– పీఎంజీకేవైలో ఇచ్చినదానికంటే పాడైనవే అధికం
– లాక్‌డౌన్‌లో పేదలకు అందని అదనపు ధాన్యం
– ఎఫ్‌సీఐని నిండా ముంచుతున్న మోడీ సర్కారు

కరోనా వ్యాప్తిని నివారించడానికని కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో అసంఘటితరంగ కార్మికులు, వలసకూలీలు, పేదలు పడ్డ ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. సర్వం కోల్పోయి తినడానికి తిండిలేక అలమటిస్తున్న వీరిని ఆదుకుని.. వారి ఆహారావసరాలను తీర్చాల్సిన కేంద్ర సర్కారు చేతులెత్తేసింది. తన నియంత్రణలో ఉండే ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) గిడ్డంగుల్లో ఆహార నిల్వలు ఉన్నా.. వాటిని పేదలకు పంచడానికి మోడీ సర్కారు వెనుకడుగేసింది. ఫలితంగా ఈ ఏడాది జనవరి 1 నుంచి మే 1 దాకా ఎఫ్‌సీఐ గోదాముల్లో ఉన్న సుమారు 65 లక్షల టన్నుల ఆహారధాన్యాలు పందికొక్కుల పాలయ్యాయి. ప్రధాని మోడీ నేతృత్వం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలోని ఓ కుటుంబానికి చెందిన చిన్నారులు గడ్డి తిని కడుపు నింపుకుంటే.. బీహార్‌లో ఆకలికి తాళలేక చిన్నారులు చెరువుల్లో కప్పలు తిన్న వార్తలు దేశంలో ఆహార భద్రతపై అనుమానాల్ని పటాపంచలు చేశాయి.

న్యూఢిల్లీ : అత్యవసర సమయంలో దేశ ప్రజల ఆకలి తీర్చడానికని గిడ్డంగుల్లో నిల్వ ఉంచే ఆహారధాన్యాలు.. వృథాగా పాడైపోతున్నాయి. చేయడానికి పనుల్లేక.. కొనుగోలు చేసే శక్తి లేక ఓవైపు పేదలు ఆకలి బాధలు పడుతుంటే.. వారిని ఆదుకోవాల్సిన కేంద్రం మాత్రం గోదాముల్లో ఉన్న ధాన్యం నిల్వలను బయటకు పంపిణీ చేయక చోద్యం చూస్తున్నది. ఫలితంగా ఎఫ్‌సీఐ గిడ్డంగుల్లో ఈ ఏడాది జనవరి 1 నాటికి 7.17 లక్షల టన్నుల ధాన్యం నిల్వలు (బియ్యం, గోదుమలు) పాడవ్వగా.. గతనెల 1 నాటికి 71.81 లక్షల టన్నుల ధాన్యం పాడైపోయిందని ఎఫ్‌సీఐ అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ఇది లాక్‌డౌన్‌ సందర్భంగా తాము పేద ప్రజలను ఆదుకున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజనా (పీఎంజీకేవై) కింద రేషన్‌కార్డుదారులకు పంపిణీ చేసిన దానికంటే ఎక్కువ.

పీఎంజీకేవై కింద పంచిందెంత..?
లాక్‌డౌన్‌ సందర్భంగా ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకోవడానికి మూడు నెలల పాటు పేదలకు పీఎంజీకేవై కింద రేషన్‌ పంపిణీ చేస్తామని మార్చిలో కేంద్రం ప్రకటించింది. సుమారు 80 కోట్ల మందికి దీనికింద బియ్యం, గోదుమలు, పప్పు ధాన్యాలు ప్రస్తుతం ఇచ్చే దానికంటే ‘అదనంగా’ ఇస్తామని తెలిపింది. ఇందులో భాగంగా మే 22 నాటికి పంచిన మొత్తం 55.2 లక్షల టన్నులు మాత్రమే. ముందుగా ప్రకటించినట్టు 80 కోట్ల మందికి అదనపు సరుకులు అందజేస్తామని చెప్పినా.. అది 60 శాతం మందికి కూడా అందలేదని గతనెలలో ప్రముఖ ఆరగ్ల వెబ్‌ పోర్టల్‌ ‘ది వైర్‌’ పరిశీలనలో తేలింది. జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఐ)తో పాటు పీఎంజీకేవైని అందించిన ప్రభుత్వం.. ఏప్రిల్‌, మే నెలలో కలిపి 132.7 లక్షల టన్నుల (40.9 లక్షల గోదుమలు, 91.7 లక్షల టన్నుల బియ్యం) ధాన్యాన్ని పంపిణీ చేసింది.

