ తగ్గింపు..
అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధరలు మరింత తగ్గుముఖం పడుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్ర వరిలో ముడి చమురు ధర బ్యారెల్‌ 55 డాలర్లుగా ఉండేది. అది మార్చి చివరినాటికి 20 డాలర్లకు పడిపోయిన విషయం విదితమే. ఆ తర్వాత మళ్లీ పుంజుకుని కొద్ది రోజులు గా 40డాలర్ల వద్ద ఉంది. కానీ సోమవారం బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధరలు దాదాపు 2 శాతం తగ్గాయి. దీంతో ప్రపంచ మార్కెట్‌లో ఒక బ్యారెల్‌ క్రూడ్‌ ఆయిల్‌ 37.90 డాలర్లకు పడిపోయింది. ఇవే ధరలు ఏప్రిల్‌లో నెగిటివ్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. కానీ మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాల కారణంగా మన దేశంలో మాత్రం సామాన్య ప్రజానీకానికి పెట్రో వాత తప్పడం లేదు.

మరో ఐదారు రూపాయలు పెరిగే ఛాన్స్‌
దేశ ప్రజానీకానికి ఇంకొన్ని రోజులు పెట్రో వాత తప్పదని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఏర్పడిన నష్టాలను పూడ్చుకోవడానికి ఆయిల్‌ మార్కెటింగ్‌ సంస్థలు ధరలను పెంచుతున్నాయని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. అందుకు కేంద్ర సర్కారు వారికి అనుమతులిచ్చిన ట్టు వారు ఆరోపిస్తున్నారు. తాజా ట్రెండ్‌ను బట్టి పెట్రో ఉత్పత్తుల ధరలు మరో రెండు వారాల దాక తగ్గకపోవచ్చునని అంటున్నారు. ఇదే జరిగితే లీటరు పెట్రోల్‌పై మరో రూ. 5 నుంచి రూ. 6 ల దాకా ప్రజలపై అదనపు భారం పడనుంది. రోజూవారీ ధరలు లీటరుపై 60 పైసలకు మించి పెరగవనీ, కానీ ధరలుమాత్రం ఇప్పట్లో తగ్గవని వారు అభిప్రాయపడుతు న్నారు. దేశంలో 12 వారాల తర్వాత.. ఈ నెల 6 నుంచి పెరుగుతున్న ఇంధన ధరలతో ఇప్పటికే దేశ ప్రజానీకంపై అదనంగా రూ. 5 భారం పడుతున్న విషయం తెలిసిందే.

Courtesy Nava Telangana