గత త్రైమాసికానికి 7.5 శాతం నమోదు
పట్టణ యువతలో 9 శాతం..
సీఎంఐఈ నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ : భారత్‌లోనూ నిరుద్యోగిత రేటు అంతకంతకూ పెరుగుతున్నది. 2019-20 ఆర్థిక సంవత్సరంలోని మూడో త్రైమాసికానికి (సెప్టెంబర్‌- డిసెంబర్‌) గానూ ఇది 7.5 శాతంగా నమోదైంది. 2016లో మోడీ సర్కారు చేసిన నోట్లరద్దు నిర్ణయం తర్వాత ఇది క్రమంగా పెరుగుతూనే ఉన్నది. 2017 మే-ఆగస్టులో ఇది 3.8 శాతం వద్ద నమోదుకాగా.. అప్పట్నుంచి పైకి పోవడమే తప్ప కిందికి దిగిరావడం లేదని భారత ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను విశ్లేషించే సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) తన తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలోని 1.74 లక్షల ఇండ్ల నుంచి సమాచారం సేకరించి దీనిని వెలువరించింది. నివేదిక ప్రకారం… 2019 నిరుద్యోగ యువతకు శాపంగా మారింది. దేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి ఉద్యోగం లేక ఖాళీగా కాలం వెల్లదీస్తున్నారు.

ముఖ్యంగా చదువుకున్న యువతలో ఇది ఎక్కువగా ఉంది. గ్రామీణ భారతంలో నిరుద్యోగిత రేటు 6.8 శాతం ఉండగా.. పట్టణాల్లో ఇది 9 శాతంగా నమోదైంది. పట్టణాల్లో విద్యావంతులైన యువతీయువకులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.

20-24 ఏండ్ల వయ స్సు ఉన్నవారిలో నిరుద్యోగ రేటు 37 శాతం నమో దైంది. వీరిలో గ్రాడ్యూయేట్లే 60 శాతానికి పైగా ఉన్నారు. 2019లో పట్టణ యువతలో నిరుద్యోగిత రేటు 63.4 శాతం. గడిచిన మూడేండ్లలో ఇది అత్యధికం. 20-29 ఏండ్ల మధ్య ఉండి గ్రాడ్యూయేషన్‌ పూర్తి చేసినవారిలో నిరుద్యోగిత రేటు 42.8 శాతంగా ఉందని నివేదిక పేర్కొంది.

(Courtesy Nava Telangana)