హర్యానా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై ఏడీఆర్‌ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ : హర్యానా అసెంబ్లీలోని మొత్తం ఎమ్మెల్యేల్లో 83 శాతం మంది కోట్లకు అధిపతులేనని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌(ఏడీఆర్‌) నివేదిక తెలిపింది. మొత్తం 90 మంది ఎమ్మెల్యేలలో 75 మంది కోటి రూపాయలకు పైగా ఆస్తులు కలిగి ఉన్నట్టు ఏడీఆర్‌ పేర్కొంది. ఎమ్మెల్యేల సగటు ఆస్తుల విలువ రూ.12.97 కోట్లుగా నిర్ధారించింది. బీజేపీకి చెందిన 48 మంది ఎమ్మెల్యేల సగటు ఆస్తులు రూ.10.34 కోట్లు కాగా, ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌కు (ఐఎన్‌ఎల్‌డీ) చెందిన 18 ఎమ్మెల్యేల సగటు ఆస్తుల విలువ రూ.13.63 కోట్లుగా తెలిపింది. 15మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సగటు ఆస్తుల విలువ రూ.12.43 కోట్లు, ఇద్దరు హర్యానా జన్‌హిత్‌ కాంగ్రెస్‌(బీఎల్‌) ఎమ్మెల్యేలు సగటు ఆస్తుల విలువ 80.12 కోట్లుగా ఉండగా, ఐదుగురు స్వతంత్య్ర ఎమ్మెల్యేల సగటు ఆస్తుల విలువ రూ.13.93 కోట్లుగా తెలిపింది. పది మంది ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని 2014లో వారు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్‌ పేర్కొంది. 90 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నట్టు వెల్లడించింది. బీజేపీకి చెందిన ఐదుగురు(10 శాతం), ఐఎన్‌ఎల్‌డీకి చెందిన ఇద్దరు(11 శాతం), కాంగ్రెస్‌, బీఎల్‌, స్వతంత్య్ర ఎమ్మెల్యేల్లో ఒక్కొక్కరు చొప్పున క్రిమినల్‌ కేసులు ఉన్నట్టు తేలింది.

 Courtesy Andhra jyothi