• పట్టణాల్లో 7.5శాతం.. గ్రామాల్లో 6శాతమే
  • వ్యవసాయ, ఉపాధి హామీ పనులే కారణం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో పట్టణాల్లో కన్నా పల్లె ప్రాంతాల్లోనే నిరుద్యోగిత తక్కువగా ఉంది. పల్లెల్లో నిరుద్యోగిత 6 శాతంగా, పట్టణాల్లో 7.5 శాతంగా ఉంది. సెంటర్‌ ఫర్‌ మెయింటెయిన్‌ ఇండియన్‌ ఎకనమీ (సీఎంఐఈ) ఈ వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలో సగటు నిరుద్యోగిత కూడా తగ్గుతోంది. ఇది జూలైలో 9.1 శాతం ఉండగా, ఆగస్టుకు 5.8 శాతానికి తగ్గింది. జాతీయ సగటు మాత్రం 7.43 శాతం నుంచి 8.35 శాతానికి పెరగడం గమనార్హం. రాష్ట్రంలో పురుషుల్లో నిరుద్యోగులు 8.4 శాతం, మహిళల్లో 2.5 శాతం ఉన్నారు. పల్లెల్లో నిరుద్యోగిత తక్కువగా ఉండటానికి వ్యవసాయ, ఉపాధి హామీ పనులేననే అభిప్రాయాలున్నాయి. గ్రామీణ జనాభాలో 70శాతానికి పైగా వ్యవసాయ, అనుబంధ పనుల్లో నిమగ్నమవుతారు. ఇందుకు పరిస్థితులు అనుకూలించకుంటే  గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆదుకుంటోంది. గతంలో పట్టణ ప్రాంతాలకు వలస పోయిన కూలీలు.. కరోనా, లాక్‌డౌన్‌ పరిస్థితులతో గ్రామాలకు చేరుకున్నారు. వారందరికీ వ్యవసాయ, ఉపాధి హామీ పనులే అండగా నిలిచాయి. ఒక్కో రోజు 25 లక్షల మందికి పైగా పాల్గొన్నారు. రాష్ట్రానికి ఉపాధి హామీ పథకం కింద కేటాయించిన 13 కోట్ల పని దినాల్లో దాదాపు 12 కోట్ల పనిదినాలు ఇప్పటికే ముగిశాయి. పట్టణాల్లో కరోనా సంక్షోభ సమయంలో ఉపాధి లభించకపోవడం కారణంగానే ఇక్కడ నిరుద్యోగ శాతం ఎక్కువగా ఉందన్న భావన వ్యక్తమవుతోంది.