ఇదిలాఉంటే కేంద్రం చెబుతున్నట్టు ‘అదనంగా ఇచ్చిన’ ధాన్యం పలు రాష్ట్రాల్లో కింది స్థాయిలో అర్హులకు పంపిణీ కాలేదని పలు స్వచ్చంద సంస్థలు చేస్తున్న సర్వేల్లో వెల్లడవుతున్నది. ఇదే విషయమై దర్బర్గ్‌ డెవలప్‌మెంట్‌ అడ్వయిజర్స్‌ నిర్వహించిన సర్వే ప్రకారం.. 43 శాతం గృహాలకు అదనపు ధాన్యం అందలేదని తేలింది. బీహార్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌లలో ఇది ఎక్కువగా ఉందని తెలిపింది.

గిడ్డంగులు ఫుల్లు…
గడిచిన మూడేండ్లలో దేశ రైతాంగం వాతావరణ పరిస్థితులను, క్రిమిసంహారకాలను తట్టుకుని పుట్ల కొద్దీ పంటలు పండిస్తున్నా.. దాన్ని నిల్వ చేయడానికి ప్రభుత్వం దగ్గర సరిపడా గోదాములు లేవు. ఉత్తరభారతంలో గోదుమలు, దక్షిణాన వరి పండుతున్నా.. ఉన్న కొద్దిపాటి గిడ్డంగుల్లోనే వాటిని కుక్కుతుండటంతో అవి త్వరగా పాడవుతున్నాయి. 2018 నుంచి ఎఫ్‌సీఐ అవసరాన్ని మించిన ధాన్యాన్ని నిల్వ చేస్తున్నది. ఈ ఏడాది మే 1 నాటికి ఎఫ్‌సీఐ వద్ద 878 లక్షల (8.7 కోట్ల) టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నాయి (ఇందులో 2.52 లక్షల టన్నుల ధాన్యాన్ని ఇంకా శుద్ధి చేయలేదు). నిబంధనల ప్రకారం 6.68 కోట్ల టన్నుల ధాన్యాన్ని నిల్వ ఉంచాలన్నా.. గోదాముల వద్ద అంతకు మించిన మిగులు నిల్వలున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో మిగులు ధాన్యాన్ని పేదలకు పంచాలని పౌర సమాజంతో పాటు రాజకీయ నాయకులు, మేధావులు, ఆర్థికవేత్తలు ప్రభుత్వాన్ని కోరినా.. మోడీ సర్కారు వారి మాటలను పెడచెవిన పెట్టింది.

ఎఫ్‌సీఐని అప్పుల్లోకి నెడుతున్న కేంద్రం
సాధారణంగా రైతుల వద్ద నుంచి నేరుగా గానీ, ప్రభుత్వం నుంచి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసే ఎఫ్‌సీఐ.. వాటిని మిల్లుల్లో పట్టించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తిరిగి పంపుతుంది. ప్రభుత్వాలు ఆ ధాన్యాన్ని (బియ్యం, గోదుమలు, పప్పు ధాన్యాలు) ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తాయి. అయితే ఎఫ్‌సీఐ వద్ద మిగిలిన ధాన్యాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోవడంలో బీజేపీ సర్కారు విఫలమవుతున్నది. వడ్లు, గోధుమలను కొని వాటిని శుద్ధి చేయడం, నిల్వ చేసినందుకు గానూ ఎఫ్‌సీఐకి ఖర్చు తడిసి మోపెడవుతున్నది. అయితే ప్రభుత్వానికి సరిపోగా మిగులు ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లలో అమ్ముకోవడానికి అవకాశం ఉన్నా.. అందుకు ప్రభుత్వం సరైన రీతిలో స్పందించడం లేదు. అంతేగాక గిడ్డంగుల నిర్వహణా ఖర్చులను గతంలో ప్రభుత్వాలే భరిస్తూ ఎఫ్‌సీఐకి అండగా నిలిచేవి. కానీ బీజేపీ సర్కారు వచ్చిన తర్వాత ఆ బాధ్యతల నుంచి క్రమంగా తప్పుకుంటుంది. అటు ధాన్యం అమ్ముకోలేక, ఇటు నిర్వహణ ఖర్చులను భరించలేక.. గతేడాది డిసెంబర్‌ నాటికి ఎఫ్‌సీఐ సుమారు రూ. 2.36 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. మరోవైపు రోజులకొద్దీ ధాన్యం నిల్వ ఉండటంతో అది పాడై మరింత నష్టాల్లోకి వెళ్తున్నది.

