-కరోనా దెబ్బతో.. 62 శాతం కుటుంబాల పిల్లల మధ్యలోనే విద్యను ఆపేశారు
– ‘సేవ్‌ ది చిల్డ్రన్‌’ అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా దేశంలోని 62 శాతం కుటుంబాలకు చెందిన పిల్లలు తమ చదువులను మధ్యలోనే నిలిపివేశారని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. పిల్లల హక్కుల కోసం పనిచేసే ”సేవ్‌ ది చిల్డ్రన్‌” అనే సంస్థ ఈ సర్వేను జరిపింది. ఈ సర్వే నివేదిక ప్రకారం.. కరోనా నేపథ్యంలో దేశంలోని ఎక్కువ సంఖ్యలో పిల్లలు తమ చదువులను మధ్యలోనే నిలిపివేస్తున్నారు. దాదాపు 62 శాతం గృహాల్లో పిల్లల కరోనా మహమ్మారి కారణంగా విద్యను మధ్యలోనే నిలిపివేశారు. 40 శాతం మంది ప్రజలు తమ పిల్లలకు తగినంత భోజనం అందించలేకపోయారు. పది మందిలో ఎనిమిది మంది ఆదాయాన్ని కోల్పోయారు.

ఈ సర్వేను జూన్‌ 7 నుంచి 30 మధ్య నిర్వహించారు. ఈ సర్వేలో 7,235 గహాలు పాల్గొన్నాయి. సర్వే చేయబడిన కుటుంబాల్లో మూడొంతులు (62 శాతం) పిల్లలు చదువులను మధ్యలో నిలిపివేస్తున్నట్టు సర్వేలో వెల్లడైంది. అధికంగా ఉత్తరభారతంలో 64 శాతం మంది, దక్షిణ భారతంలో 48 శాతం మంది చిన్నారులు చదువులకు దూరం అవుతున్నారు. అలాగే, సర్వేలో పాల్గొన్న 80 శాతం కుటుంబాలు ఉపాధి అవకాశాలు కోల్పోయామనీ, తీవ్ర స్థాయిలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపాయి. అయితే, ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలపై హెచ్చార్డీ మంత్రిత్వ శాఖ నుంచి తక్షణ స్పందనలు కరువయ్యాయని నివేదిక పేర్కొంది. అలాగే, మధ్యాహ్న భోజనాన్ని (ఎండీఎం) రెండు వంతుల మంది పిల్లలకు అందడంలేదని నివేదించింది.

ఈశాన్య భారతంలో అధికంగా 52 శాతం, ఉత్తరభారతంలో 39 శాతం, దక్షిణ భారతంలో 38 శాతం, పడమర ప్రాంతంలో 28 శాతం మంది మధ్యాహ్న భోజనం పొందడం లేదని తెలిపింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారిగా చూస్తే.. పట్టణ ప్రాంతాల్లో 40 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 38 శాతం పిల్లలు మిడ్‌ డే మీల్స్‌ పొందలేదు. సేవ్‌ ది చిల్డ్రన్‌ (ఇండియా) ప్రోగ్రామ్స్‌ అండ్‌ పాలసీ డైరెక్టర్‌ అనిందిత్‌ రారు చౌదరి మాట్లాడుతూ.. ”ఈ నివేదిక ముఖ్యాంశాలు ఏమిటంటే.. పెద్ద సంఖ్యలో పిల్లలు విద్యకు దూరం అవుతున్నారు. విద్య పరంగా వారికి ఎలాంటి మద్దతు లభించడం లేదు. వారికి పోషకాహారం కూడా అందడం లేదు. మధ్యహ్న భోజనం అలవాటు చేసుకున్నప్పటికీ.. అది వారికి అందడం లేదు” అని అన్నారు.

ఇప్పటికీ పెద్ద సంఖ్యలో కుటుంబాల్లో స్మార్ట్‌ఫోన్లు లేవనీ, ఉన్న అవసరమైన ఇంటర్నెట్‌ సదుపాయం లేకపోవడంతో ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరయ్యే పరిస్థితులు సైతం లేవన్నారు. బడుల మూసివేత కారణంగా పదిమంది పిల్లల్లో నలుగురు మాత్రమే విద్యను పొందుతుండగా.. ఆ నలుగురిలో ఒకరు ఇంటిపనులు చేస్తున్నారన్నారు. దీని కారణంగా బాలకార్మికులు, అక్రమ రవాణా, పిల్లలపై లైంగిక దోపిడీల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశముందని చౌదరి వివరించారు.

Courtesy Nava Telangana