• కరోనా ప్రభావంలోనూ భారీ పోలింగ్‌.. 82.61ు ఓటింగ్‌ నమోదు
  • ప్రశాంతంగా ముగిసిన ఉప ఎన్నిక..
  • పలుచోట్ల ఈవీఎంల మొరాయింపు
  • గదుల్లో వెలుతురు లేదని ఓటర్ల అసంతృప్తి..
  • పీపీఈ కిట్లతో వచ్చిన కరోనా పేషెంట్లు
  • పరిశీలించిన చీఫ్‌ ఎలక్షన్‌ ఆఫీసర్‌ గోయల్‌..
  • సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్‌
  • స్ర్టాంగ్‌ రూముల్లోకి చేరిన ఈవీఎంలు..
  • ఈ నెల 10న సిద్దిపేటలో కౌంటింగ్‌

సిద్దిపేట/చేగుంట/తొగుట : ప్రచారంలో ఉద్రిక్తతలు, ఘర్షణలతో రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించిన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌ మాత్రం ప్రశాంతంగా జరిగింది. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోనూ మంగళవారం ఓట్లు పోటెత్తాయి. కరోనా ప్రభావంలోనూ 82.61 శాతం ఓటింగ్‌ నమోదైంది. హోరాహోరీ ప్రచారాలు, ఉద్రిక్త పరిస్థితులు, అరెస్టులు, దాడులు, మాటల యుద్ధాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీంతో మంగళవారం పోలింగ్‌ రోజు ఎలాంటి ఘర్షణలు తలెత్తుతాయోననే టెన్షన్‌ పోలీసు వర్గాలనూ కలవరపెట్టింది. అయితే సజావుగా ఎన్నిక జరగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆరంభంలో పోలింగ్‌ మందకొడిగా సాగినా.. ఆ తరువాత ఊపందుకుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా 9 గంటల వరకు కేవలం 12 శాతం మాత్రమే నమోదైంది. ఆ తర్వాత 11 గంటల వరకు 34 శాతానికి చేరింది.

మధ్యాహ్నం ఒంటి గంట వరకు 55 శాతం, 3గంటలకు 71 శాతం , 6 గంటల వరకు 82.61 శాతం నమోదైంది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. రాయపోల్‌ మండలం అనాజ్‌పూర్‌లో వీవీ ప్యాట్లు పనిచేయకపోవడంతో వెంటనే మార్చారు. చేగుంట మండలం కర్నల్‌పల్లిలో ఈవీఎం మొరాయించడంతో మరో ఈవీఎం బిగించడంతో 45 నిమిషాల ఆలస్యమైంది. దుబ్బాక మండలం దుంపలపల్లిలోనూ ఈవీఎం మొరాయించడంతో 15నిమిషాలు ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. దౌల్తాబాద్‌ మండలం గొడుగుపల్లిలోని పోలింగ్‌ కేంద్రం గదిలో వెలుతురు లేక ఈవీఎంలో గుర్తులు సరిగా కనిపించలేదని ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. దుబ్బాక మండలం చెల్లాపూర్‌, లచ్చపేట జడ్పీహెచ్‌ఎస్‌ కేంద్రంలోనూ ఇవే ఫిర్యాదులు వచ్చాయి. కాగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత తన స్వగ్రామం చిట్టాపూర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బొప్పాపూర్‌లో, కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివా్‌సరెడ్డి తొగుట మండలం తుక్కాపూర్‌లో ఓటు వేశారు. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు దుబ్బాక మండలం పోతారం గ్రామంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు.

పోలీసుల పటిష్ట బందోబస్తు
పోలింగ్‌ రోజు అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉప ఎన్నిక నేపథ్యంలో ఇప్పటికే సిద్దిపేట, దుబ్బాక, హైదరాబాద్‌లో పలు ఘటనలు చోటు చేసుకోవడం, అన్ని సందర్భాల్లోనూ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడం తెలిసిందే. పోలింగ్‌కు ఒక రోజు ముందు కూడా సిద్దిపేటలో ఘర్షణ జరిగింది. అందుకే పక్కా ప్రణాళికతో సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసుల నిఘాను పెంచారు. ఇక కరోనా నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని చర్యలు తీసుకున్నారు. కేంద్రంలో అడుగుపెట్టిన ప్రతి ఓటరునూ థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేశారు. చేతులకు శానిటైజర్‌ చల్లడంతోపాటు మాస్క్‌, గ్లవ్స్‌ అందజేశారు. భౌతికదూరం కోసం మార్కింగ్‌ వేశారు. అదనపు సిబ్బందిని కూడా నియమించడంతో పోలింగ్‌ ప్రక్రియ వేగంగా సాగింది.

పీపీఈ కిట్లతో వచ్చిన కరోనా రోగులు..
దుబ్బాక నియోజకవర్గంలో కరోనా సోకిన రోగులకు పీపీఈ కిట్లు అందజేశారు. వారు ఆ కిట్లను ధరించి పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. వీరి కోసం ప్రత్యేకంగా సాయంత్రం 5నుంచి 6 గంటల వరకు సమయాన్ని కేటాయించారు. మొత్తం 11 మంది కొవిడ్‌ పేషెంట్లు ఓటు వేసినట్లు అధికారులు తెలిపారు. అయితే చేగుంటలో ఓ కరోనా పేషెంట్‌ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, పీపీఈ కిట్‌ లేకుండా నేరుగా పోలింగ్‌ కేంద్రంలోకి వచ్చాడు. సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. తహసీల్దార్‌ పీపీఈ కిట్‌ తెప్పించి ఇచ్చారు. దానిని ధరించి అతను ఓటు వేసి వెళ్లాడు.

10న ఓట్ల లెక్కింపు
దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపును ఈ నెల 10న సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్‌ కాలేజీలో చేపట్టనున్నారు. ప్రస్తుతం 315 పోలింగ్‌ కేంద్రాల నుంచి ఈవీఎంలను లచ్చపేటలోని మోడల్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన డిస్పాచ్‌ సెంటర్‌కు తరలించారు. వీటిని పోలీసు బందోబస్తు నడుమ కాలేజీలోని స్ర్టాంగ్‌ రూముల్లోకి చేర్చారు.

Courtesy Andhrajyothi