– 16న దేశవ్యాప్త నిరసనలు : సీపీఐ(ఎం) పిలుపు
– దెబ్బతిన్న ప్రజల జీవనోపాధి
– రోడ్డునపడ్డ వలసకార్మికులు
– ఉపాధి కోల్పోయిన 15 కోట్ల మంది

న్యూఢిల్లీ : ముందస్తు ప్రణాళిక లేకుండా కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా అన్నివర్గాల ప్రజల జీవనోపాధి దెబ్బతిన్నదని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో దాదాపు 15 కోట్లమంది ఉపాధిని కోల్పోయారని, పొట్టచేతపట్టుకొని వలస కార్మికులు రోడ్డునపడ్డారని, వీటిపై కేంద్రం ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని పొలిట్‌బ్యూరో బుధవారం ఒక ప్రకటనలో విమర్శించింది. కరోనా నేపథ్యంలో తలెత్తిన ఆరోగ్య సంక్షోభం, దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ… తదితర అంశాలపై బుధవారం వీడియో కాన్ప Ûరెన్స్‌ ద్వారా మొదటిసారిగా పొలిట్‌బ్యూరో సుదీర్ఘంగా చర్చించింది. ఆదాయపన్ను పరిధిలోకి రాని కుటుం బాలకు ఆరు నెలలపాటు ప్రతినెలా రూ.7500లు నగదు బదిలీ ద్వారా అందజేయాలని, ప్రతి ఒక్కరికి 10 కిలోల ఆహారధాన్యాల్ని ఉచితంగా పంపిణీ చేయాలని… మొదలైన 16 డిమాండ్లును నెరవేర్చాలంటూ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఈనెల 16న జరగబోయే నిరసనల్లో వామపక్ష శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పొలిట్‌బ్యూరో కోరింది.

కష్టాల్లో ఉన్న ప్రజల్ని గాలికివదిలేశారు
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ..దాని బారినపడకుండా ప్రజల్ని మోడీ సర్కార్‌ రక్షించలేకపోయింది. ఏ మాత్రం ప్రణాళిక లేకుండా, ఏకపక్షంగా ప్రధాని మోడీ దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధించారు. దేశ ప్రజల పట్ల అమానవీయంగా వ్యవహరించారు. 63రోజుల కఠిన లాక్‌డౌన్‌ అమలుద్వారా ప్రజలకు ఏదైనా మేలు జరిగిందా? అంటే..అదీ లేదు. పొట్టచేతపట్టుకొని వలస కార్మికులు రోడ్డున పడితే, సమస్యను పరిష్కరించలేకపోయారు. ఆ భారమంతా రాష్ట్రాలపై వేశారు.

దేశానికి ఆదర్శంగా నిలిచిన కేరళ
కరోనా మహమ్మారిని అరికట్టడంలో దేశానికి కేరళ ఆదర్శంగా నిలిచిందని అక్కడి వామపక్ష కూటమి ప్రభుత్వ పనితీరును పొలిట్‌బ్యూరో ప్రశంసించింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవటమేగాక, రెండో దశ వ్యాప్తిని సైతం విజయవం తంగా నిలువరించారని తెలిపింది. కరోనాను ఎదుర్కోవటంలో ‘కేరళ మోడల్‌’ ప్రపంచ గుర్తింపును సాధించగా, కేంద్రం ప్రభుత్వం మాత్రం కేరళ అనుభవాలు, పాఠాలు స్వీకరించడానికి నిరాకరిస్తున్నదని పొలిట్‌బ్యూరో తెలిపింది.

ఆర్థికవ్యవస్థ కుదేలు
కోవిడ్‌-19కు ముందే దేశం ఆర్థికమాంద్యంలోకి కూరుకుపోయింది. లాక్‌డౌన్‌ కారణంగా సంక్షోభం మరింత ముదిరింది. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం, దేశ జీడీపీ వృద్ధి 11ఏండ్ల కనిష్టస్థాయికి (4.2శాతం) పడిపో యింది. నాలుగో త్రైమాసికంలో వృద్ధి కేవలం 3.1శాతమే నమోదైంది. కరోనా, లాక్‌డౌన్‌ ప్రభావం పడకముందునాటి గణాంకాలివి. ఇక దీని ప్రభావమూ పరిగణలోకి తీసుకుంటే…దేశ ఆర్థికరంగం ఎంతగా దెబ్బతిన్నదో ఊహించవచ్చు. ప్రజల జీవన పరిస్థితులన్నీ తారుమారు అయ్యే ప్రమాదం ఏర్పడింది.

