800 కాలనీల్లో కన్పించని వాటి ఆనవాళ్లు ముడుపులతో ఆక్రమణదారులకు సహకరించిన అధికారులు జీహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగం పరిశీలనలో వెల్లడి.బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 14లో 500 గజాల స్థలంలో పార్కును అభివృద్ధి చేయడానికి అధికారులు సన్నద్ధమవుతుండగా, ఓ వ్యక్తి దాన్ని ఆక్రమించారు. తప్పుడు పత్రాలు సృష్టించి అనుమతి లేకుండానే భవన నిర్మాణం మొదలు పెట్టాడు. స్థానికుల నుంచి ఫిర్యాదులు అందినా అధికారులు స్పందించలేదని సమాచారం. అధికారుల చేతులు తడవడమే దానికి కారణమనే విమర్శలున్నాయి.

ఇది జీహెచ్ఎంసీ పరిధి కొండపూర్ శ్రీరామ్ నగర్ కాలనీలో పార్కులను సంరక్షించాల్సిన అధికారికి సంబంధించిన బహుళ అంతస్తుల భవనం. పక్కనే ఉన్నది పార్కు. ఆ స్థలంపై కన్నేసిన ఆయన దాని ప్రహరీని పడగొట్టారు. ముందుకు జరిపి కట్టేశారు. ఆ స్థలాన్ని ఇలా తన భవనంలో కలిపేసుకున్నారు. స్థానికులు అభ్యంతరం వ్యక్తంచేసినా ఆయన లక్ష్య పెట్టలేదు. విజిలెన్స్ పరిశీలనలో పార్కు స్థలాన్ని సదరు అధికారి ఆక్రమించినట్టు తేలింది.

ఈ విచిత్రం చూడండి. ఇది కొండాపూర్‌లోని పార్కు. దానికి ఎదురుగా ఉన్న ఓ హోటల్ యజమానికి దాని అవసరమొచ్చింది. అధికారులు ఆయనకు సహకరించారు. ప్రహరీని రెండున్నర అడుగుల కంటే తక్కువ ఎత్తులో నిర్మించారు. అందులోకి వెళ్లేందుకు వీలుగా దారినీ వదిలారు. ఇంకేముంది ఆయన దాన్ని తన వ్యాపార అవసరాలకు వాడుకుంటున్నారు. అతిథులకు అక్కడే కుర్చీలు వేసి మరీ వడ్డిస్తున్నారు. ఒక్కోసారి పార్కుకు తాళం వేస్తున్నారని, సందర్శకులనూ అనుమతించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ మహా నగరంలో రూ.వందల కోట్ల విలువైన పార్కు స్థలాలు అక్రమార్కుల హస్తగతమవుతున్నాయనేందుకు కొన్ని ఉదాహరణలివి. ఇవే కాదు మొత్తంగా దాదాపు 800 చోట్ల పార్కు స్థలాలు క్షేత్ర స్థాయిలో కనిపించడం లేదని జీహెచ్ఎంసీ విజిలెన్స్ అధికారుల పరిశీలనలో తేలింది.

వారి నిర్లక్ష్యం .. వీరికి వరం
గత పదేళ్లుగా బల్దియా అధికారులు పార్కుల అభివృద్ధిపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. గుర్తించిన పార్కు స్థలాల చుట్టూ ప్రహరీలు నిర్మించడం మరిచారు. దీన్ని అవకాశంగా మలుచుకున్న కబాదారులు అధికారుల చేతులు తడిపి సదరు స్థలాలను ఆక్రమించేశారు. కొంతమంది ఆక్రమిత స్థలాల్లో భవనాలు నిర్మిస్తున్నా పట్టించుకునే వారు కరవయ్యారు. ఇటీవల బల్దియా విజిలెన్స్ విభాగం సంచాలకులు విశ్వజిత్ కంపాటి నేతృత్యంలోని అధికారుల బృందం క్షేత్రస్థాయిలో అన్ని కాలనీలను పరిశీలించినపుడు ఆశ్చర్యకరమైన వివరాలు వెలుగులోకి

వచ్చాయి. దస్త్రాల్లో పార్కులుగా ఉన్న ప్రాంతాల్లో భవనాలు వెలిసినట్టు తేలింది. కొన్నిచోట్ల ఈ స్థలాలు – కాలనీల్లో భాగమైపోయినట్టు వెల్లడైంది. ఈ మొత్తం వ్యవహారం వెనుక అధికారుల ప్రమేయం ఉందని, – ముడుపులు తీసుకుని కొందరు ఆక్రమణదారులకు సహకరించడం వల్లనే ఇదంతా జరిగిందని విజిలెన్స్ – విభాగం నిర్ధారణకు వచ్చిందని సమాచారం.

కఠిన చర్యలు తప్పవు – విశ్వజిత్ కంపాటి, విజిలెన్సు విభాగం సంచాలకులు కొద్ది నెలలుగా క్రమణలను గుర్తించే పనిని ఆరంభించాం. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఇప్పటికే గుర్తించిన చోట కంచెలు వేయడం, ప్రహరీలు నిర్మించడం వంటివి చేస్తున్నాం. తదుపరి వాటిని అభివృద్ధి చేసి, ప్రజలకు ఆహ్లాదాన్ని అందిస్తాం. పార్కు స్థలాలు ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.

Courtesy Eenadu