న్యూఢిల్లీ : వలస కూలీ అయిన తనకు ఉపాధి పోయింది. ఆశ్రయం పోయింది. కానీ.. ముకేశ్‌ మౌర్య(22) ఆత్మస్థైర్యం మాత్రం పోలేదు. ఢిల్లీ నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఊరిలో, పుట్టబోయే బిడ్డను చూడాలని నిర్ణయించుకున్నాడు. కాలినడకన బయలుదేరాడు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లాలో ముసాఫిర్‌ఖానా తన గ్రామం. ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్‌లో పనిచేస్తున్న తను అక్కడికి వెళ్లాలంటే ఎలాంటి రవాణా సౌకర్యమూ లేదు. అయినా సరే.. గత నెల 28న ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఎంత బలంగా అంటే.. సరిగ్గా బిడ్డ పుట్టడానికి ముందు తన ఇంటికి చేరుకున్నాడు. ఎన్నో గంటల నడక, మరెన్నో టన్నుల ఓపిక అతడి లక్ష్యాన్ని చేరుకునేందుకు సాయం చేశాయి. సరిగ్గా అతడు ఇంటికి చేరేసరికి.. తన భార్య నొప్పులు పడుతోంది. దీంతో వెంటనే అంబులెన్స్‌ను పిలిచి ఆస్పత్రికి తీసుకెళ్లారు. లోపలి నుంచి నర్సు బయటికి తీసుకొచ్చిన పండంటి మగబిడ్డను చూడగానే మౌర్య కష్టం దూదిపింజలా ఎగిరిపోయింది. అదృష్టవశాత్తూ మార్గమధ్యంలో అక్కడక్కడా బస్సులు రావడంతో సమయానికి ఇంటికి చేరుకోగలిగానని.. లేదంటే అపురూప క్షణాన్ని తప్పిపోయేవాడినంటూ ఊపిరి పీల్చుకున్నాడు. అయితే.. వెంటనే విషయం తెలిసి అప్రమత్తమైన స్థానిక అధికారులు అతడిని ఇంట్లో నిర్బంధం చేశారు. కానీ ఇప్పుడు అతడి బాధ ఇది కాదు. మున్ముందు ఇల్లు గడవడం ఎలా..? సంపాదన ఎలా..? దేశంలో లక్షలాదిమంది వలసకూలీల మదిలో ఉన్న ఈ ప్రశ్నలకు సమాధానాలు మాత్రం ఎవరి వద్దా లేవు.

Courtesy Andhrajyothi