అసహజ లెక్కలతో ఆర్థికప్యాకేజీ
ఇంతకుముందు బడ్జెట్‌లో ఇచ్చిన కేటాయింపులనే మరోమారు ప్రస్తావించి మోడీ సర్కార్‌ రూ.20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. అదనంగా కేటాయించిన దానినిలెక్కేస్తే మొత్తం జీడీపీలో 1శాతం కూడా లేదు. ఆర్థిక ప్యాకేజీ పేరుతో మోడీ సర్కార్‌ నయా ఉదారవాద విధానాల్ని అమలుజేయడానికి సిద్ధమైంది. దేశ విదేశాల్లోని కార్పొరేట్‌ వర్గాలకు మరింత లబ్దిని చేకూర్చే సంస్కరణలకు పచ్చజెండా ఊపింది. ప్రభుత్వరంగంలోని అనేక సంస్థల్ని ప్రయివేట్‌కు గంపగుత్తుగా అమ్మేస్తున్నది. ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాల్లో విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచింది.

ఇప్పటికైనా ప్రజారోగ్యంపై దృష్టిపెట్టండి…
ప్రభుత్వ రంగంలో వైద్య సేవలు ఏమేరకు అందుబాటులో ఉన్నాయో, మౌలిక వసతులు ఏవిధంగా ఉన్నాయో గత రెండు నెలల్లో తేలిపోయింది. వైద్యరంగంలో అనుసరించిన ప్రయివేటీకరణ విధానాలే దీనికి కారణం. ప్రభుత్వ వైద్యరంగాన్ని మోడీ ప్రభుత్వం దెబ్బతీయటం వల్లే కరోనా కేసులు పెరగడానికి దారితీసింది. ఇప్పటికైనా ప్రజారోగ్యంపై పాలకులు దృష్టిసారించాల్సిన అవసరముంది. జీడీపీలో 3శాతం వైద్యరంగంపై ఖర్చు చేయాల్సిన అవసరముంది.

చైనాతో సరిహద్దు సమస్య
భారత్‌-చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి చర్చలొక్కటే మార్గం. ఇరు దేశాల రక్షణ, దౌత్య అధికారుల మధ్య చర్చలు జరపటం ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవచ్చునని పొలిట్‌బ్యూరో అభిప్రాయపడింది. తద్వారా ఇరు దేశాల మధ్య సాధారణ పరిస్థితులు నెలకొంటాయని తెలిపింది.

జులైలో కేంద్ర కమిటీ సమావేశాలు
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జులైలో కేంద్ర కమిటీ సమావేశాలు జరుగు తాయని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తెలిపింది. లాక్‌డౌన్‌వేళ ఉపాధి కోల్పోయిన చిరుద్యోగుల్ని, వలస కార్మికుల్ని ఆదుకోవటంలో దేశవ్యాప్తంగా తమ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సహాయ కార్యక్రమాలు చేపట్టాయని తెలిపింది. ఇకముందు కూడా ఈ సహాయ కార్యక్రమాలు కొనసాగుతాయని పొలిట్‌బ్యూరో ప్రకటించింది.

డిజిటల్‌ విద్య వద్దు
విద్యా సంవత్సరం ముగుస్తుందనగా లాక్‌డౌన్‌, కరోనా ప్రభావం చూపింది. విద్యార్థుల భవిష్యత్తు సైతం అగమ్యగోచరంగా తయారైంది. పార్లమెంట్‌ ఆమోదం లేకుండానే డిజిటల్‌ విద్యకు మోడీ సర్కార్‌ ఆమోదం తెలపటం సరైంది కాదు. విద్యా సంవత్సరం దెబ్బతినకుండా ఉండటం కోసం డిజిటల్‌ విద్యను చేపట్టవచ్చునుగానీ, మొత్తం పాఠశాల, కళాశాల విద్యకు ప్రత్యామ్నాయంగా చేపట్టరాదు.

Courtesy Nava Telangana